కాంగ్రెస్‌లో విలీనంపై కెసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
posted on Nov 12, 2013 @ 9:54AM
కాంగ్రెస్‌లో విలీనం ఉండదని ప్రజలకు గట్టిగా చెప్పాలంటూ పార్టీ నేతలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్దేశించారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ మండల స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించనున్న నేతలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
"శిక్షణ తరగతుల నిర్వహణను సీరియస్‌గా తీసుకోండి. ఇందుకు సంబంధించి వివిధ బాధ్యతలు స్వీకరిస్తున్న వారు క్షేత్ర స్థాయి నివేదికలను పార్టీ నేత కడియం శ్రీహరికివ్వండి. నేను ఇంటెలిజెన్స్, సర్వే నివేదికలను తెప్పిస్తాను. అన్నింటినీ క్రోడీకరించిన తర్వాత నాయిని నర్సింహారెడ్డి సారథ్యంలోని పార్టీ ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈ జాబితాను డిసెంబర్‌లో వెల్లడిస్తాం'' అని టీఆర్ఎస్ చీఫ్ చెప్పారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని కేసీఆర్ బదులిచ్చారు. "కాంగ్రె స్‌లో టీఆర్ఎస్ విలీనం ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని నేను స్వయంగా చెప్పలేను. పార్టీ అధ్యక్షుడిగా నాకు కొన్ని పరిమితులుంటాయ్. నేను ఏది చెప్పినా ప్రతిస్పందనలు ఉంటాయి. మీరు ఏదైనా స్వేచ్ఛగా చెప్పొచ్చు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ఉండదని మీడియా సమావేశాల్లో.. పార్టీ కార్యకర్తల సమావేశాల్లో సూటిగా చెప్పండి. ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధంకండి'' అని ఉద్భోదించారు.