మద్య నిషేధం ఎత్తివేత.. ప్రశాంత్ కిశోర్ హామీ మందుబాబుల ఓట్ల కోసమేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోన్ సొంత కుంపటి జన్ సురాజ్ ను ప్రారంభించేశారు. ఇప్పుడు ఆయన పార్టీకి ఆయనే అధినేత, ఎన్నికల వ్యూహకర్త కూడా. ఆయన వ్యూహాల పదును పార్టీని ప్రారంభించిన మొదటి రోజే చూపారు. బీహార్ లో అత్యంత కీలకంగా మారిన మద్య నిషేధంపై ఆయన చేసిన ప్రకటన రాజకీయ పండితులను  సైతం విస్మయపరిచింది. బీహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో తన పార్టీ జన్ సురాజ్ విజయం సాధించి అధికారం చేపడితే.. వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు. 

సాధారణంగా ఏ పార్టీ అయినా సరే మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటిస్తారు. కానీ నలుగురూ నడిచే దారిలో నేనసలు నడవను అనే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని తాను అధికారంలోకి రాగానే ఎత్తి వేస్తానని ప్రకటించారు.  మహిళల ఓట్ల కోసం రాజకీయ పార్టీలూ తరచూ ఎత్తుకునే మద్యపాన నిషేధం నినాదాన్ని కాదని ఆయన ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించడం రాజకీయంగా సాహసమనే చెప్పవచ్చు. మందుబాబుల ఓట్ల కోసమే ప్రశాంత్ కిశోర్ ఈ ప్రకటన చేశారా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని తాను  చేసిన ప్రకటన పూర్తిగా ఆర్థిక కారణాలతోనేనని ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు. 

మద్యపాననిషేధం ఎత్తి వేయడం ద్వారా రూ.20వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అవుతుందన్నారు.వాటిని విద్యావ్యవస్థ పటిష్టం చేయడానికి ఖర్చు చేస్తామన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచస్థాయిలో విద్యావ్యవస్థ అభివృద్ధి చేయడానికి ఐదులక్షల కోట్లు వ్యయం చేస్తానని చెప్పారు. జన సురాజ్ మార్టీకి మాజీ ఐఏఎస్ అధికారిణి ని కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించిన ప్రశాంత్ కిషోర్..  విద్యా,ఉపాధి రంగాలు అభివృద్ధే తన ఎన్నికల ఎజెండాగా చెప్పారు. ఆయన రాజకీయ ఎజెండా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే మద్య నిషేధం ఎత్తివేత ప్రకటన ద్వారా ఆయన మందుబాబుల అభిమానానికి పాత్రుడయ్యారనడంలో ఎంత మాత్రం సందేహం లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. 

 ఇక జనసురాజ్ విషయానికి వస్తే.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 (బుధవారం ) ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను బీజేపీతో కలిసి పయనించే అవకాశం ఇసుమంతైనా లేదన్నారు. సొంతంగా, స్వతంత్రంగా జనసురాజ్ ఎదుగుతుందనీ, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత కాలం వేరే పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేసి వాటికి అధికారాన్ని కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన సురాజ్ కోసం ఎటువంటి వ్యూహాలు రచిస్తారన్న ఆసక్తి బీహర్ కే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ ద్వారా ఏ మేరకు సక్సెస్ అవుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.