లడ్డూ వివాదం తరువాత కూడా జగన్ పట్ల బీజేపీ సాఫ్ట్ గానే ఉందా?
posted on Sep 21, 2024 @ 2:31PM
తిరుమల లడ్డూ వివాదం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంశం విషయంలో కేంద్రం సీరియస్ అయ్యిందన్న వార్తలు వినవస్తున్నాయి. హిందుత్వను భుజాన వేసుకునే బీజేపీలో కూడా జగన్ సర్కార్ నిర్వాకంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కఠిన చర్యలకు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ వివాదం వెలుగు చూసిన తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చంద్రబాబుకు పోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. చంద్రబాబుతో ఫోన్ సంభాషణ తరువాత నడ్డా లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఎంతటి వారున్నా వదిలేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక కేంద్ర మంత్రులు బండి సంజయ్, శోభా కరంద్లాజే అయితే ఈ విషయంపై సీరియస్ గా స్పందించారు. జగన్ హిందూ వ్యతిరేకి అని చాటారు. తిరుమలలోని విద్యాసంస్థల్లో వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారి ఫోటోలను తొలగించేందుకు జగన్ హయాంలో ఆయన ప్రయత్నించారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఎక్స్ వేదికగా స్పందించిన శోభా కరంద్లాజే జగన్ హయాంలో తిరుమల కొండపై ధార్మిక వాతావరణానికి భంగం కలిగించారనీ, కొండపై అన్యమత చిహ్నాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు గుప్పించారు. తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ గా హిందూయేతర వ్యక్తిని నియమించారని, శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు ఉన్న నెయ్యి వినియోగానికి అనుమతించారని విమర్శలు గుప్పించారు. అలాగే మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి లడ్డూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే లడ్డూ వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని జగన్ అనుకూల బీజేపీ నేతల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. గత ఐదేళ్లుగా రాష్ట్ర బీజేపీలో జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన జీవీఎల్ నరసింహారావు కానీ, సోము వీర్రాజు కానీ, విష్ణువర్దన్ రెడ్డి కానీ లడ్డూ వివాదంలో వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక వైపు పార్టీ జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు లడ్డూ వివాదంపై తమ ఆగ్రహాన్ని విస్పష్టంగా వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర బీజేపీకి చెందిన ఈ ముగ్గురు నాయకులు మౌనం పలు అనుమానాలు తావిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కూడా జీవీఎల్, సోము వంటి వారు కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టేలా ప్రకటనలు చేసినా బీజేపీ హై కమాండ్ వారిపై చర్యలు తీసుకోకపోవడం, పైపెచ్చు త్వరలో చంద్రబాబు భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టుల విషయంలో బీజేపీ తన కోటాలో వచ్చే పోస్టులకు సోము వీర్రాజు వంటి వారిని సిఫారసు చేయడం చూస్తుంటే ఇప్పటికీ కమలనాథులకు జగన్ పట్ట సాఫ్ట్ కార్నరే ఉందా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు గత ఐదేళ్లుగా కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం జగన్ పట్ల చూపిన అభిమానం, అందించిన సహాకారాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. జగన్ హయాంలో అడ్డగోలు అప్పులకు ఆర్బీఐ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అనుమతులివ్వడం దగ్గర నుంచి జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆమోదయోగ్యం కాని మౌనాన్ని ఆశ్రయించడం, వివేకా హత్య కేసులో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరును తప్పుపట్టకపోవడం వంటి వాటిని జగన్ పట్ల గతంలో మోడీ సర్కార్ ఎంత సానుకూలంగా వ్యవహరించిందో అర్ధం చేసుకోవచ్చునంటున్నారు. అయినా బీజేపీ రాష్ట్ర నేతలలో వైసీపీ అనుకూల నేతల మౌనం, వారికి పార్టీ హైకాండ్ మద్దతు చూస్తుంటే జగన్ పట్ల బీజేపీకి ఇంకా సాఫ్ట్ కార్నరే ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.