84 లక్షల వాట్సప్ అకౌంట్లు ఫసక్!
posted on Oct 15, 2024 @ 5:31PM
మెటాకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సప్‌ని మన దేశంలో కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సప్‌ని అడ్డాగా చేసుకుని అనేక మోసాలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో వాట్సప్ ద్వారా మోసాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఖాతాలను వాట్సప్ డిలీట్ చేసింది. ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపుగా 84 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. తమ సంస్థ నిర్ణయించిన ప్రైవసీ పాలసీకి కట్టుబడనందుకు గాను ఈ చర్యలు తీసుకున్నట్టు వాట్సప్ తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2021 నిబంధనల ప్రకారం ఆగస్టులో 84.58 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్ తెలిపింది. వీటిలో దాదాపు 16.61 లక్షల అకౌంట్లను ముందు జాగ్రత్త చర్యగా డిలీట్ చేశామని వాట్సప్ తెలిపింది. మోసానికి ఆస్కారం ఉండే బల్క్ మెసేజ్‌లు, అబ్‌నార్మల్ మెసేజ్‌లను వాట్సప్ తన ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా గుర్తించి ఈ చర్యలు చేపట్టింది. అలాగే, ఆగస్టు నెలలో యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు అందినట్లు వాట్సప్ వెల్లడించింది.