మంత్రి కొండా సురేఖ మర్యాద గీత దాటేశారు!
posted on Oct 3, 2024 @ 10:26AM
తెలంగాణలో రాజకీయ రచ్చ రోత పుట్టిస్తోంది. బూతుల సంస్కృతి ప్రబలిపోతున్నది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో కనీస మర్యాద కూడా పాటించని పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గతంలో అంటే జగన్ హయాంలో వైసీపీ నేతలు, కొందరు మంత్రులు కూడా ప్రత్యర్థులపై బూతు పురాణాలతో విరుచుకుపడేవారు. ఆ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాజకీయాలలో ఒక రకమైన హుందా తనం గోచరిస్తోంది. అక్కడ వైసీపీ నేతలు నోరు జారినా, అధికార పార్టీ నేతలు మాత్రం సంయమనం పాటిస్తున్నారు. మర్యాదకు, విలువలకు పెద్ద పీట వేస్తున్నారు. అయితే అటువంటి సంయమనం తెలంగాణ రాజకీయాలలో ఇటు అధికార కాంగ్రెస్ లోనూ, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లోనూ కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.
తాజాగా కొండా సురేఖ మర్యాద సరిహద్దులను దాటేశారు. అధికార కాంగ్రెస్ ప్రతిష్ఠను నిలువెత్తు గొయ్యి తీసి కప్పెట్టేశారు. నిజమే కొండా సురేఖపై సామాజిక మాధ్యమంలో ట్రోల్స్ ఎ మాత్రం సమర్ధనీయం కాదు. అందులో సందేహం లేదు. కానీ అందుకు ప్రతిగా ఆమె చేసిన విమర్శలు కూడా ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతోపాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో సురేఖపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానించింది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అక్కడి వరకూ ఓకే..
కానీ కొండా సురేఖ తన విమర్శలతో మర్యాద హద్దులను దాటేశారు. ఆమె బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసి ఊరుకోకుండా బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను కూడా ఈ వివాదంలోకి లాగారు. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే నటి రకుల్ ప్రీత్ సింగ్, మరి కొందరు హీరోయిన్ల పేర్లనూ లాగారు. కొందరు హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేసి వారిని వైధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు. ఈ విమర్శలతో అప్పటి వరకూ కొండా సురేఖపై ప్రజలలో వ్యక్తం అవుతున్న సానుభూతి మొత్తం ఆవిరైపోయింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. ఆమెకే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చుట్టుకున్నాయి. సినీ పరిశ్రమ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తోంది. కాంగ్రెస్ నేతలు సైతం సురేఖనే తప్పుపడుతున్నారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి డిస్మిస్ చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. కొండా వ్యాఖ్యలపై రేవంత్ స్పందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో కొండా సురేఖ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. తన మాటలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సమంతను ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తాను సమంత మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదనీ, స్వయం శక్తితో ఎదిగిన సమంత తనకు ఆదర్శం అనీ, ఆమె పట్ల తనకు ఎంతో గౌరవం ఉందనీ పేర్కొన్నారు. సమంత మనస్తాపానికి గురైతే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే అప్పటికే పరిస్థితి ‘చేయి’ దాటిపోయింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ అవసరాలు, విమర్శల కోసం సినీ రంగానికి చెందిన మహిళలను లాగడం సరికాదని పేర్కొన్నారు. నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు.