ఇక అమరావతి పనులు 24X7!
posted on Oct 2, 2024 @ 10:39AM
ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక వేగం పుంజుకోనుంది. అమరావతి నిర్మాణ పనులు నిరంతరాయంగా సాగనున్నాయి. అమరావతి నిర్మాణానికి కేంద్రం అందించే సహాయం నేడో రేపో అందనుంది. ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్రం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిధులనను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇక అమరావతి పనులను ఎలాంటి అవాంతరాలు, అవరోధాలు లేకుండా నిరంతరాయంగా సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ లో నిధులు అందుతాయి కనుక ఆ మరుసటి నెల అంటే డిసెంబర్ నుంచి పనులను శరవేగంగా అంటే 24X7 కొనసాగించాలని నిర్ణయించింది.
జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా వ్యవహరించిన తీరు కారణంగా.. రాష్ట్రరాజధాని ప్రాంతం ఓ అడవిలా తయారైంది. 80శాతానికి పైగా పూర్తయిన భవనాలు కళ తప్పాయి. రోడ్లు అధ్వానంగా మారాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం ప్రాజెక్టు తరువాతి ప్రాధాన్యత అమరావతికే ఇచ్చారు. చంద్రబాబు సీఎంగా పగ్టాలు చేపట్టగానే అమరాతిలో జంగిల్ క్లయరెన్స్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జగన్ నిర్వాకం కారణంగా 80 శాతంపైగా పూర్తయిన నిర్మాణాలు కూడా పాడుబడ్డాయి. అటువంటి భవనాల సామర్ధ్యాన్ని, వాటిని కొనసాగించడానికి గల అవకాశాలను నిపుణులు పరీక్షించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు సాగనున్నారు. ఇక అమరావతి పనులకు ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ఆరంభించే యోచనలో ప్రభుత్వం ఉంది.