కేజ్రీవాల్ శపథం వర్కవుట్ అయ్యేనా?
posted on Sep 23, 2024 @ 12:25PM
మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానంటూ చంద్రబాబు చేసిన శపథం వర్కవుట్ అయింది. మొన్నటి ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ‘చాణక్య శపథం’ తరహాలోనే ‘చంద్రబాబు శపథం’ అనే కొత్త టర్మ్.ని కూడా ఆయన క్రియేట్ చేశారు. ఇప్పుడు అచ్చం అలాంటి శపథాన్నే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆయన మొన్నటి వరకూ సీఎం హోదాలోనే రిమాండ్‌లో వున్నారు. జైలు నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. జైల్లో వున్నంతకాలం ముఖ్యమంత్రి పీఠాన్ని విడిచిపెట్టని ఆయన, అదేంటోగానీ బెయిల్ వచ్చిన తర్వాత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కేజ్రీవాల్ జైల్లో వున్నప్పుడు పరిపాలన బాధ్యతలను సమర్థంగా నెరవేర్చిన విద్యాశాఖ మంత్రిణి ఆశితిని తన స్థానంలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడుతున్నానని ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నారు. ఈసారి జరిగే ఎన్నికలలో తన ప్రజాబలాన్ని నిరూపించుకుని, ఆ తర్వాతే ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చుంటానని కేజ్రీవాల్ శపథం చేశారు. ‘కేజ్రీవాల్ శపథం’ బాగానే వుందిగానీ, ఆయన శపథం నెరవేరే అవకాశం ఎంతవరకు వుందనేదే ప్రశ్న!
‘ఒకే ఒక్కడు’ సినిమాలో హీరో అర్జున్‌కి ఒక్కరోజు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని రఘువరన్ కల్పిస్తాడు. అర్జున్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత రఘువరన్ చాలా కాజువల్‌గా ఈ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చేసి నీ దారిన నువ్వు వెళ్ళు అంటాడు. దానికి అర్జున్ నాకు చెప్పడానికి మీరెవరు? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అంటాడు. ఆ తర్వాత రఘువరన్‌కి జలక్ ఇస్తాడు. దాంతో రఘువరన్ జీవితంలో మరోసారి ముఖ్యమంత్రి అవ్వడు. కేజ్రీవాల్ పరిస్థితి కూడా అలాగే అయ్యే అవకాశం వుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న ఆశితి ఆ పదవి మీద మమకారం పెంచుకుని, పార్టీ మొత్తాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుని, కేజ్రీవాల్‌కి జలక్ ఇస్తే పరిస్థితి ఏమిటి? అందరూ జయలలిత చెప్పినట్టల్లా వినే పన్నీరుసెల్వం తరహాలో వుండరు కదా. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేల్లాంటి వాళ్ళు కూడా వుంటారు. ఈసారి ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ గెలుస్తారని ఏమైనా రాసిపెట్టి వుందా? ఎన్నికలలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో ఎవరికీ తెలియదు. కేజ్రీవాల్ అందుకు భిన్నమేమీ కాదు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్ని ట్రిక్కులు ప్లే చేయనుందో ఎవరికి ఎరుక? సరే, ఒకవేళ కేజ్రీవాల్ పార్టీ గెలిచినా, ముఖ్యమంత్రి స్థానంలో వున్న ఆశితి, ఆ స్థానంలోనే తాను వుండాలని ముచ్చటపడి పార్టీలో చీలిక తీసుకురారని నమ్మకమేంటి? అందువల్ల కేజ్రీవాల్ చేసిన శపథం అంత ఈజీగా నెరవేరే అవకాశాలైతే కనిపించడం లేదు. కేజ్రీవాల్ శపథం... శపథంలా వుంటుందో, తనకు తానే విధించుకున్న శాపంలా మారుతుందో కాలమే చెప్పాలి.