మంత్రి మల్లారెడ్డిపై ఆర్నెళ్ల ముందునుంచే ఐటీ నజర్?!
posted on Nov 24, 2022 @ 9:31AM
ఐటీ దాడుల్లో మంత్రి మల్లారెడ్డి అడ్డంగా దొరికేశారా? కేంద్రంతో కాలు దువ్విన కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకే వరుసగా తెరాస నేతల నివాసాలు, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టాయా అంటే ఔననే పరిస్థితులే ఉన్నా.. మల్లా రెడ్డి వ్యవహారం కొంచం డిఫరెంట్ అంటున్నారు
పరిశీలకులు. మల్లారెడ్డి వ్యాపారాలు, నివాసాలపై ఐటీ అధికారుల దాడులు కేవలం ప్రస్తతం ఉన్న రాజకీయ వాతావరణం నేపథ్యంలో చేసినవే అనుకోవడానికి వీల్లేదంటున్నారు. గత కొన్ని నెలలుగా మల్లారెడ్డి వ్యాపార కార్యక్రమాలపై, కార్యకలాపాలపై ఐటీ నజర్ పెట్టిందంటున్నారు. ఏదో రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించేందకు జరిగిన దాడులలో వీటిని లైట్ తీసుకోవడానికి వీల్లేనంతగా మల్లారెడ్డి ఇరుక్కున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి వ్యాపార కార్యక్రమాలు మల్లారెడ్డి వ్యాపారాలపై ఐటీ అధికారులు దాడులను ఒకటిరెండు రోజుల్లో ప్లాన్ చేసింది కాదట. గత ఆర్నెళ్లుగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి, వారి కుటుంబ సభ్యుల అకౌంట్‌లలో నగదు వివరాలపైనా ఆరా తీస్తున్నారంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, తమ భూమిని కొనుగోలు చేయాలంటూ మంత్రి వద్ద ఐటీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించారని విశ్వసనీయంగా తెలిసింది.
వీటన్నిటినీ బట్టి చూస్తే పక్కా ప్రణాళికతోనే మల్లారెడ్డి వ్యాపారాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మంగళవారం(నవంబర్ 22) రాత్రి వేర్వేరు చోట్ల నిర్వహించిన సోదాలలో దాదాపు రూ.4 కోట్ల రూపాయల నగదు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన సీడీలు, కంప్యూటర్ డిస్క్ లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బుధవారం(నవంబర్ 23)సైతం కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన ఐటీ దాడులు ముగిశాయి. సోమవారం నాడు తమ విచారణకు హాజరుకావాలంటూ మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటి మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో జరిపిన సోదాలలో స్వాధీనం చేసుకున్న నగదు వివరాలనూ ఐటీ అధికారలు వెల్లడించారు. ఆ ప్రకారం మల్లారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు, మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో - రూ. 12 లక్షలు, మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో - రూ. 6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాసంలో - రూ. 3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో - రూ. 1.5 కోట్లు, త్రిశూల్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు, రఘునందన్ రెడ్డి నివాసంలో - రూ. 2 కోట్లు, ప్రవీణ్ కుమార్ నివాసంలో - రూ. 2.5 కోట్లు, సుధీర్ రెడ్డి నివాసంలో - రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు.