హర్యానాలో కాంగ్రెస్ కొంప ముంచిన ఆప్!
posted on Oct 9, 2024 @ 11:08AM
హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్సే కాదు.. స్వయంగా బీజేపీ సైతం రాష్ట్రంలో ఓటమి ఖాయమన్న అంచనాకు వచ్చేసింది. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉండటం, అలాగే ప్రధాని మోడీవి రైతాంగ వ్యతిరేక విధానాలంటూ రైతులలో వెల్లువెత్తిన తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో పరిశీలకులు సైతం హర్యానాలో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద బండినడకే నంటూ విశ్లేషణలు చేశారు.
ఇక బీజేపీ అనుకూల మీడియాగా అంతా భావించే మీడియా సంస్థలు కూడా హర్యానాలో మూడో సారి కమల వికాసం అనుమానమే అంటూ వార్తా కథనాలు ప్రచురించాయి. అయితే మంగళవారం (అక్టోబర్ 9) వెలువడిన ఫలితాలు మాత్రం అందరి అంచనాలనూ తల్లకిందులు చేసేశాయి. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత ఆరంభంలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచినా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత తగ్గి బీజేపీ విజయం దిశగా దూసుకు వెళ్లింది. చివరికి మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయాన్ని అందుకుంది.
ఇక ఫలితాల తరువాత విశ్లేషణలు చూస్తే హర్యానాలో కాంగ్రెస్ పరాజయానికి ప్రధాన కారణం ఆప్ అని తేలింది. చాలా నియోజకరవర్గాలలో ఆప్ కు వచ్చిన ఓట్లే కాంగ్రెస్ పరాజయానికి కారణంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. హర్యానాలో బీజేపీ విజయం ఆ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న అభిమానం కాదనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆప్ మధ్య భారీగా చీలిపోవడమే కారణమని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ స్వయంకృ తాపరాధమేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విజయంపై అతి ధీమాయే కాంగ్రెస్ ఓటమికి కారణంగా చెబుతున్నారు. అతి విశ్వాసంతో కాంగ్రెస్ చేతికి అందేలా వచ్చిన విజయాన్ని చేజార్చుకుందని విశ్లేషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా హర్యానాలో మాత్రం కాంగ్రెస్ ఆ పార్టీతో సీట్ల సర్దుబాటుకు ససేమిరా అంది. ఏక పక్ష విజయంపై ఉన్న అతి ధీమాతో ఆప్ తో కలిసి ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని చేజేతులా వదులు కుంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చూస్తే కాంగ్రెస్ విజయానికి అడ్డంగా నిలిచినవి ఆప్ కు పడిన ఓట్లేనని తేలిపోవడంతో ఇప్పుడు అంటూ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేని పరిస్థితిలో హస్తం పార్టీ పడింది. హర్యానా ఎన్నికలలో ఓట్ల పరంగా బీజేపీతో సమానంగా ఓట్లు సాధించిన కాంగ్రెస్.. సీట్ల విషయంలో మాత్రం భారీగా నష్టపోయింది. అందుకు కారణం ఆప్ కు వచ్చిన ఓట్లే. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ కు రెండు శాతం ఓట్లు వచ్చాయి. ఆప్ తో పొత్తు పెట్టుకుని ఉంటే ఆ రెండు శాతం ఓట్లే కాంగ్రెస్ కు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టేవి. అయితే కాంగ్రెస్ ఆప్ తో పోత్తుకు వెనుకాడటంతో హర్యానాను ‘చే’ జార్చుకుంది. కేవలం సర్వేలను నమ్ముకునే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోవడానికి విముఖత చూపింది. అదే సమయంలో బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ ను తక్కువగా అంచనా వేసింది. ఫలితం అనుభవిస్తోంది.