సీబీఐ చిలక పలుకులు

 

బీసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ ఐపీయల్ మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుల్లో వెలగబెట్టిన నిర్వాకానికి ఆయన ఉద్యోగం ఊడినంత పనయింది. అయితే ఆయన కాంగ్రెస్ తో చాలా చక్కగా కనెక్ట్ అయ్యి ఉన్నాడు గనుక మళ్ళీ తన కుర్చీలో తను మళ్ళీ కూల్ గా సెటిల్ అయిపోగలిగాడు.

 

జనాలకి, మీడియాకే కాదు పోలీసులకి కూడా గజినీలా షార్ట్ మెమొరీ సమస్య ఉంది గనుక, మేయప్పన్ తో సహా అందరినీ ఎప్పుడో మరిచిపోయారు. మరి ఆ పాటిదానికి ఇంతోటి హంగామా, కష్టం ఎందుకనే ఆలోచన ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారికి రావడంతో, లేడికి లేచిందే పరుగు అన్నట్లు సీబీఐ చిలుక అంటే ఆ సంస్థ డైరెక్టర్ రంజిత్ సిన్హా, రాహుల్ ద్రావిడ్ వంటి క్రికెట్ ఆటగాళ్ళని స్టూడియోలో కూర్చోబెట్టి అసలు ఈ తప్పులనే చట్టబద్దం చేసేస్తే ఎలాగుంటుంది? అని కెలికొదిలి పెట్టింది.

 

క్రికెట్ పై బెట్టింగ్ కి చట్టబద్దత కల్పిస్తే దేశానికి కూడా మేలు జరుగుతుందని రాహుల్ ద్రావిడ్ డిక్లేర్ చేసారు.

 

“నిజమే స్మీ! ఇలా చేస్తే మాకు కొంచెం పని తగ్గుతుందని” అనుకొందో మరేమో గానీ సీబీఐ చిలుక కూడా బెట్టింగ్ ని చట్టబద్దం చేయడంలో ఎటువంటి తప్పు లేదని ఒప్పేసుకొంది. తన చిలక పలుకులు ప్రజలకు మరింత బాగా విడమరిచి చెపితే బాగుంటుందనే సదాభిప్రాయంతో “మన దేశంలో అనేక రాష్ట్రాలలో నేటికీ లాటరీలకు చట్టబద్దత ఉంది. హాలీ డే రిసార్ట్ లో కాసీనోల పేరిట జూదమాడుకోవడానికి అభ్యంతరం లేదు. నల్లదనం ఉంటే ప్రకటించుకొనే సౌలభ్యం కూడా ఉంది. మరటువంటప్పుడు మరే ఇతర పరిశ్రమలకి తీసిపోని విధంగా రూ.66,000 కోట్ల టర్న్ ఓవర్ తో సాగుతున్న ఈ క్రికెట్ బెట్టింగ్ మీదనే ఎందుకు ఇన్ని ఆంక్షలు, అభ్యంతరాలు? అవి ఉన్నపటికీ బెట్టింగ్ కాయడాన్ని మనం ఆపలేకపోతున్నాము కదా? మరటువంటప్పుడు దానికి చట్టబద్దత కల్పిస్తే పోలా? అని సదరు చానల్ వారిని గట్టిగా నిలదీశారు.

 

ఆ చిలుక ప్రశ్నలకి సదరు చానెల్ వారి వద్ద సరయిన సమాధానం ఉన్న కార్డు ఒక్కటి కూడా లేదు.