వ్యాటే టాక్స్ సర్ జీ!
posted on Nov 11, 2013 @ 7:47PM
సాయంత్రం సరదాగా ఫ్యామిలీతో అలా ఏదయినా మంచి హోటల్ కి వెళ్లి లైట్ గా ఏదయినా టిఫిన్ లేదా డిన్నర్ చేసి వద్దమనుకొంటున్నారా? అయితే ఓసారి ఇది చదివి బయలుదేరితే మంచిది. ఇటీవల విజిలన్స్ శాఖ అధికారులు హైదరాబాదులో ఆరు ప్రముఖ హోటల్స్ రికార్డులు తనిఖీ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమయిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు మనం తినే భోజనానికి, తాగే నీళ్ళకి కూడా (పీల్చేగాలికి ఇంకా చెల్లించనవసరం లేదు)వాట్ టాక్స్, సర్వీస్ చార్జ్, సర్వీస్ టాక్స్ వగైరాలు కట్టక తప్పదని అందరికీ తెలుసు. సాధారణంగా వినియోగదారులు తాము తినే ఆహారానికి మాత్రమే 14.5 శాతం వ్యాట్ టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. కానీ సదరు హోటల్స్ వారు ఆహారంపై వసూలు చేస్తున్నసర్వీస్ చార్జ్ మరియు సర్వీస్ టాక్స్ లపై కూడా వ్యాట్ టాక్స్ వసూలు చేస్తున్నట్లు బయటపడింది. సాధారణంగా ఇటువంటి విషయాలు వినియోగదారులు పెద్దగా గమనించరు గనుక, హోటల్ యాజమాన్యాలు ఈవిధంగా టాక్స్ పై టాక్స్ వేసి గత ఏడాది రూ.2.48 కోట్లు అదనంగా వినియోగదారులకి తెలియకుండా పిండుకొన్నారు.
ఈ తెలివి తేటలు కేవలం ఈ ఆరు హోటల్స్ కే పరిమితం కాదు గనుక, రాష్ట్రంలో, దేశంలో ఏ హోటల్ కి వెళ్ళినా ఈ అదనపు టాక్స్ వడ్డింపులు కూడా ఉంటాయని మరిచిపోకండి. దైర్యం ఉంటే అడగండి. ఆ టెన్షన్లు మనకొద్దనుకొంటే బేరర్ కి మరో పదో పరకో ఎక్కువ టిప్పు ఇస్తున్నామని సరిబెట్టుకొని చల్లగా బయటపడండి.