చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ముప్పై వసంతాలు!
సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితంలో చాలా ముఖ్యమైన రోజు... 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన చంద్రబాబు నాయుడు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సెప్టెంబర్ ఒకటో తేదీన ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పయ్యో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ రంగ ప్రస్థానాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకోవడం సముచితం.
విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే 1970లలో చంద్రబాబు యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1978లో కాంగ్రెస్ టికెట్ పైనే తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా పని చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తరువాత ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరినే చంద్రబాబు పెళ్లి చేసుకున్నారు.
1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. కానీ, అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌ను వీడలేదు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత ఏడాదిలోనే ఆయన టీడీపీలో చేరి ఎన్టీఆర్‌కు కుడిభుజంలా మారారు. క్రమంగా పార్టీలో ఎన్టీఆర్ తరువాత శక్తిమంతమైన నేతగా, పార్టీ జనరల్ సెక్రెటరీగా మారారు.
1994 వరకు టీడీపీ హయాంలో ఆయన మంత్రి పదవి చేపట్టలేదు. ఆ తరువాత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక, 1995లో కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఎన్టీఆర్ స్థానంలో ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈరోజు వరకూ తెలుగుదేశం పార్టీ మనగలిగిందీ అంటే, ఆరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయమే కారణం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది చంద్రబాబును ఎంతో విమర్శించారు. అయినప్పటికీ పార్టీ కోసం, ప్రజల కోసం నిందలను భరించారు చంద్రబాబు.
ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ఎంతో ప్రభావితం చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో, దేవెగౌడ ప్రధాని కావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఆశ్చర్యకర రీతిలో యూ టర్న్ తీసుకొని బీజేపీతో జతకట్టి మొదటి నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అటల్ బిహారీ వాజపేయీ ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు.2004లో ఏపీలో టీడీపీ కేంద్రంలో ఎన్డీయే ఓటమి పాలయ్యేవరకు ఆయన ఎన్డీయేతోనే కలిసున్నారు.
2014లో యూపీయే ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును పాస్ చేశాక, మళ్లీ ఆయన బీజేపీతో చేతులు కలిపి ఎన్డీయేలో చేరారు. మోదీకి భావి ప్రధానిగా మద్దతు పలికారు. ఆంధ్ర ప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్న కారణంతో 2018 మార్చిలో ఎన్డీయే నుంచి వైదొలిగి బీజేపీకి వ్యతిరేకంగా మారారు. కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసి 2019 ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే ఆ ఎన్నికలలో ఆయన పరాజయం చవిచూశారు. అయినప్పటికీ నిరాశపడకుండా, ఐదేళ్ళపాటు జగన్ రాక్షస ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు మళ్ళీ 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకం. గడచిన నాలుగు దశాబ్దాల అవిభక్త ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్ర రాజకీయ చరిత్ర నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ, జీవిత చరిత్ర వేరు చేయడం కుదిరే వ్యహారం కాదు. ముఖ్యంగా 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి మొదలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డివరకు రాజకీయ ప్రత్యర్ధులు అనేక మంది వచ్చి వెళ్ళారు. చరిత్రకే పరిమితమయ్యారు. కానీ, చంద్రబాబు నాయుడు తిరుగులేని నాయకునిగా, ఇటు ముఖ్యమంత్రిగా అటు ప్రతిపక్ష నేతగా చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలో అత్యధిక కాలం సేవలు అధించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, సేవలు అందించారు.రాష్ట్ర విభజనకు ముందు తర్వాత కూడా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఏకైక నాయకుడుగానూ చంద్రబాబు నాయుడు చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష నేతగా అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, నిఖార్సయిన రాజకీయాలకు నిలవెత్తు నిదర్శనంగా ఉన్నారు. సెవెన్టీ ప్లస్ వయస్సులోనూ అదే ఉత్సాహంతో, అదే దీక్షతో నవ్యాంధ్ర కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.
నిజానికి చంద్రబాబు రాజకీయ అరంగేట్రం మొదలు, అయన రాజకీయ ప్రస్థానంలోని ప్రతి మలుపు మరో సంచలనంగా చరిత్ర పుటల్లో నిలిచి పోయిందంటే అతిశయోక్తి కాదు. కాలేజీలో చదివే రోజుల్లోనే రాజకీయ చైతన్యం ఆయనలో మొగ్గ తొడిగింది. విద్యార్థి నాయకుడిగా తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీలో విద్యను ముగించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ఎంఏ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు.
ఈ దశలోనే క్రియాశీల రాజకీయాల వైపు ఆయన అడుగులు పడ్డాయి. 1977లో దివిసీమ ఉప్పెన సందర్బంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయనలోని సామాజిక సేవాభిలాషకు, మానవత్వానికి, నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. చంద్రబాబు నాయకత్వ ప్రతిభను గమనించిన అగ్రనాయకులు 1978లో చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు.
ఇరవై ఎనిమిదేళ్ళ వయస్సులో సినిమాటోగ్రఫి, పురావస్తుశాఖ, సాంకేతిక విద్యా శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టడం చారిత్రాత్మకం. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, ఎన్టీఆర్ అసెంబ్లీని బహిష్కరించినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి చట్టసభల్లో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమనుకునే రోజుల్లో ఆయన గ్రామ గ్రామానికీ చొరవగా వెళ్ళారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు.
జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాల లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డును ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.
దార్శనికతతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. అమెరికా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను హైదరాబాద్ తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలనూ రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు.
ముఖ్యంగా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి బైట నుండి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్ర పోషించారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్‌సభ స్పీకర్‌గా చేశారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు అన్న పానీయాలు విడిచి నిరహారదీక్ష చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజన అంశాన్ని వినియోగించుకొని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడంపై ఢిల్లీ స్థాయిలో నిలదీశారు. ఏపీ భవన్‌లో ఆరు రోజులపాటు నిరశన దీక్ష చేసి తెలుగు వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు.
దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అరవై మూడేళ్ళ వయసులో కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా 7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్య పరిచారు. చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని ప్రతిపక్ష నేతలే ఒప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయనపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు కోర్టుల్లో వేసిన కేసులన్నీ నీరుగారిపోయాయి. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతీ కార్యకర్తకు నూటికి నూరుశాతం సంక్షేమనిధి ద్వారా న్యాయం జరిగేలా చేశారు. జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే చంద్రబాబు ... కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక రాజనీజ్ఞునిగా చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.