మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి డిల్లీకి

 

కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏలుతున్నముఖ్యమంత్రే కావచ్చు. గానీ ఆయనదీ కాంగ్రెస్ డీ.యన్.ఏ. గనుక కాంగ్రెస్ ఆచార వ్యవహారాల ప్రకారం, రోజూ సచివాలయానికి వెళ్లినా వెళ్లకపోయినా వారానికొకమారయినా  డిల్లీ వెళ్ళడం మాత్రం అత్యవసరం. ఓసారి సోనియా మాడం పిలిస్తే రెక్కలు కట్టుకొని డిల్లీలో వాలవలసి ఉంటుంది. మరోసారి అందరూ కలిసి వార్ రూమ్ లో తలుపులేసుకొని వాదులాడుకోవడానికి వెళ్ళవలసి వస్తుంది. ఇంకోసారి తనని అభిమానించే దిగ్విజయ్ సింగ్ పిలిస్తే ఆయనను కాదనలేక వెళ్ళవలసి ఉంటుంది. ఏ లెక్కన చూసుకొన్నాకిరణ్ నెలకి ఓ ఐదారుసార్లు డిల్లీకి అలా వెళ్లి ఇలా వచ్చేస్తుంటారు.

 

ఇంతకు ముందు కూడా ఆయన చాలా సార్లు వెళ్లోచ్చిన్నపటికీ, అప్పటికి ఆయనకి ఇంత ఫాలోయింగ్ లేకపోవడంతో మీడియా కూడా ఏదో మొక్కుబడిగా రిపోర్ట్ చేసేది. కానీ ఆయన సమైక్య చాంపియన్ గా బ్యాడ్జీ తగిలించుకొన్నపటి నుండి మీడియాలో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన తన ఇంట్లోంచి కాలు బయటపెట్టినా సెన్సేషనల్ న్యూసే, పెట్టకపోయినా అంతకంటే పెద్ద సెన్సేషనల్ న్యూసే. మరి అటువంటప్పుడు ఆయనని కేంద్రమంత్రుల బృందం రేపు డిల్లీ రమ్మని పిలిస్తే మరింకెంత సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

ఈరోజు మిగిలిన రెండు సమైక్య పార్టీలు సీపీఎం, వైకాపాలతో కూడా అఖిలపక్షం తంతు ముగించేసిన కేంద్రమంత్రుల బృందం, రేపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓసారి డిల్లీ వచ్చిపొమ్మని మెసేజ్ పెట్టింది. ఈయన చూస్తే విభజన వద్దంటాడు. వాళ్ళేమో విభజన ప్రక్రియ దాదాపు పూర్తి చేసేసి చేతులు కడుక్కొనే ముందు, తమకు ఇంత సౌలభ్యం కల్పించిన ఆయనకు ఓమారు థాంక్స్ చెప్పడం ధర్మమని భావించారో లేక ఆయనను సంప్రదించకుండా కుర్చీలోంచి లేచిపోతే రాజ్యంగా విరుద్దమని జనాలేమయినా ఫీలయిపోతారనో తెలియదు కానీ మొత్తం మీద ఆయనను ఓసారి మళ్ళీ డిల్లీకి రమ్మని పిలిచారు. రేపు రాత్రి మీటింగుట!