తప్పులెన్ను జగన్ కు తన తప్పులు కనిపించవు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా అన్నట్లు ఉంది.  తిరుమల లడ్డూ వివాదం నుంచి బయటపడేందుకు జగన్ ఎదురు దాడిని ఎన్నుకున్నారు. ఎన్నికల వాగ్దానాల అమలులో చంద్రబాబు ఫెయిల్ అందుకే డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో పబ్బం గడుపుకుంటోందని ఆరోపించడం ద్వారా తానేం చేస్తున్నాడో దానిని చంద్రబాబు సర్కార్ కు ఆపాదించి విమర్శల జడివాన నుంచి రక్షణ పొందాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇక్కడ ఆయన మరచిపోతున్నదేంటంటే.. చంద్రబాబు సర్కార్ కు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలైంది. కనీవినీ ఎరుగని మెజారిటీతో ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అంత వరకూ ఐదేళ్ల పాటు అధకారం చెలాయించిన జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని తమ తీర్పు ద్వారా తేటతెల్లం చేశారు. అటువంటప్పుడు చంద్రబాబు సర్కార్ కు తమ విధానాలను అమలు చేసే విషయంలో  డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడాల్సిన అవసరమే లేదు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలకు గానే 165 స్థానాలలో తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలే విజయం సాధించారు. అంటే తిరుగులేని మెజారిటీ చంద్రబాబు సర్కార్ కు ఉంది. 

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ విషయంలో ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. లడ్డూ ప్రసాదం నాణ్యతా లోపానికి జగన్ హయాంలో జరిగిన అవక తవకలు, అస్మదీయుల కోసం అడ్డగోలుగా కాంట్రాక్టర్లను మార్చేయడం వంటివే కారణాలు అని ల్యాబ్ రిపోర్టుతో విస్ఫష్టంగా తేలిపోయింది. అదే ఇప్పుడు జగన్ ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో పాతాళానికి పడిపోయేలా చేసింది. ఈ తరుణంలో  చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాల అమలులో విఫలమై..  దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆరోపించారు. 

దీంతో జగన్ తీరు పట్ల సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు మాత్రమే అయ్యింది. ఈ వంద రోజుల్లోనే అమరావతి, పోలవరం, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల వేతనాలు వంటి ఎన్నో విషయాలలో ఆయన ప్రజా మన్ననలు పొందేలా నిర్ణయాలు తీసుకుని అమలు చేసి చూపించారు. బెజవాడను కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన వరదలో చంద్రబాబు సర్కార్ ప్రజలకు అండదండగా నిలబడి వారిలో మనోధైర్యాన్ని నింపింది. వరదలకు సర్వం కోల్పోయి బెజారైన ప్రజలను స్వల్ప వ్యవధిలోనే ఆదుకుని వారు సాధారణ జీవనం గడిపేలా చేయగలిగింది చంద్రబాబు సర్కార్. 

ఎన్నికల వాగ్దానాల అమలు విషయంలో కూడా చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు హామీల అమలులో ముందడుగు వేసిన చంద్రబాబు అక్టోబర్ నుంచి వంటగ్యాస్ సిలెం డర్ల హామీ అమలు చేయనున్నారు. అది వేరే సంగతి.. ప్రజల నుంచీ కూడా చంద్రబాబుపై వాగ్దానాల అమలు కోసం ఒత్తిడి రావడం లేదన్న విషయం జగన్ గ్రహించడం లేదు.  సంపద సృష్టి ద్వారానే సంక్షేమ పథకాల అమలు నిరాటంకంగా సాగుతుందని వారు గ్రహించారు. అభివృద్ధి ఆనవాలే కనిపించకుండా ఐదేళ్ల పాటు అధకారం చెలాయించిన జగన్ కారణంగా రాష్ట్రం ఎలా వెనకబడి పోయిందో కళ్లారా చూసిన జనం.. పథకాల లబ్ధి కోసం తొందరపడటం లేదు. 

ఆ విషయాన్ని గుర్తించకుండా వాగ్దానాల అమలులో బాబు విఫలం అంటూ విమర్శలు గుప్పించడం ద్వారా జగన్ జనం దృష్టిలో మరింత పలుచన అవుతున్నారు.  ఇక లడ్డూ ప్రసాదం వివాదం వద్దకు వస్తే.. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న నివేదిక జూలై 17న వచ్చింది. దానిని ఇంత వరకూ ఎందుకు బయటపెట్టలేదంటూ ఇప్పుడు జగన్ చంద్రబాబును నిలదీస్తున్నారు. జీవోలను ఐదేళ్ల పాటు దాచిపెట్టిన చరిత్ర జగన్ ది. ఇక లడ్డూ ప్రసాదం కల్తీపై వచ్చిన రిపోర్టును రెండు నెలలు ఎందుకు తొక్కిపెట్టారని ఎలా ప్రశ్నిస్తారు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరయా అన్నట్లు ఉంది జగన్ తీరు.