సీబీ‘ఐ’- కాంగ్రెస్‘ఐ’

 

 

 

కాంగ్రెస్-ఐ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, తనకు అవసరమైన వారిని దారికి తేవడానికి అస్త్రంలా ఉపయోగిస్తున్న సీబీఐకి చట్టబద్ధతే లేదని గౌహతి హైకోర్టు తీర్పు ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీతి నిజాయితీలకు తానే కేరాఫ్ అడ్రస్ అని బిల్డప్ ఇచ్చుకుంటున్న సీబీఐ అసలు గుట్టు ఇదా అని దేశం మొత్తం తెల్లబోయింది.

 

గౌహతి హైకోర్టు తీర్పుతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం, సుప్రీం సదరు తీర్పు మీద స్టే విధించడం ఆటోమేటిగ్గా జరిగిపోయాయి. మొత్తమ్మీద సీబీఐ ఉనికికే ప్రమాదం రావడంతో కాంగ్రెస్ పార్టీ కలవరపడుతోంది. సీబీఐ అంటే మరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీకి కన్నులాంటిది. ఈ కన్ను లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒంటికంటిదైపోతుంది. ఈ కన్ను సాయంతోనే కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థుల మీద దృష్టిని కేంద్రీకరించి ‘దిష్టి’ పెడుతూ వుంటుంది. సీబీఐ ఉనికి దేశానికి ఏం మేలు చేస్తుందో తెలియదుగానీ, కాంగ్రెస్‌కి మాత్రం బోలెడంత మేలు చేస్తుంది.



మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికే వస్తే, సీబీఐ కేసులను అడ్డు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ జగన్ మహాశయుణ్ణి తన దారికి తెచ్చుకుంది. అతని సహకారంతో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో అధికారంలోకి రావడానికి పథకరచన చేసింది. ఇప్పుడు సీబీఐ అనేదే లేకపోతే, సీబీఐ బుక్ చేసిన కేసులన్నీ బుట్టదాఖలైపోతే జగన్‌ని కట్టడి చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి వుండదు. ఒక్క జగన్ మాత్రమే కాదు. లాలూప్రసాద్ యాదవ్, రాజా, కనిమొళి లాంటి ఎందరో అవినీతి చేపలు కాంగ్రెస్ వలలోంచి తప్పించుకుని పోతాయి. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ సీబీఐని కాపాడుకుని తీరాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.