టీ కాంగ్రెస్ తంటాలు చూతము రారండీ!
posted on Nov 11, 2013 @ 5:15PM
టీ కాంగ్రెస్ నాయకులు పడుతున్న తంటాలు చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు. తెలంగాణ వచ్చేస్తోందని పైపైకి మాత్రం లేని ఉత్సాహం ప్రదర్శిస్తూ సోనియాకి కృతజ్ఞతలు చెప్పే సభలు నిర్వహించడం, సీమాంధ్రుల నుంచి ఏ రకంగా హక్కులన్నిటినీ లాక్కుని తరిమేయాలో కేంద్రానికి సూచించడం చేస్తున్నారుగానీ, లోలోపల వాళ్ళు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు ప్రకటించింది. పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ వస్తుందా, రాదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ తెలంగాణ రాకపోతే ఆల్రెడీ సీమాంధ్రలో గల్లంతైపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం వుంది. ఇప్పటి వరకూ తెలంగాణ ఇచ్చిందీ.. తెచ్చిందీ మేమే అని గొప్పలు చెప్పుకుంటున్న టీ కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కనంత స్థాయిలో ఓడిపోయే అవకాశం వుంది.
రెండు మూడు రోజుల నుంచి మారిన పరిస్థితులను చూస్తుంటే తెలంగాణ వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ కనిపించడం లేదు. అలాంటి సరుకులేని తెలంగాణను తెచ్చినందుకు తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందోన్న భయం కూడా టీ కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ తర్వాత వాళ్ళే పశ్చాత్తాపపడతారని అనడం అందరిలో బోలెడన్ని సందేహాలను రేకెత్తించింది. అలాగే, తెలంగాణ వచ్చేసింది కదా ఆరామ్‌గా కూర్చుని వినోదం చూద్దామనుకున్న టీ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అధిష్టానం ముందు ఎన్ని తంటాలు పడుతున్నారో టీ కాంగ్రెస్ నాయకులూ అన్ని తంటాలు పడాల్సిన పరిస్థితులొచ్చాయి. వీటన్నిటికంటే వీళ్ళు ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య ఏంటంటే, తెలంగాణ వస్తే కాబోయే సీఎం ఎవరన్నదే! టీ కాంగ్రెస్ నాయకులలో డజనుకు పైగా నాయకులు రాబోయే తెలంగాణకు తానే కాబోయే సీఎం అని కలలు కంటున్నారు. తెలంగాణ కోసం ఇన్ని తంటాలు పడుతున్నాను.. నేను సీఎం కాకపోతే పరిస్థితి ఏంటని ప్రతి ఒక్క నాయకుడూ, నాయకురాలూ మనసులో మథన పడుతున్నారు.