పాపం శ్రద్ధావాకర్.. రెండేళ్లుగా నిత్యనరకం!
posted on Nov 24, 2022 5:54AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రేమించి ప్రియుడి కోసం తల్లిదండ్రులను వీడి వచ్చేసిన శ్రద్ధా వాకర్ 2019 నుంచి తనకు నచ్చిన అప్థాబ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. ఏడాది పాటు వారి సహజీవనం సంతోషంగానే సాగింది. అయితే 2020 నుంచి అప్తాబ్ ఆమెకు నిత్యం నరకం చూపేవాడని విచారణలో వెలుగులోకి వచ్చింది.
అప్తాబ్ తనను చిత్రహింసలు పెడుతున్నాడంటూ శ్రద్ధావాకర్ 2020లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హత్య చేయడానికి ప్రయత్నించాడని కూడా ఆ లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొంది. ఒక డేటింగ్ యాప్ ద్వారా 2019లో దగ్గరైన శ్రద్ధ, అఫ్తాబ్‌లు అప్పటి నుంచి సహజీవనం సాగిస్తున్నారు. శ్రద్ధావాకర్ పెళ్లి కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించినప్పటి నుంచీ అంటే వారి సహజీవనం మొదలైన ఏడాది తరువాత నుంచి అప్తాబ్ చిత్రహింసలు మొదలయ్యాయని ఆమె ఫిర్యాదును బట్టి అర్ధమౌతుంది. అప్తాబ్ తనను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయం అతని తల్లిదండ్రులకూ తెలుసునని శ్రద్ధావాకర్ తన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఆ తరువాత అప్తాబ్ తల్లిదండ్రుల జోక్యంతో ఇకపై గొడవలు పడకుండా జీవిస్తామని అప్తాబ్ పోలీసులకు మరో లేఖ ఇచ్చింది. కానీ అప్తాబ్ తనను చిత్రహింసలకు గురి చేసిన సందర్భంగా గాయాలతో ఉన్న తన ఫొటోలను స్నేహితులకు షేర్ చేసింది. ఆ సమయంలోనే ఆమె గాయాలతో ఆసుపత్రిలో కూడా చేరింది. పెద్దల జోక్యంతో శ్రద్ధా మళ్లీ అప్తాబ్ తో కలిసి సహజీవనం కొనసాగించింది. అయితే శ్రద్ధావాకర్ కు అప్తాబ్ నిత్యనరకం చూపాడు.
ఆ విషయాలన్నీ స్నేహితులకు చెప్పుకుని బాధపడేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ క్రమంలోనే అప్తాబ్ శ్రద్ధాను ఈ ఏడాది మేలో హత్య చేశాడు. శ్రద్ధాను హత్య చేయాలని ఆఫ్తాబ్ ప్లాన్ వేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆఫ్తాబ్ మాత్రం ఆవేశంలో శ్రద్ధాను హత్యచేసినట్లు పోలీసుల విచారణలో, ఇటీవల కోర్టులో చెప్పాడు. ఆఫ్తాబ్ నుంచి అసలు నిజాలు రాబట్టేందుకు కోర్టు నార్కో పరీక్షలకు అనుమతినిచ్చింది. కాగా నమ్మి వచ్చిన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్యచేసిన ఆఫ్తాబ్‌ను ఉరితీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.