ఆంధ్రప్రదేశ్ లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు!
posted on Oct 9, 2024 @ 12:15PM
విభజిత ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పారిశ్రామిక స్వర్ణయుగం రాబోతోందా అంటే బిజినెస్ ఎక్స్ పర్ట్స్ ఔననే అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది. ప్రపంచ దేశాలలోని అగ్రశ్రేణి పరిశ్రమలన్నీ తమ పరిశ్రమల విస్తరణకు ఏపీవైపే చూసే వారు. కియా సహా పలు అగ్రశ్రేణి సంస్ధలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. కియా అయితే కార్యకలాపాలు ప్రారంభించేసింది. మరెన్నో సంస్థలు ఎంవోయూలు చేసుకున్నాయి.
అయితే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ఐదేళ్ల హయాంను రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా చెప్పవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం కుక్కలు చింపిన విస్తరిలా తయా రైంది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి తరలిపోయాయి. అంతకు ముందు అంటే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఎంవోయూలు చేసుకున్న సంస్థలు మొహం చాటేశాయి. ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఇందు కోసం చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. రాష్టరానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక వధానాన్ని రూపొందించారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ తీసుకురావడం, వృద్ధి రేటు 15 శాతానికి తగ్గకుండా చూడటం లక్ష్యాలుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.
ఆయన కృషి ఫలిస్తోందనడానికి స్పష్టమైన తార్కాణంగా జగన్ హయాంలో ఆయన విధానాలతో విసిగిపోయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేది లేదంటూ వెళ్లిపోయిన లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ మళ్లీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడాన్ని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ కొలువు దీరిన తరువాత రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారు తున్నది. తాజాగా టాటా గ్రూప్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమెబైల్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది.
టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో గత నెలలో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాలలో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలకు కొనసాగింపుగా అన్నట్లు రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై వెళ్లి నటరాజన్ చంద్రశేఖరన్ తో మంగళవారం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం లోకేష్ చేసిన ఓ ట్వీట్ రాష్ట్రంలో టాటా పెట్టు బడులు ఖాయమని తేల్చేసింది. నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అద్భుతంగా జరిగింది. బుధవారం(అక్టోబర్ 9)న రాష్ట్రంలో టాటా పెట్టుబడులకు సంబంధించి ఓ ప్రకటన వెలువడుతుందని లోకేష్ చేసిన ట్వీట్ రాష్ట్రంలో టాటా గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుందన్న హింట్ ఇచ్చింది. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు అనంతపురంలో టీసీఎష్ క్యాంపస్, రాయలసీమలో సెమికండక్టర్ ప్లాంట్, అనంతపురం సమీపంలో విమానాల తయారీ సంస్థల ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి గొప్ప ఊతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏపీలో తిరుగు ఉండదు.