చాలు బాబూచాలు.. ప్రభుత్వ సలహాదారు నియామకాలపై పార్టీ శ్రేణుల్లోనే పెదవి విరుపు !
posted on Nov 23, 2022 @ 3:23PM
ఈ కలికాలంలో దేవుడు కరుణిస్తాడో? లేదో? కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అస్మదీయులను తెగ కరుణించేస్తున్నారు. అయితే ఆయన కరుణ.. వైసీపీ శ్రేణుల్లోనే ఒకింత అసంతృప్తికి కారణమౌతోందంటున్నారు. సలహారుల పేరిట జగన్ ఎడాపెడా చేస్తున్న నియామకాల పట్ల వైసీపీలోనే చిర్రుబుర్రులు మొదలయ్యాయని అంటున్నారు.
తాజాగా గాయని మంగ్లీని.. శ్రీవెంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ)లో సలహాదారుగా నియమించడం పట్ల వైసీపీలోనే విస్మయం వ్యక్తమౌతోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నటులు ఆలీ, పోసాని కృష్ణమురళీలకు ఇటీవల జగన్ ప్రభుత్వం.. సలహాదారు పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలువురు సలహాదారుల నియామకాలు జరిగాయి. ఈ సలహాదారు నియామకాల పట్ల విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లల చెల్లింపులకు ఎగనామం పెట్టి, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలన్న ధ్యాసే లేకుండా వ్యవహరిస్తున్న సర్కార్ అస్మదీయులకు ఎడాపెడా లక్షల రూపాయల వేతనాలతో సలహాదారు పదవులు పందేరం చేయడమేమిటని వైసీపీ శ్రేణుల్లోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్ సర్కార్ బిల్లులు ఎగ్గొట్టిన కాంట్రాక్టర్లలో వైసీపీ వారూ ఉన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. తాజాగా మంగ్లీకి సలహాదారు పదవిని కట్టబెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ నియామకాల వెనుక పెద్ద కథే ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. గతంలో అంటే.. 2019 ఎన్నికల వేళ.. అలీ, పోసాని, మంగ్లీలు ముగ్గురూ కూడా వైసీపీ కోసం పని చేశారనీ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలలో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వీరికీ పదవులను కట్టబెట్టారని అంటున్నాయి.
ఒక వేళ పదవులు ఇవ్వకుంటే వారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయరన్న భయంతోనే జగన్ ముగ్గురికీ సలహాదారు పదవులు కట్టబెట్టారని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో అలీ, పోసానిలకు మంచి స్థానాలు కల్పిస్తానని జగన్ వాగ్దానం చేశారనీ, అందుకే సలహాదారు పదవులను వారికి కట్టబెట్టినా వారు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారనీ, ఈ పరిస్థితుల్లో వారు వచ్చే ఎన్నికల్లో గతంలోలా పార్టీ కోసం చురుగ్గా పని చేసే అవకాశాలు అంతంత మాత్రమేనని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక మంగ్లీ విషయానికి వస్తే అలీ, పోసానిలకు పదవులు ఇచ్చి.. మంగ్లీని వదిలేస్తే ఆమె చిన్నబుచ్చుకుంటుందన్న ఉద్దేశంతోనే ఆమెకూ ఒక పదవి ఇచ్చారని అంటున్నారు.
అదీకాక.. వచ్చేది ఎన్నికల సీజన్.. ఇప్పటికే జగన్ ఫ్యామిలీలోని వారంతా దాదాపుగా దూరం జరిగిపోయారని.. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున, పార్టీ కోసం సెలబ్రిటీల ప్రచారం లేకుంటే.. ఓట్లు రాలే పరిస్థితులు లేవన్న బెదురు జగన్ లో ఏర్పడిందంటున్నారు. అందుకే ఇప్పటికీ పార్టీనే అంటిపెట్టుకుని అసంతృప్తిని పెదవుల బిగువున అదిమిపెట్టుకుని సహనంతో వేచి చూస్తున్న ముగ్గురికీ సలహాదారు పదవులు కట్టబెట్టారన్న చర్చ అయితే పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ మాత్రం పదవులైనా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో వీరు కూడా పార్టీ ప్రచారానికి అందుబాటులోకి రారన్న జంకే వారికి పదవులు కట్టబెట్టేలా చేసిందని అంటున్నారు. లేకపోతే మూడేళ్ల పాటు వారిని పూర్తిగా విస్మరించిన జగన్ ఇప్పటి కిప్పుడు హడావుడిగా సలహాదారు పోస్టులను వారి కట్టబెట్టి ఉండరని అంటున్నారు. అదలా ఉంచితే.. మంగ్లీకి ఎస్వీబీసీ సలహాదారు పోస్ట్ కట్టబెట్టడంతో.. గత ఎన్నికల సందర్భంగా ఆమె జగన్ కోసం ప్రచారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే గత ఎన్నికల వేళ ప్రచారం చేసినందుకు... దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఆలీ, పోసాని, మంగ్లీలకు పదవులిచ్చి జగన్ వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తామన్ వాగ్దానం తీసుకున్నారని అంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. జగన్ సలహాదారుల నియామకాలు మరింత జోరందుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జగన్ సలహాదారులుగా నియమిస్తున్న వారి ప్రచారం రానున్న ఎన్నికలలో పార్టీకి ఎంత వరకూ మేలు చేస్తుందన్న అనుమానాలు పార్టీ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. అలీ కానీ, పోసాని కానీ, చివరాఖరికి మంగ్లీ కానీ పెద్దగా ప్రజాకర్షణ శక్తి ఉన్నవారు కాదని వారీ సందర్బంగా అంటున్నారు.