ఆంధ్రప్రదేశ్ కూ బుల్లెట్ రైలు!
posted on Oct 9, 2024 @ 2:49PM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ఏయే రంగాల్లో అభివృద్ఢికి అవకాశాలు ఉన్నాయో ఆయా రంగాలలో అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలపాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు బుల్లెట్ రైలు తీసుకురావడంపై దృష్టి పెట్టింది.
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ముంబై అహ్మదాబాద్ ల మధ్యా రానుంది. కేంద్రం దేశంలో ఏడు మార్గాలలో బుల్లెట్ రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిలో తొలి రైలు ముంబై ఆహ్మదాబాద్ ల మధ్య నడవనుంది. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి కూడా. ఒక అంచనా ప్రకారం ముంబై అహ్మదాబాద్ ల మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రయాణం 2026కల్లా సాకారం అవుతుంది. ఇక మిగిలిన ఆరు బుల్లెట్ రైళ్లలో రెండు దక్షిణాదికి కేటాయించారు. అవి చెన్నై బెంగళూరు, ముంబై హైదరాబాద్ మార్గంలో నడుస్తాయి. కేంద్రం ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ రైలు మార్గాల్లో ఏ ఒక్కటీ కూడా ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లదు.
అయితే ఇప్పుడు కేంద్రం బుల్లెట్ రైలు మార్గంలో ఆంధ్రప్రదేశ్ కు కూడా చోటు కల్పించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలియజేశారు. చైన్నె బెంగళూరు బుల్లెట్ రైలు మార్గాన్ని అమరావతి, హైదరాబాద్ వరకూ విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని అశ్విని వైష్ణవ్ తో భేటీ అనంతరం చంద్రబాబు స్వయంగా తెలుగుదేశం కూటమికి చెందిన కేంద్ర మంత్రులకు చెప్పారు.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడ నుంది.