జగన్ కోవర్ట్ రాజకీయాలు ఫలిస్తున్నాయా?.. ఒంగోలు కూటమిలో బీటలు అందుకేనా?
posted on Sep 23, 2024 @ 10:44AM
ఏపీలో ఎన్డీయే కూటమికి బీటలు వారుతున్నాయా.. జనసేన, టీడీపీ నేతల మధ్య విబేధాలు పొడచూపుతున్నాయా.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోవర్ట్ రాజకీయ వ్యూహంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిక్కుకుంటున్నారా? జనసైనికులు, టీడీపీ శ్రేణులు అప్రమత్తం కాకుంటే త్వరలో ఎన్డీయే కూటమిలో లుకలుకలు తార స్థాయికి చేరుకోవటం ఖాయమా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కూటమి నేతలు ఏ మాత్రం తొందరపాటుగా వ్యవహరించినా, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా జట్టు కట్టాయి. ఐదేళ్లలో వైసీపీ అరాచక పాలనకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు మూడు పార్టీలూ ఏకమయ్యాయి. ప్రజలు సైతం జగన్‌రెడ్డి అరాచక, దోపిడీ పాలనతో విసిగిపోయారు. దీంతో గత ఎన్నికల్లో కూటమికి భారీ మెజార్టీ కట్టబెట్టారు. వైసీపీని కేవలం 11 స్థానాలకే ప్రజలు పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదాకూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎంగా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలను జనసేనాని పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అప్పగించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి100 రోజులు పూర్తి అయ్యింది. వంద రోజుల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఎదురైన సమస్యలను పరిష్కరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధిని సీఎం చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజలుసైతం ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులు, వైసీపీ నేతలపై కొరడా ఝుళిపిస్తున్నారు. ముఖ్యంగా ముంబై నటి జత్వానీ కేసులో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. ఆ కేసులో కీలక నిందితుడు, వైసీపీ నాయకుడు అయిన కుక్కల విద్యాసాగర్ అరెస్టయ్యారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 4 వరకూ రిమాండ్ విధించింది. అలాగే వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించిన అధికారులను చంద్రబాబు నిర్దాక్ష్యిణ్యంగా పక్కన పెట్టారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి అక్రమాలను కూటమి ప్రభుత్వం వెలికి తీస్తుండటంతో వైసీపీ నేతల్లో దడపుడుతోంది. ఎప్పుడు ఎవరు జైలు కెళ్లాల్సి వస్తుందోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో నెలకొంది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం తాడేపల్లికి చుట్టపు చూపుగానే వస్తున్నారు. ఎక్కువగా ఆయన బెంగళూరులోనే మకాం వేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రభుత్వం, కూటమిలో పార్టీల నేతల మధ్య విబేధాలు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. పవన్, చంద్రబాబు మధ్య సఖ్యతను చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. వీ రిద్దరూ కలిసి ఉంటే తన పార్టీ ఉనికికే ప్రమాదం అని గ్రహించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి.. జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య విబేధాలు సృష్టించేందుకు పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీలో తన సన్నిహితులుగా ఉన్న నేతలను కోవర్టులుగా కూటమి పార్టీలలోకి పంపాలన్నదే ఆ ప్రాణాళిక అంటున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు దూకుడైన పాలనతో రాబోయే కాలంలో ఇబ్బందులు తప్పవని జగన్ సహా, వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఉంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాబోయే కాలంలో వైసీపీ పట్టు కోల్పోవడం ఖాయమనీ, అదే జరిగితే పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం మాట అటుంచి వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాశం ఉండదనీ జగన్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కూటమిలో చీలికలు తెస్తే తప్ప రాబోయేకాలంలో రాజకీయంగా మనుగడ సాగించలేమని భావిస్తున్న జగన్ కూటమిలోని పార్టీల కార్యకర్తల మధ్య విబేధాలు సృష్టించేలా జగన్ పక్కా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి పలువురు నేతలు జనసేనలో చేరబోతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి నేతలు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. వారు ఈనెల 26న జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. వీరితోపాటు మరికొందరు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వీరందరి చేరికల వెనుక జగన్ వ్యూహం ఉందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. దాదాపు పది మంది వరకు వైసీపీ కీలక నేతలను జనసేనలోకి పంపించడం ద్వారా.. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య విబేధాలు సృష్టించడంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఘర్షణలు సృష్టించడం జగన్ ప్లాన్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వ్యూహంలో పవన్ చిక్కుకున్నారని, కూటమి బీటలు వారుతోందనీ, మరికొద్ది నెలల్లోనే టీడీపీ, జనసేన పార్టీలు విడిపోవటం ఖాయమన్న వాదన వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఇప్పటికే ఒంగోలులో రాజకీయ రచ్చ మొదలైంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయన చేరికను స్థానికంగా కొందరు జనసేన నేతలతో పాటు, టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలినేని ఒంగోలుకు వస్తుండటంతో ఆయన అనుచరులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీల్లో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు తెలుగుదేశం ఎంపీ మాగుంటి శ్రీనివాసులు ఫొటోలను కూడా ఉంచారు. దీంతో తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్లెక్సీలను తొలగించారు. ఫలితంగా ఒంగోలులో మరోసారి బాలినేని వర్సెస్ దామచర్ల అన్నట్లుగా రాజకీయాలు మారాయి. బాలినేని జనసేన పార్టీకి వస్తే ఆ పార్టీ నేతలు తప్పనిసరిగా బాలినేనికి సపోర్ట్ చేస్తారు. తెలుగుదేశం నేతలు దామచర్లకు మద్దతుగా ఉంటారు. దీంతో జనసేన,తెలుగుదేశం శ్రేణుల మధ్య విబేధాలు తార స్థాయికి చేరుతాయి. ఈ రెండు పార్టీల మధ్య విబేధాలను వైసీపీ సద్వినియోగం చేసుకుంటుందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. జగన్ వ్యూహంలో భాగంగానే బాలినేని జనసేనలోకి వస్తున్నారని, రెండు పార్టీల మధ్య పూడ్చలేని అగాధాన్ని ఏర్పర్చి.. ఎన్నికల సమయానికి మళ్లీ జగన్ వద్దకే బాలినేని వెళ్తారని పలువురు తెలుగుదేశం, జనసేన నేతలు అంటున్నారు. జనసేన పార్టీలో చేరుతున్న వారిలో అధికశాతం మంది వైసీపీ నేతలు జగన్ సూచనలతోనే పార్టీని వీడుతున్నారని.. వీరిపట్ల పవన్ కల్యాణ్ జాగ్రత్తగా ఉండకుంటే కూటమి ప్రభుత్వంలో చీలక రావడం ఖాయమన్న వాదన ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.