జగన్ దృష్టిలో కొడాలి నాని కూరలో కరివేపాకేనా?
posted on Nov 24, 2022 @ 11:28AM
అధినేత అండ తనకు మెండుగా ఉందనుకున్నారు.. ఆపైన మంత్రి పదవి కూడా ఇవ్వడంతో రెచ్చిపోయారు.. తనకు ఇక తిరుగే ఉండదనుకున్నారు. అబ్బో.. అధినేత తనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేస్తున్నారో.. అని ఊహించుకుని ఓవర్ యాక్షన్ డోస్ పెంచేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , ఇతర టీడీపీ నేతల పై నిత్యం నోటికొచ్చిన మాటలతో హద్దులు దాటి విమర్శలు చేశారు.
చంద్రబాబును తిడితే చాలు తన స్థానం పదిలం అనుకున్న ఆయన ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిన మాజీ మంత్రి కొడాలి నాని. జగన్ రెడ్డి తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొడాలి నాని అమాత్య పదవి పీకేశారు. దాంతో కంగు తిన్న కొడాలిని పల్నాడు ప్రాంతీయ సమన్వయకర్త అనే ముద్ర వేసి కొద్దిరోజులు సంతృప్తి పడమన్నారు. తాజాగా ఆ పదవి నుంచి కూడా పీకేసి నీ స్థాయి ఇదే అని చెప్పకనే చెప్పారు. దీంతో కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు కూరలో కరివేపాకులా అయిందని వైసీపీ శ్రేణులో జోకులేసుకుంటున్నాయి. అచ్చోసిన ఆంబోతులా రెచ్చిపోయిన కొడాలి నానికి తగిన శాస్తే జరిగిందని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు.
నోరు తెరిస్తే.. బూతులు మాట్లాడే మాజీ మంత్రి కొడాలి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందన్న భావన ఇటు సొంత పార్టీలోనూ, అటు విపక్ష నేతల్లోనూ వ్యక్తమౌతోంది. గతంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవి కోల్పోయిన సందర్భంలో కొన్ని రోజులు తన పశువులపాకలో నులక మంచంపై వెల్లకిలా పడుకుని దిగులుగా కనిపించిన కొడాలి నాని ఉన్న ఒక్క చిన్న పదవి కూడా చేజారడంతో ఇప్పుడెలా కనిపిస్తారో చూడాలన్న ఆసక్తి వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతోంది. సరే మంత్రి పదవి పోయినప్పుడు కొంతకాలం స్తబ్ధుగా ఉన్న కొడాలి.. మళ్లీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే లీకులు రావడంతో మరోసారి తన బూతుల విశ్వరూపం ప్రదర్శించారు. ఆ తర్వాత కేబినెట్ రీ షఫిల్ విషయాన్ని సీఎం జగన్ పక్కన పెట్టేయడంతో మళ్లీ మౌనంలోకి జారుకున్నారు.
తర్వాత విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తొలగించి, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మార్చినప్పుడు అధినేత ఆదేశానుసారం కొడాలి నాని కిమ్మనకుండా ఉన్నారు. ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు ప్రశంసించని వారు వర్శిటీ పేరులో ఎన్టీఆర్ తొలగించడంపై ఎందుకు స్పిందిస్తున్నారంటూ తన సహజ బూతుల ధోరణిలో కొడాలి ఆని స్పందించడం గమనార్హం. ఇంకో పక్కన గుడివాడ నియోజకవర్గంలో తనను గెలవనివ్వకూడదని టీడీపీ అధినేత కంకణం కట్టుకుని బలమైన అభ్యర్థిని బరిలో దింపే యత్నాలు చేస్తుండడంతో మళ్లీ రెచ్చిపోయారు. తనపై గుడివాడ బరిలో నేరుగా చంద్రబాబు దిగినా.. నారా లోకేశ్ నిలబడినా.. లేదా కోట్ల రూపాయలు తెచ్చి ఎన్నారైతో ఢీకొట్టాలని చూసినా.. ఓటర్లు తనకే పట్టం కడతారని కొడాలి నాని గొప్పలు పోయారు.
ఇత తాజాగా వైసీపీ కేబినెట్ లో కమ్మ సామాజికవర్గానికి చోటు లేకుండా చేసిన జగన్ తీరును తప్పుపట్టిన మాజీ మంత్రి, సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు పై కొడాలి నాని తీవ్రంగా స్పందించడం విశేషం. కేబినెట్ మంత్రి పదవి ఇస్తేనే కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టా? అని ప్రశ్నించారు. చివరికి కొడాలి నాని ఎంతదాకా వెళ్లారంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కదా..! ఆయనది కేబినెట్ ర్యాంకే కదా అని వ్యాఖ్యానించేంత వరకూ వెళ్లారు. ప్రతిపక్షనేత పోస్టును కూడా ప్రభుత్వం ఖాతాలో వేసేందుకు కూడా కొడాలి తెగించేశారు.
వైసీపీ అధినేతకు కొడాలి నాని ఎంత గట్టి మద్దతుదారుగా ఉన్నప్పటికీ ఆయన ఒక్కొక్క పదవినీ పీకేస్తూ.. జగన్ నిర్ణయాలు తీసుకోవడం చూస్తే ఆయన గుడివాడలో నెగ్గడం సంగతి దేవుడెరుగు.. అసలు పోటీ చేయడానికి పార్టీ టికెట్టైనా వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ ఇప్పటి వరకూ వాడుకుని వదిలేసిన నాయకుల జాబితాలో తాజాగా ఇప్పుడు కొడాలి నాని పేరు కూడా చేరింది.