టి-కాంగ్రెస్ నేతల టిట్ ఫర్ టాట్
posted on Nov 12, 2013 @ 1:45PM
కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి టీ-కాంగ్రెస్ మంత్రులని, శాసనసభ్యులని కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, తాము కూడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఒకే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, అతని క్యాబినెట్ మంత్రులు తీరు చూస్తుంటే, వేర్వేరు పార్టీలకి చెందిన నేతలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నట్లుంది.
టీ-కాంగ్రెస్ నేతలు తాము బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి పాల్గొనే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మరో ఆడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి పాల్గొంటున్నరచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరించాలని ప్రజలకు, టీ-కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణాను వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి తెలంగాణాలో తిరగడాన్ని నిరసిస్తూ తెరాస కూడా రేపు మెదక్ జిల్లా బంద్ కి పిలుపు ఇచ్చింది.
ఈ పరిణామాలు చూసిన తరువాత గీతారెడ్డి, జగ్గారెడ్డి తదితరుల సలహా మేరకు ముఖ్యమంత్రి రేపటి తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. ఇంతవరకు తనకు ఎదురులేదన్నట్లు వ్యవహరించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇది జీర్ణించుకోవడం కష్టమే. అదికూడా ఇక నేడో రేపో కుర్చీలోంచి దిగిపోయే ముందు ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోవలసి రావడం ఎవరికయినా మరింత కష్టంగానే ఉంటాయి మరి.