మంత్రి మల్లారెడ్డి.. అతికి పోయి అడ్డంగా దొరికారా ?
posted on Nov 23, 2022 @ 1:44PM
మంత్రి మల్లారెడ్డి ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ నాయకునిపై ప్రశంసలు కురిపిస్తారు. వీర విధేయత చూపిస్తారు. తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆయన ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే, పార్టీ మారి తెరాసలో చేరిన తర్వాత ఆయన ఇన్స్టంట్ గా గులాబీ బాస్ కి వీరాధీ వీర విధేయుడిగా మారిపోయారు. చంద్రబాబును స్తుతించిన కీర్తనలనే, పేరు మార్చి, కేసీఆర్ పేరున ఆలపించారు. అదే సమయంలో ఆయన, తనను తాను గొప్పగా చూపుకున్నారు. మోడీ చాయి అమ్మి ప్రధాని అయితే, తను పాలమ్మి మంత్రిని అయ్యాయని గొప్పలు చెప్పుకున్నారు.
సైకిల్ మీద ఇంటినికి వెళ్లి పాలు అమ్ముకున్న రోజుల నుంచి విద్యా వ్యాపారంలో ఆయన ఎక్కిన మెట్లు, సంపాదించిన కరెన్సీ కట్టలు మొదలు, రాజకీయాల్లో ఎదిగిన తీరు గురించి... బహిరంగంగా దాపరికం లేకుండా, చెప్పుకుంటారు. వందల వేల కోట్ల రూపాయలు, లెక్కకు చిక్కని ఆస్తులు సంపాదించిన వైనాన్ని, బహిరంగ వేదికల నుంచి హరి కథ, బుర్ర కథ చెప్పినట్లు, అన్నీ నేనే, అంతా నేనే’ అని చెప్పుకుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ఒక విధంగా, ముక్కలు తిని బొక్కలు మెళ్ళో వేసుకున్నట్లుగా, గుంభనంగా దాచుకోవలసిన రహస్యాలను ప్రపంచం ముందు చాటింపు వేసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. ఇది ఆయన అమాయకత్వం అనాలో, బోళాతనం అనాలో లేక అతి తెలివి అనాలో తెలియదు కానీ, ఒక విధంగా ఆయన స్వయంగా చాటింపు వేసుకున్న,‘సుగుణాలే’ ఇప్పడు ఆయం మెడకు చుట్టూ కున్నాయని, ఆయన సన్నిహితులు అంటున్నారు.
నిజానికి నేటి రాజకీయాల్లో, వ్యాపారంలో నీతివంతులు,నిజాయతీ పరులు ఉంటారని అనుకోవడం అయితే మన అజ్ఞానం కాదంటే మన అవివేకం అనిపించు కుంటుందే కానీ, మరొకటి కాదు. నేతి బీరకాయలో నెయ్యి, రాజకీయాల్లో నీతి ఉండవుగాక ఉండవని అందరికీ అర్థమై పోయింది. అలాగని మల్లా రెడ్డి, ఏ తప్పు చేయలేదని కానీ, ఆయన సినిమాల్లో చిరంజీవి రిక్షా తొక్కి, రాళ్లు కొట్టి కోట్లు సంపాదించినట్లు, నిజజీవితంలో మాలా రెడ్డి కష్టపడే, కోట్లకు పడగ లెత్తారని కాదు. ఆయన చేసిన తప్పులను సమర్ధించడం అసలే కాదు కానీ, మల్లా రెడ్డిని మించిన మహాను భావులు, మహా కుబేరులు తెరాసలోనే చాలా మంది ఉన్నారు.నిజానికి, అక్రమమా, సక్రమమా,అనేది పక్కన పెడితే మల్లారెడ్డి రాజకీయాలలోకి రాక ముందే కోట్లలో ఆస్తులు సంపాదించారు.విద్యావ్యాపారంలో,కాంట్రాక్టులు ఇతర వ్యాపారాలలో కోట్లకు కోట్లు సంపాదించారు.
రాజకీయాలలోనూ ఆయన మరిన్ని కోట్లు సంపాదించి ఉంటే సంపాదించి ఉండవచ్చును కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో చిల్లి గవ్వకు టికాన లేని చాల మంది, పెద్దలు, ముఖ్య నాయకుల కుటుంబాలు ఈరోజున కుబేరుని సరసన కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఎవరి దాకానో ఎందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే అలాంటి ఆరోపణలు ఎదుర్కుంటోంది. నిజా నిజాలు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యుల అస్తుల లెక్కలు తీస్తే, మల్లారెడ్డి చాల గొప్పగా చెప్పుకునే వేల కోట్ల ఆస్తులు చిన్నబోతాయని అంటారు.
సరే, ఆ విషయం ఎలా ఉన్నా, ఇప్పడు మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై జరుగుతున్న దాడులు,ఆయన్ని,ఆయన కుటుంబం మొత్తాన్ని, చిక్కులోకి నెట్టివేసిందని,ఆయన సన్నిహితులే అంటున్నారు.
రేపు కేసు ఏమవుతుంది, ఏమిటనేది పక్కన పెడితే, మంగళవారం(నవంబర్22) ఉదయం నుంచి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, వ్యాపార, విధ్యా సంస్థలు లక్ష్యంగా సాగుతున్న ఐటీ దాడులు సృష్టించిన టెన్షన్ కారణంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్నాయి. మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి హైపర్ టెన్షన్ వల్ల అస్వస్ధతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. సూరారంలోని నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న కుమారుని పరామర్శించేందుకు వెళ్ళిన మల్లారెడ్డిని, ఐటీ అధికారులు లోపలి అనుమతించే లేదు. దీంతో ఆయన, ఐటీ అధికారులు తన కొడుకుని చూడనివ్వడం లేదంటూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు అనుచరులు కూడా ఆస్పత్రి ముందు మెట్లపై కూర్చోని ఆందోళనకు చేపట్టారు.
అయితే, మల్లారెడ్డి కుమారుడు, మహేందర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని, హైపర్ టెన్షన్ వల్ల అస్వస్ధతకు గురైనట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పారు. మరోవంక మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి కూడా అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అతడిని కూడా ఐటీ అధికారులు సూరారంలో మహేందర్ రెడ్డి చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో మల్లారెడ్డి తనకు తానుగా సమస్యలు సృష్టించుకున్నారని, అతికి పోయి అనర్ధాలు కొని తెచ్చుకున్నారని, ఆయన సన్నిహితులు అంటున్నారు. అందుకే ఇప్పటికైనా, మల్లారెడ్డి మాత్రమే కాకుండా, తమను తాము అతిగా ఉహించుకుని, హద్దులు దాటుతున్న రాజకీయ నాయకులు అందరికీ ఈ ఉదంతం ఒక గుణపాఠం కావాలని అంటున్నారు.