జగన్ని తట్టుకోవడం కష్టమబ్బా: అనంత రెడ్డి
posted on Nov 12, 2013 @ 1:12PM
జగన్ జైలు నుండి విడుదల అయిన తరువాత అతని పార్టీలోకి దూకాలనుకొన్న కొద్ది మంది కాంగ్రెస్ నేతలలో యంపీ అనంత వెంకట రామిరెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజన కారణంగా రానున్నఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తే ఘోరపరాజయం పాలవుతాననే భయంతో వైకాపా కండువా కప్పుకొనేందుకు సిద్దపడ్డారు. ఆ క్రమంలో జగన్ నిరాహార దీక్ష చేస్తున్నపుడు వెళ్లి అతనిని కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకోనేందుకు ముహూర్తం కూడా ఖారారు చేసుకొన్నారు. అయితే విశ్వరూప్ వంటి వారు కొందరు వైకాపాలో చేరినప్పటికీ, ఆయన మాత్రం ఇంత వరకు చేరలేదు.
ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిశ్చయించుకొన్నారు. కారణం ఆయనను పార్టీలో చేర్చుకొనేందుకు జగన్ ఆయనకి ఏవో కొన్ని షరతులు పెట్టడమేనట. సాధారణంగా పార్టీ మారదలచుకొన్నవారు ముందుగా తాము జేరబోయే పార్టీలో తమ టికెట్స్ కోసం బెరామాడుకొని, అంతా ఖాయం చేసుకొన్నాక పార్టీలో చేరుతారు. కానీ ఎవరయినా నేతలు వైకాపాలో చేరాలంటే ముందుగా జగన్ పెట్టే కొన్నిషరతులు అంగీకరించాలనడం విచిత్రమే.
జగన్మోహన్ రెడ్డి విచిత్ర వ్యవహార శైలిని తట్టుకొని ఇబ్బందులు పడటంకంటే ఆ కష్టమేదో కాంగ్రెస్ పార్టీలోనే పడితే కనీసం గౌరవమయినా దక్కుతుందని ఆయన వెనక్కి తగ్గారు. ఆయన వైకాపాలో చేరితే అనంతపురం నుండి మరి కొందరు కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఆయనను అనుసరించాలని అనుకొన్నారు. కానీ, ఆయనే ఆగిపోవడంతో మిగిలిన వారు కూడా వెనక్కి తగ్గారు.