మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు నోటీసులు
posted on Nov 23, 2022 @ 1:33PM
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఐటీ, ఈడీ, సీబీఐ ఇంకా సిట్ నోటీసుల హంగామా నడుస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు ఇప్పుడు నోటీసులు అంటే ఉలిక్కి పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు కూడా ఓ నోటీసు అందింది.
అయితే ఈ నోటీసు ఏదో దర్యాప్తు సంస్థ నుంచి కాదు. అక్రమ సంపాదన, కబ్జాలు, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించినది అంత కంటే కాదు. కానీ గోవాలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించాడంటూ ఆయనకు టూరిజం శాఖ నోటీసులు జారీ చేసింది.
ఇంతకీ యువరాజ్ సింగ్ చేసిందేమిటయ్యా అంటే.. గోవాలోని తన విల్లాను అద్దెకు ఇస్తానంటూ ఒక ఆన్లైన్ ప్రకటన ఇవ్వడం. ఆన్లైన్ ప్రకటన ఇస్తే నోటీసులేమిటంటారా.. గోవాలో ఎవరైనా సరే తమ విల్లాలు కానీ, నివాసాలు కానీ అద్దెకు ఇవ్వదలచుకుంటే తప్పని సరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి.
అయితే యువరాజ్ సింగ్ అలా రిజిస్టర్ చేయించుకోకుండా తన విల్లాను అద్దెకు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. దీంతో యువరాజ్ సింగ్ కు నోటీసులు జారీ చేసిన గోవా టూరిజం శాఖ వచ్చే నెల 8న వ్యక్తిగతంగా తమ ఎదుటకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.