ఇది చారిత్రాత్మక విజయం ; కేజ్రీవాల్‌

  ఢిల్లీలొ ఆమ్‌ఆర్మీ పార్టీ సాదించిన విజయంపై ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది అవినీతి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలలో ఆమ్‌ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ పార్టీని వెనక్కు నెట్టి రెండో స్థానం సాదించింది. కేజ్రీవాల్‌ కూడా షీలా దీక్షీత్‌పై ఘనవిజయం సాదించారు, ఈ ఫలితాలతో ఒక సామాన్యుడు కూడా అధికారం చెపట్టవచ్చని ప్రజలు నిర్ణయించారన్నారు కేజ్రీవాల్‌‌. ఈ ఎన్నికల పోరాటంలో తాము ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నామన్న కేజ్రీవాల్‌‌. అంతిమ విజయం న్యాయానిదే అని ప్రకటించారు.

షీలా దీక్షిత్ పై కేజ్రీవాల్ ఘనవిజయం

      అమ్ అద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై 8,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.ముఖ్యమంత్రి షీలా దీక్షిత్పైనే పోటీకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ మొదట కాస్త వెనకబడినట్లు కనిపించినా, మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. సామాన్య మానవుడే ఇక్కడ గెలిచాడని, కాంగ్రెస్ అరాచకాలకు సరైన సమాధానం చెప్పాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రతీకారం తీర్చుకున్నట్లే ఫలితాలు వచ్చాయి. మొత్తం 70 స్థానాల్లో 23 స్థానాల్లో అమ్ అద్మీ పార్టీ (ఏఏపీ) ఆధిక్యంలో కొనసాగుతోంది.

సుబ్బన్న ఇక లేరు

  వెండితెర మీద హాస్యశకం ముగిసింది.. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్న ఓ అసామాన్య నటుడు తుది శాస్వవిడిచాడు.. హాస్యనటుడిగా, రచయితగా, దర్శకుడిగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా, ఇలా  బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన గత ఏడాది కాలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదులో చైతన్యపురి వద్ద గల గీతా ఆసుపత్రిలో నిన్న రాత్రి పది గంటలకు ఆయన మృతి చెందారు. ఆయన స్వస్తలమయిన ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి.    ఆ మహానటునికి నివాళి అర్పిస్తూ ఆయన జీవిత ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం...ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనగానే ఈ తరం ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పాత్ర అమాయకపు కాలేజ్‌ లెక్చరర్‌.. ఎన్నో సినిమాల్లో లెక్చరర్‌గా నటించిన ఆయన తన నటనా పటిమతో ఆ పాత్రకే అందం తీసుకువచ్చారు.. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా చేశారు..1960 ఆగస్టు 9న ప్రకాశం జిల్లా లొని కొమ్మినేని వారిపాలెంలో జన్మించారు ధర్మవరపు.. చిన్ననాటి నుంచే నటన మీద ఉన్న మక్కువతో నాటకాలు వేసేవారు.. ముఖ్యంగా వామపక్షభావజాలానికి ఆకర్షిడైన ఆయన ప్రజానాట్యమండలితో కలిసి ఎన్నో సందేశాత్మక రచనలు చేశారు.. చదువుకునే వయసులోనే ఎక్కువగా నాటకాల వైపు మల్లడంతో విద్యాబ్యాసం కూడా దెబ్బతింది.. ఒక దిశలో ఇంటర్‌ కూడా ఫెయిల్‌ అయిన ధర్మవరం తల్లి కోరిక మేరకు పట్టుదలగా చదివి ఇంటర్‌ పూర్తి చేశాడు.. తరువాత బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో ఉద్యోగిగా చేరారు..అయితే నాటకాల మీద ఆయనకు ఉన్న మక్కువ ఆయన్ను ఎక్కువ రోజులు ఉద్యోగిగా కొనసాగనివ్వలేదు.. దీంతో కొంత మంది దగ్గర మిత్రులతో కలిసిన నాటకాలు వేయటం ప్రారంభించారు. అలా నాటక రంగంలో బిజీ కావటంతో ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామ చేయాల్సి వచ్చింది.నాటకరంగంలో బిజీగా ఉన్న ఆయన ఆకాశవాణి కొసం నాటకాలు రాయడం ప్రారంభించారు.. అప్పటి వరకు నటిడిగా ఆయనకు ఉన్న అనుభవానికి తన మార్క్‌ హాస్యం జోడించి అద్భుతమైన నాటికలు తయారు చేశారు.. తెలుగు టెలివిజన్‌ రంగానికి ధారావాహికలను పరిచయం చేసిన ఘనత కూడా ధర్మవరానిదే.. అప్పటి వరకు టెలీఫిలిం లు మాత్రమే తెలిసిన తెలుగు వారికి ఒకే సీరియల్‌ను భాగాలు టెలికాస్ట్‌ చేయోచ్చు అంటూ అనగనగా ఒక శోభ సీరియల్‌ ద్వారా పరిచయం చేశారు.. తరువాత  బుల్లితెర మీద ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో అలరించారు, సీరియల్‌ దర్శకుడిగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ముఖ్యంగా మనసు గుర్రం లేదు కళ్లెం, పరమానందయ్య శిష్యుల కథ లాంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..ముఖ్యంగా దూరదర్శన్‌లో ఆయన చేసిన ఆనందో బ్రహ్మ ఆయనకు నటునిగా దర్శకునిగా మంచి గుర్తింపు నిచ్చింది.. ఈ సీరియల్‌ ఘనవిజయం సాదించటంతో ఆయన టెలివిజన్‌ ప్రేక్షకులకే కాదు.. సినీరంగంలోనూ సుపరిచితులయ్యారు.. టెలివిజన్‌ రంగంలో మంచి పేరు తెచ్చుకోవటంతో సినీరంగం నుంచి కూడా ధర్మవరానికి అవకాశాలు వచ్చాయి.. ఎంతో మంది హస్యనటులకు నటులు జన్మనిచ్చాన జంధ్యాల ధర్మవరాన్ని జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ధర్మవరం తరువాత వరుస అవకాశాలతో మంచి హాస్యనటునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. టెలివిజన్‌ రంగంలో దర్శకునిగా తనకు ఉన్న అనుభవంతో తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు ధర్మవరం.. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాదించకపోవటం తరువాత దర్శకత్వానికి దూరంగా ఉంటూ కేవలం నటునిగానే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వునేను, జయం, ధైర్యం లాంటి సినిమాలతో ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ధర్మవరం.. ముఖ్యంగా కాలేజీ లెక్చరర్‌తో పాటు తాగుబోతు పాత్రలలో ఆయన నటన కడుపుబ్బ నవ్విస్తుంది.. ఆయన చేసిన పాత్రలలో ఒక్కడు సినిమాలోని పాస్‌ పోర్ట్ ఆఫీసర్‌ క్యారెక్టర్‌తో పాటు, వర్షం సినిమాలోని వాతావరణ శాఖాదికారి పాత్రలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.. ముఖ్యంగా ఢిఫరెంట్‌ డిక్షన్‌తో ఆయన చెప్పే డైలాగ్‌లకు థియేటర్స్‌లో విజిల్స్‌ పడేవి..మరింత కాలం తన నటనతో మనల్ని అలరిస్తాడనుకున్న ధర్మవరం ఇలా అర్థాంతరంగా మన అందరిన మోసం చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో సినీ రంగంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా దిగ్‌భ్రాంతి గురయ్యారు.. ఆయన మరణంతో తెలుగు తెర మీద ఓ హస్యశకం ముగిసింది.. కొన్ని పాత్రల ప్రయాణం ఆగిపోయింది.. ఎన్నో పాత్రలతో తెలుగు ప్రేక్షక లోకాన్ని అలరించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి మరొక్కసారి నివాళి అర్పిద్దాం..

కేసీఆర్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు

      వివాదాలు అంటే ముందుండె సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాష్ట్ర విభజన పై, కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. అమెరికాలో కేసీఆర్ లాంటి వ్యక్తి లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవని కామెంట్ చేశారు. కేసీఆర్ అమెరికాకు తన మకాం మార్చి అమెరికా పౌరులకు విభజన పాఠాలు చెప్పాలని సూచించారు.   కేసీఆర్ లాంటి నాయకులు అమెరికాని విభజించాలని వాదించి గెలవగలరని పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమాలు జరగలేదని, ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి ‘సమర్థుడైన’ నాయకులు లేకపోవడమే కారణమని వర్మ ట్విట్ చేశారు. కేసీఆర్ అమెరికా పౌరుడిగా పుట్టి వుంటే ఆయన ఏం సాధించేవారో చూడాలని వుందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేశారు. 

ఎపిఎన్జీవోలో విభేదాలు

      ఏపీఎన్జీవోలలో విభేదాలు మొదలయ్యాయి. తన స్వార్ధ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కొరకు అశోక్ బాబు ఉద్యోగులను బలి చేస్తున్నారని, ఇంతవరకు ఆయన ఏపీఎన్జీవోల సంఘానికి వచ్చిన విరాళాల గురించి చెప్పడం లేదని, హైదరాబాద్ లో సమైక్యాంధ్ర సభ పెట్టినప్పుడు అమ్మిన కూపన్ల గురించి చెప్పడం లేదని ఏపీఎన్జీఓ నేత సుబ్బరాయన్ విమర్శించారు. అశోక్ బాబు రాజకీయ పార్టీ పెట్టడానికి రిజిస్టర్ చేశారని, ఆయనకు పార్టీ పెట్ట దలచుకుంటే, రాజకీయాల్లోకి వెళ్ల దలచుకుంటే వెంటనే ఏపీఎన్జీఓల సంఘం నుండి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆయన సొంత విషయంగా ఆశోక్ బాబు చూస్తున్నారని ఆయన విమర్శించారు.

కావూరి నంగనాచి కబుర్లు

      కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు...పదివి రాకముందు అత్యుత్సాహంగా సమైక్యవాదిగా ప్రకటనలు గుప్పించి, పదివి దక్కిన మారుక్షణమే మౌనముద్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతా అయిపోయాక నేను ఇంకా వీర సమైక్యవాదినే అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. భద్రాచలం డివిజన్ ను ఆంద్రకు కలపాలని డిమాండ్ చేశామని, హైదరాబాద్ ను పదేళ్లపాటు కేంద్రపాలితం చేయాలని కోరినా ఒప్పుకోలేదని అంటున్నారు.   కర్నూలు,అనంతపురం జిల్లాలకు హైదరాబాద్ అందుబాటులో ఉంటుందని, వారికి ఉపయోగం ఉంటుందని రాయల తెలంగాణ ఇవ్వాలని కోరామని, దానిని ఒప్పుకోలేదని కావూరి చెప్పారు. ఈ నేపధ్యంలో తాను మంత్రివర్గం సమావేశం నుంచి బయటకు వచ్చానని ఆయన అన్నారు. అయితే విభజనకు ఒప్పుకుంటున్నాము కనుక ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నామని కావూరి తెలిపారు. అంతా అయిపోయి సీమాంధ్రుల చేతుల్లో కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీ చిప్ప పెట్టేసిన తరువాత కూడా ఇప్పుడు ఇంకా ఆ డిమాండ్ కు అర్థం వుందా!?  

ఆశలు ఆవిరైపోయయా?

      కేంద్ర మంత్రివర్గం పదిజిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ముసాయిదా బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళిపోయింది. ఇక ఇపడు జరగాల్సిందల్లా తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి పరిశీలన తర్వాత రాష్ట్ర శాసనసభకు రావటం, సభ్యుల మనో అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టటం మాత్రమే మిగిలింది.   రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపతి బెంగాల్ పర్యటన తరువాత టీ బిల్లు ముసాయిదా రాష్ట్రానికి చేరుతుందంటున్నారు. అంటే 12 తేది లోపే బిల్లు వచ్చేస్తుందన్న మాట. అయితే పార్లమెంటు సమావేశాలు ముగిసే దాకా బిల్లుపై చర్చను సాగదీయాలని సమైక్యాంధ్ర నాయకత్వం ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఏమీ ఉండబోదని సీనియర్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందని, అభిప్రాయ సేకరణ తప్ప ఓటింగ్ అనేది ఉండబోదని తేలిపోయిన స్థితిలో ఎవరెన్ని మాట్లాడినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వచ్చే ఢోకా ఏమీ ఉండదు. కేబినెట్ ఆమోదించినంత మాత్రాన రాష్ట్రం ఏర్పాటు అవబోదని కొందరు, శాసనసభలో మెజారిటీ సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తే దాని ప్రభావం బిల్లుపై పడుతుందంటూ ఇంకొందరు, న్యాయ పోరాటంలోనే తేల్చుకుంటామని, ఎలాగైనా విభజన ఆపుతామంటూ మరి కొందరు చేస్తున్న ప్రకటనలు, సవాళ్ళన్నీ అర్థం లేనివిగా రాజకీయ నిపుణులు కొట్టి పారేస్తున్నారు. పార్లమెంటు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని తిరగదోడిన సందర్భాలంటూ ఏవీ లేవని, ఒకవేళ న్యాయపోరాటం చేయాలనుకుంటే రాజ్యాంగంలోని మూడవ అధికరణంపై చేయటమే తప్ప విభజన నిర్ణయంపై చేసే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. సభలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పటం సహజమే అయినా అవన్నీ సభ రికార్డుల వరేక పరిమితం అవుతాయి తప్ప వచ్చే నష్టమేమీ లేదని వారంటున్నారు.

కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో సోనియాగాంధీ లేదు

      ప్రతిష్టాత్మకమైన పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జలయజ్ఞంలో చేపట్టిన తొలి ప్రాజెక్టు పులిచింతల. రూ.1,831 కోట్లు తో పులిచింత ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారు. పులిచింత ప్రాజెక్టు సామర్థ్యం 46 టీఎంసీలు.   ప్రాజెక్టు ప్రారంభోత్సవ౦ కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరం చుట్టుప్రక్కల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బొమ్మ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.  ప్రభుత్వం ఇచ్చిన ప్రచార ప్రకటనలలో కూడా ఎక్కడా వీరి ఫోటోలు కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా, సోనియాగాంధీ, రాహుల్ గాందీ, మన్మోహన్ సింగ్ ల ఫోటోలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో వారి ఫోటోలు లేకపోవడం కన్నా వేరే సంకేతం ఏమి ఉంటుంది?

ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో పిటిషను వేస్తే

  ఈరోజు పులిచింతల ప్రాజెక్టుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. నేడు మధ్యాహ్నం జరుగబోయే ఈ సభలో ఎక్కడా సోనియా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ల ఫోటోలు పెట్టలేదు. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరించిన తరువాత ఆయన చేయబోయే ప్రసంగంలో రాష్ట్ర విభజన అంశం గురించి ప్రస్తావించి, కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించడం కూడా ఖాయం. ఇక రాష్ట్ర విభజన అంశం తుది దశకు చేరుకొంటున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన తదుపరి వ్యూహాలు, రాజకీయ భవిష్యత్ గురించి కూడా ఈ సభలో చుచాయాగా తెలుపవచ్చును.   నిన్నజరిగిన సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యుల సమావేశంలో ఆయన రెండు ఆసక్తికరమయిన సూచనలు చేసారు. ఒకటి శాసనసభలో తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖించేందుకు ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరడం, తను స్వయంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ పిటిషను వేయడం. అయితే మొదటి ప్రతిపాదనకు ఎన్ని పార్టీలు మద్దతు ఇస్తాయో తెలియనపటికీ, అదే సాధ్యమయితే శాసనసభ అభిప్రాయానికి వ్యతిరేఖంగా కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకొంటున్నట్లవుతుంది. గనుక అది రాజ్యాంగ విరుద్దమని ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టులో పిటిషను వేస్తే అది మరొక సంచలనం అవుతుంది. కాంగ్రెస్ నేతలే కాంగ్రెస్ పరువు తీసుకోవడానికి ప్రతిపక్షాల సహకారం కోరుతుంటే వారు కూడా కాదనలేకపోవచ్చును.    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందునా తన స్వంత పార్టీ, ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేస్తే దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై తప్పక పడుతుంది. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యంగ విరుద్దంగా వ్యతిరేఖంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను దీనితో దృవీకరించినట్లవుతుంది గనుక కాంగ్రెస్ అధిష్టానానికి దేశంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతాయి. ఒకవేళ రాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టు బిల్లుకి వ్యతిరేఖంగా స్పందిస్తే, ఈవిషయం దేశవ్యాప్తంగా టాంటాం అయిపోయి కాంగ్రెస్ పార్టీ పరువు గంగలో కలిసిపోతుంది. మరోనాలుగయిదు నెలలో ఎన్నికలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్ర నష్టం కలిగించదమే కాక, ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి మంచి ఆయుధంగా మారుతుంది కూడా.     అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా తన పరువు తీయక ముందే కాంగ్రెస్ ఆయనని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించడమో లేక ఆయనను ఎదుర్కొనేందుకు తగిన వ్యూహం సిద్దం చేసుకోక తప్పదు.

రాజీనామాను ఆమోదించండి: చిరు

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని  ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల హక్కులు నెరవేరాలంటే హైదరాబాదును యూటీ చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు.   విభజన అంశం మీద కేంద్రం తీరును తప్పుపడుతూ ఆయన లేఖ కూడా రాశారు. గత అక్టోబరులో ప్రధానికి లేఖ రాసిన సమయంలోనే తన రాజీనామాను ప్రస్తావించానని, రాజీనామాను తక్షణం ఆమోదించాలని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి చిరు రాజీనామాను ఆమోదిస్తారా ? లేక ఆయన రాజీ పడతారా ? వేచిచూడాలి.

రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాలలో అభ్యంతరాలు

  రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు, నేతలు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చడం సహజమే కానీ తెలంగాణా ప్రజలు కోరుకొంటున్నట్లుగా పది జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నపటికీ వారు కూడా సంతృప్తిగా లేకపోవడం ఆశ్చర్యమే, కానీ ఇది ఊహించిన పరిణామమే. కేసీఆర్ తెలంగాణా బిల్లులో అనేక లొసుగులను ఎత్తి చూపి, ఇది తమకి ఆమోదయోగ్యంగా లేదని నిరసన వ్యక్తం చేస్తుంటే, తమ అభిప్రాయాలకు, మనోభావాలను ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేయడాన్ని సీమాంధ్ర ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసిస్తున్నారు.   ఇరుప్రాంతల నేతలు ఈ ప్రక్రియలో రాజ్యంగ విరుద్దంగా ఉన్నఅంశాలను ఎత్తి చూపడం మరో విశేషం. ఉమ్మడి రాజధాని అనే మాట మన రాజ్యాంగంలోనే లేదని, అయినా మానవతా దుక్ప్రధంతో ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించామని కేసీఆర్ అంటుంటే, అసలు ఈ ప్రక్రియ మొత్తం రాజ్యంగవిరుద్దంగానే సాగుతోందని సీమాంధ్ర నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.   అదేవిధంగా ఉన్నత విద్య, విద్యుత్, జలవనరులు, హైదరబాద్ పై గవర్నర్ పెత్తనం వంటి వాటిపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు ఏవిధంగా పంచుకోవాలో మాట్లాడిన ఆయన, ఆస్తుల పంపకాల మాట మాత్రం ఎత్తకపోవడం విశేషం.   ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన చేసినట్లయితే తలెత్తే సమస్యల గురించి ఏమేమి చెపుతున్నారో, ఇప్పుడు కేసీఆర్ కూడా ఇంచుమించు అదే విధంగా మాట్లాడటం విశేషం. రెండు ప్రాంతాలలో విస్తరించి ఉన్న జల, విద్యుత్ ప్రాజెక్టులను ఏవిధంగా విభజిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం మంత్రుల బృందం ఏవో తాత్కాలిక ఉపాయాలు చెప్పి చేతులు దులుపుకొందే తప్ప, శాశ్విత పరిష్కారాలు ఒక్కటీ చూపలేదు. అందువల్ల ఇక రాష్ట్రం విడిపోయిన నాటి నుండి రెండు ప్రాంతాల ప్రజలు, రైతులు, ఉద్యోగులు, వ్యవస్థల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం అనివార్యమని స్పష్టం అవుతోంది.   అందుకే కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తుంటే, చంద్రబాబు ముందుగా ఈ సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపిన తరువాతనే రాష్ట్ర విభజన చేయమని గట్టిగా కోరుతున్నారు. కానీ రాష్ట్ర విభజనతో రాజకీయ ప్రయోజనం పొందాలనే దురాశతో కేంద్రం తనకు తోచినట్లు విభజన చేసి చేతులు దులుపుకొంటోంది.   కారణం, రానున్నఎన్నికల తరువాత తమ యుపీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడం వలననే. అందువలననే సంక్లిష్టమయిన ఈ సమస్యలన్నిటికీ తన తరువాత వచ్చే ప్రభుత్వానికి వదిలిపెట్టి కాంగ్రెస్ అధిష్టానం చేతులు దులుపుకొంటోంది. లేకుంటే తగినంత సమయం తీసుకొని సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, దానికి శాశ్విత పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం తప్పక చేసి ఉండేది.   సీమాంధ్ర ప్రజలు రాష్ట్ర విభజనను ఎంతగా వ్యతిరేఖిస్తున్నపటికీ, విభజన అనివార్యమని నమ్మి అందుకు మానసికంగా సిద్దపడిన కేంద్రమంత్రులు, యంపీలు కేంద్రం ఆమోదించిన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్దిష్టంగా ఎటువంటి ప్యాకేజీ గురించి పేర్కొనకపోవడంతో వారు కూడా తీవ్ర అసంతృప్తి గురయ్యారు. ఈవిధంగా రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఇంతకీ ఎవరిని సంతోషపెట్టాలనుకొంటోంది? తెలంగాణా ప్రజలనా? లేక తెరాస నేతలనా? లేక స్వంత పార్టీ నేతలనా?లేక మరెవరినయినానా? ఎవరికీ అమోదయోగ్యం కాని విధంగా విభజించి తను ఏవిధంగా రాజకీయ ప్రయోజనం పొందగలనని భావిస్తోంది?

రాష్ట్రపతి భవన్‌కు చేరిన తెలంగాణ బిల్లు

  రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతున్నా కేంద్రం మాత్రం విభజన విషయంలో చకచక అడుగులు వేస్తుంది. కేంద్ర మంత్రి వర్గం ఆమెదించిన 24 గంటలలోనే టి బిల్లును రాష్ట్రపతి భవన్‌కు పంపింది కేంద్రం. కేంద్ర హొం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆంద్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థికరణ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పరిశీలనకు శుక్రవారం సాయంత్రం పంపారు. అయితే ప్రస్థుతం ప్రణబ్‌ కొల్‌కత్తా పర్యటనలో ఉన్న కారణంగా ఆయన తిరిగి వచ్చాకే తదుపరి కార్యాచరణ జరగనుంది. బిల్లు ప్రతి, కేబినెట్ నోట్, జీవోఎం నివేదికతోపాటు హోం శాఖ నోట్, న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా రాష్ట్రపతికి పంపినట్లు తెలిసింది. అయితే సోమవారం కొల్‌కత్తా తిరగిరానున్న రాష్ట్రపతి రెండు మూడు రోజుల పాటు టిబిల్లును పరిశీలిస్తారు. బిల్లుపై ఆయన కూడా న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.ముఖ్యంగా ఆర్టికల్  371(డి)లో ఏ మార్పు చేసినా రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని అటార్నీ జనరల్ వాహనావతి, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ విశ్వనాథన్ పేర్కొన్నప్పటికీ ఆ అవసరంలేదని, సాధారణ మెజారిటీతో బిల్లును ఆమోదించవచ్చునని జీవోఎం అభిప్రాయపడింది. ముసాయిదా బిల్లు పరిశీలనకు రాష్ట్రపతి ఎంత సమయం తీసుకుంటారు? అభిప్రాయం తెలిపేందుకు అసెంబ్లీకి ఎంత గడువు ఇస్తారు? అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. అసెంబ్లీకి ఎంత గడువు ఇవ్వాలనే అంశాన్ని ఆర్టికల్ 3లో పొందుపరచలేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రపతి అసెంబ్లీకి ఇచ్చి గడువు మీదే అందరి దృష్టి ఉంది.

సీమాంద్రలో మిన్నంటిన ఆందోళనలు

  రాష్ట్ర విభజన నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా లభిచడంతో సీమాంద్రజిల్లాలు భగ్గుమన్నాయి. ఏక పక్షంగా జరిగిన ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ టిడిపి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈ మేరకు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సీమాంద్ర జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరింగింది. అయితే ఈ రోజు కూడా బంద్‌కు పిలుపునివ్వడంతొ పదమూడు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ప్రజలు స్వచ్చందంగా బంద్‌కు సహకరించారు. షాపులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. పార్టీలు ప్రజాసంఘాల చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్ని నిరసన తెలిపారు. చాలాచోట్ల సోనియా గాందీ, సుశీల్‌కుమార్‌ షిండే, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు.

సమైక్య ఉద్యమానికి అఖిలేష్‌ మద్దతు

  కేంద్ర కేభినేట్‌ నిర్ణయం నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతుండగా జాతీయ స్థాయిలో కూడా సమైక్యాంద్రకు మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పలు పార్టీలు విభజనకు తాము వ్యతిరేఖమని ప్రకటించగా ఇప్పుడు తాజాగా సమాజ్‌వాది పార్టీ నాయకుడు యూపి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కూడా తన ఆంద్రప్రదేశ్‌ విభజనకు వ్యతిరేకమని ప్రకటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం లక్నోలో అఖిలేష్‌ను కలుసుకున్నారు. సమైక్య ఉద్యమంలో తమకు అండగా నిలవాలి ఆయన్ను జగన్‌ కోరారు. అఖిలేష్‌ కూడా అందుకు సానుకూలంగా స్పందించారు. విభజన బిల్లును పార్లమెంట్‌లో అడ్డుకుంటామని ప్రకటించారు.

తెదేపా, వైకాపాలను కలుపుకుపోతాం: శైలజానాథ్

    ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోరుకొంటున్న కొందరు సీమాంధ్ర శాసనసభ్యులు,మంత్రులతో తన క్యాంప్ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. అనంతరం మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న కేంద్రం ఆమోదించిన తెలంగాణా బిల్లుపై తాము చర్చించామని, బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఏవిదంగా దానిని ఎదుర్కోవాలో చర్చించామని తెలిపారు. ఈసారి తెదేపా, వైకాపా సీపీయం,బీజేపీ తదితర పార్టీల మద్దతు కూడా తీసుకొని బిల్లుని సభలో అడ్డుకొనే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్దంగా సాగుతోందని, దానిని తామంతా తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నామని అన్నారు. బిల్లుకి వ్యతిరేఖంగా సభ అభిప్రాయలు వ్యక్తం చేసినట్లయితే, దానిని రాష్ట్రపతి కూడా విస్మరించలేరని ఆవిధంగా తాము బిల్లుని ఆపే ప్రయత్నం చేయాలనీ భావిస్తున్నట్లు తెలిపారు.     ఇంతవరకు జరిగిన విభజన ప్రక్రియలో తెదేపా, వైకాపాలను కాంగ్రెస్ ఎన్నడూ పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం తన స్వంత పార్టీ నేతల అభిప్రాయాలకి కూడా అది విలువ ఈయలేదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తనను రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని దృడంగా నమ్ముతున్న తెదేపా, మళ్ళీ అదే కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి వారి ఉచ్చులో పడుతుందని ఆశించడం అత్యాశే. పైగా తెదేపా రాష్ట్ర విభజనకు ఇప్పటికీ కట్టుబడే ఉందని, అయితే అది న్యాయ బద్దంగా జరగాలని కోరుకొంటున్నామని స్వయంగా చంద్రబాబే చెప్పినందున, తన పార్టీ సభ్యులపై ఒత్తిడి చేయకపోవచ్చును.   ఇక సమైక్యాంధ్ర సెంటిమెంటుతో సీమాంధ్రపై పట్టు కోసం తిప్పలుపడుతున్నవైకాపా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఈవిషయంలో మద్దతు ఇచ్చి సీమాంధ్రలో తన రేటింగ్ పెంచుకొనే ప్రయత్నం చేయవచ్చును. పైగా తాను తెలంగాణా బిల్లుని సభలో వ్యతిరేఖించితే, తెదేపా మాత్రం దానికి మద్దతు పలికిందని సీమాంధ్రలో ప్రచారం చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది గనుక బిల్లు వ్యతిరేఖించే విషయంలో సమైక్యవాదం చేస్తున్నకాంగ్రెస్ నేతలకు వైకాపా సహకరించవచ్చును. సీపీయం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంట్, అసెంబ్లీలో అడ్డుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసారు.   సరిగ్గా ఇదే రోజు ఉదయం కేంద్రమంత్రులు చిరంజీవి, పురందేశ్వరి బీజేపీ నేత వెంకయ్య నాయుడిని కలిసి పార్లమెంటులో తెలంగాణా బిల్లు అడ్డుకోవలసిందిగా అభ్యర్దించారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మంత్రి తమ ప్రత్యర్ధులను అదేవిధంగా కోరడం విశేషం.  కాంగ్రెస్ అధిష్టానం  ఏ బిల్లుతో బీజేపీని రాష్ట్రంలో దెబ్బ తీయాలని చూస్తోందో అదే బిల్లు ఆమోదం కోసం మళ్ళీ బీజేపీ మద్దతు కోరడం మరో విచిత్రం. కాంగ్రెస్ అధిష్టానం బిల్లుకి మద్దతు ఈయమని తన రాజకీయ ప్రత్యర్ధులను కోరుతుంటే, అదే పార్టీకి చెందిన  నేతలు బిల్లుని ఓడించేందుకు మద్దతు కోరుతుండటం మరో విచిత్రం.  

కేసీఆర్ కోసమే ‘రాయల తెలంగాణ’

      కెసిఆర్ ను దారిలోకి తెచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీ తనమార్కు రాజకీయం ప్లే చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని తాయిలం ఆశ చూపిస్తూ వచ్చిన కేసీఆర్ తీరా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ప్లేటు ఫిరాయించేశాడు.   అందుకనే రాష్ట్ర విభజన బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందే ముందు రోజున ‘ఇచ్చేది రాయల తెలంగాణ’ అనే మాటను లీక్ చేయడం ద్వారా కేసీఆర్‌ని దారిలోకి తెచ్చిందని, కేంద్రం ‘రాయల తెలంగాణ’ ఇవ్వబోతోందన్న వార్త బయటకు రాగానే కేసీఆర్‌లో టెన్షన్ పెరిగి కాంగ్రెస్‌కి దాసోహం అన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  రాత్రికి రాత్రే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ఒప్పందాలు చాలా పకడ్బందీగా కుదిరి వుండవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ విలీనం విషయంలో తల ఎగరేసిన కేసీఆర్‌కి కీలక సందర్భంలో విలీనానికి ఒప్పుకోక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ అధిష్ఠానం సృష్టించిందని, కేసీఆర్‌ని దారిలోకి తేవడానికి ‘రాయల తెలంగాణ’ అస్త్రాన్ని విజయవంతంగా వాడుకుందని అంటున్నారు.

"ఆత్మగౌరవాన్ని'' సోనియాకు తాకట్టుపెట్టిన నాయకులు!

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]   "వీడు అమ్మపెంచిన బిడ్డా, అయ్యపెంచిన బిడ్డా'' అంటే చెడిపోయినవాడెల్లా "వాడు అమ్మపెంచిన బిడ్డడే'' అన్నాడట వెనకటికొకడు! అంటే కొందరు అమ్మలా లక్షణాలు అలా ఉంటాయి కాబోలు! అలా అని "అయ్యా''లందరూ మంచివాళ్ళనీ తీర్పు చెప్పలేము, అయ్యల్లోనూ 'కొయ్య'మొగాలుంటాయి! ప్రేమకు, అబిమానానికి కూడా కొన్ని హద్డులుంటాయి. ఆ హద్దులు దాటినవాళ్ళు తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టుపెట్టేసి ఎంతకైనా దిగజారుతారనడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ విభజన సమస్య విషయంలో రాష్ట్రంలోని సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాల అధికారపక్షం, కొన్ని ప్రతిపక్షాల నాయకులు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియాగాంధీ పట్ల హద్దులు మీరి ప్రకటిస్తున్న 'విధేయత' శ్రుతిమించిన పొగడ్తలే నిదర్శనం! చివరికి వీళ్ళు అఆత్మగౌరవాన్ని కూడా చూసుకోనంతగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపున అనూహ్యమైన రీతిలో సోనియాగాంధీ పుట్టుపూర్వోత్తరాల తబిశీళ్ళ గురించి, ఆమె కుటుంబం తాలూకూ వివరాల గురించీ, వివాహమైన తీరు గురించీ, చివరికి ఆమె పేరుకున్న పూర్వరంగాన్ని గురించీ ఇంటర్నెట్ లోనూ, వెబ్ సైట్స్ లోనూ వస్తున్న అసాధారణ సమాచారం గురించీ ఆంధ్రప్రదేశ్ లోని ఇరుప్రాంతాలలోని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లో చేరడానికి ఉవ్విళ్ళూరుతున్న వేర్పాటువాదియైన 'బొబ్బిలిదొర' ఏమాత్రం పట్టించుకున్నట్టులేరు! ఒకవేళ పట్టించుకునే పక్షంలో ఇంటర్నెట్, వెబ్ సైట్స్ లో భారీస్థాయిలో సోనియా గురించి ప్రవాహవేగంతో కుమ్మరిస్తున్న సమాచారంవల్ల తామిప్పటికే కోల్పోయిన ఆత్మగౌరవం మరింతగా ఎక్కడ బుగ్గిపాలై పోతుందోనని వీరికి భయమైనా ఉండి ఉండాలి, లేదా తుమ్మితే ఊడిపోయే తమ పదవులను కాపాడుకునే యత్నంలో పరువుప్రతిష్టలను ఆత్మగౌరవాన్ని సహితం పణంగా పెట్టినందువల్ల అదనంగా వచ్చే నష్టంలేదన్న భరోసా అయినా ఉండి ఉండాలి!   ఆత్మగౌరవంతో హుందాగా ప్రజలకు నాయకత్వం వహించి దేశ స్వాతంత్ర్యరథాన్ని సజావుగా నడిపించిన ఒకనాటి కాంగ్రెస్ నాయకత్వం వేరు, కేవలం 65ఏళ్ళ పాలనలో రాజ్యపాలనకు వచ్చిన కాంగ్రెస్, బిజెపి సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన ఈ రెండు పార్టీల నాయకులు వేరు. స్వాతంత్ర్యానంతర భారతంలో కనీసం కడచిపోయిన గత నలభయ్యేళ్లలోనూ "ప్రోగ్రెసివ్ టాక్సేషన్'' స్థాయిలో పాలకపక్షాలయిన ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులూ, వారి పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ, వారి ప్రధానమంత్రులు, మంత్రులు సహా ఎలా ఏదో ఒక అవినీతికి పడగలెత్తుతూ వచ్చిన వారే! కనుకనే కేంద్రస్థాయిలో అవినీతికి, కుంభకోణాలకు అంతులేకుండా పోయింది.  ఈ పరిణామం కేంద్రస్థాయిలో సోనియాను కూడా ఇరకాటంలో పెట్టగల స్థాయికి చేరుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యపై సోనియా వహించిన నాయకపాత్ర ఎంతో చరిత్రగలిగిన తెలుగుజాతికి వినాశకరంగా పరిణమించింది; ఆమె దృఢమైన అవగాహనకు తెలుగుప్రజల్ని నెట్టివేసింది! ఇందుకు దోహదం చేయడంలో తమ పదవీ స్వార్థప్రయోజనాల కోసం ఇరుప్రాంతాల కాంగ్రెస్ నాయకులు సిగ్గువిడిచి సోనియాకు చేయూతనిచ్చారు. ఇరుప్రాంతాలలోని తెలుగుప్రజలు ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంద్వారా ప్రజలలో చైతన్యాన్ని రేకెత్తించి, తెలంగాణలో "చెట్లపాదులను కూడా రాజకీయలు మాట్లాడ''గల స్థాయికి చేర్చిన వాతావరణంలో అంతవరకూ "నీ బాన్చను దొరా, నీ కాల్మొక్తా'' అన్న స్థితినుంచి ప్రజలైనా విముక్తి పొందారుగాని నాయకులు మాత్రం ఆ దుస్థితినుంచి విముక్తి పొందలేదని ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయి. నేడు ఇరుప్రాంతాలలో పెక్కుమంది కాంగ్రెస్ నాయకులు ప్రజలు 60 ఏళ్ళనాడే సాయుధపోరాట దీక్షలో తన్నితగలేసిన బానిసత్వాన్ని అందిపుచ్చుకుని తెలుగుజాతిని చీల్చడానికి కంకణం కట్టుకున్న సోనియా ముందు "నీ బాన్చలం తల్లీ! నీ కాల్మొక్తాం'' అంటూ సాగిలపడడాన్ని తెలుగుజాతి సహించలేకపోతోంది! "ఆత్మగౌరవ పోరాటా''న్ని కాస్తా వీరు ఆత్మవంచనా ప్రక్రియగా మార్చేశారు. సోనియా కాళ్ళముందు సాగిలపడడంలో ఏ స్థాయికి వీరు దిగజారిపోయారో కొన్ని ఉదాహరణలు : కేవలం రానున్న జనరల్ ఎన్నికల్లో మన రాష్ట్రంలో కోల్పోనున్న కాంగ్రెస్ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను కాపాడుకునేయత్నంలో, తద్వారా తన వారసుడైన రాహుల్ రాజకీయ భవిష్యత్తును పదిలపరచుకునేందుకు సోనియా తెలుగుజాతిని ముక్కలు చేయడానికి సంకల్పించి రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆశీస్సులు పలకడంతో రాష్ట్రప్రజలు పెద్దఎత్తున నిరసనకు దిగవలసివచ్చింది. ఆ నిరసన రకరకాల రూపాల్లో వ్యక్తం కావటం, జీవన్మరణ సమస్యలను ప్రజలు ఎదుర్లోవలసి వచ్చినప్పుడు అతి సహజం.ఆ ధర్మాగ్రహంలో భాగమే ప్రజాబాహుళ్యం సోనియా, రాహుల్ గాంధీల బొమ్మలతోపాటు, విగ్రహాలతో పాటు రాష్ట్ర విభజనకు పదవీ స్వార్థప్రయోజనాల కోసం 'గొర్రెల్లా' తలలు వూపిన స్థానిక ఎం.పి.ల, ఎం.ఎల్.ఏ.ల దిష్టిబొమ్మల్ని కూడా తగలపెట్టారు. ఆ క్రమంలో కొందరు స్థానిక కాంగ్రెస్ వందిమాగధులు తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నదికాగ, ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా న్యూనపరుస్తూ ప్రకటనలు విడుదల చేశారు. రాష్ట్ర విభజన ద్వారా తెలుగుజాతిని కించపరచడానికి నడుంకట్టుకున్న కాంగ్రెస్ అధిష్ఠానాన్ని, దాని నాయకురాలయిన సోనియానూ ఎదుర్కునేదిపోయి, ఇరుప్రాంతాలలోని స్థానిక కాంగ్రెస్ నాయకులు, వారికి తన స్వార్థం కొద్దీ కాపుకాస్తున్న "బొబ్బిలిదొర'' వర్గమూ "సోనియాను కించపరిచినవారిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రకటనలు జారీచేశారు; అంతేగాదు, ఆమెను తమ పాలిట"స్థానిక దేవత''గా ప్రకటించి, ఆ "దేవత''కు ఒక "దేవాలయాన్ని'' కూడా నిర్మించాలని పోటాపోటీలమీద ఒక జిల్లా కాంగ్రెస్ నాయకులే బాహాటంగా తీర్మానించారు! తెలుగుజాతిని చీలుస్తున్నందుకు "జైజై సోనియా'' అంటూ ప్రత్యేక యాత్రలు తలపెట్టారు! ఈ 'మేళా'లో ఒక గమ్మత్తు పరిణామం కూడా ఘటిల్లింది. ఇది, తెలంగాణా ప్రజలు మిలిటెంట్ పోరాటాల ద్వారా విదిలించుకున్న, వదిలించుకున్న బానిసత్వంలోకి తిరిగి ప్రజల్ని నెట్టేందుకు, తమ పెత్తనాన్ని తిరిగి ప్రతిష్ఠించి, బడుగు ప్రజలనెత్తిపైన పెత్తనం కొనసాగించుకోడానికి 'దొరల'పార్టీ (తెలంగాణా పేరిట ఏర్పడిన 'సమితి') నాయకులకూ, పాట జాగిర్దారీ, భూస్వామ్య కుటుంబాలకు చెందిన ఇతర మోతుబరులకూ తీవ్రమైన రాజకీయపోరు సాగుతోందని ప్రజలు మరచిపోరాదు. ఆ 'మాధ్యమాన్ని'' సోనియాలో చూసుకున్నారు! రోగి కోరుకున్నదీ, వైద్యుడు సూచించిన మందూ ఒకటే అయింది! ఆ మాధ్యమమే సోనియా! కాని సోనియా పుట్టుపూర్వాలు ఈ తెలుగునాయక 'బానిసల'కు తెలిసినప్పటికీ వీరు 'కిమ్మన్నాస్తిగా' నటించడంద్వారా తమ పదవుల్ని రక్షించుకోవటమే ప్రధాన వ్యాపకంగా మారింది! సరిగ్గా ఈలోగా, భారతీయులుగానీ, వారిలో భాగమైన తెలుగుజాతిగానీ గర్వించడానికి సంకోచించే విషయాలు సోనియా గురించి వెబ్ సైట్స్ లో తామర తంపరగా దూసుకువచ్చాయి! పండిట్ నెహ్రూ కుటుంబం, మోతిలాల్ నెహ్రూ సహా తమ ఆస్తిపాస్తులను, స్థిరచరాస్తులనూ అత్యధికభాగం భారత స్వాతంత్ర్యోద్యమం కోసం ధారపోశారు. ఈ పెత్తందారీ పోరును కడకంటూ కొనసాగించుకోడానికి ఒక నాయకత్వ మాధ్యమం కరిగించుకున్నారు. కాని సోనియాగాంధీ, ఆ ఇంటికోడలుగా అడుగుపెట్టిన తరువాత సోనియా ఇంగ్లాండ్ రాణి ఆస్తుల విలువను కూడా వెనక్కినెట్టేసి, రూ.12 వేల కోట్ల విలువగల ఆస్తుల్ని కూడబెట్టిందనీ, 16వ స్థానంలో ఉన్న ఇంగ్లాడ్ రాణిని 12వ స్థానాన్ని ఆక్రమించుకున్న సోనియా ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలయిందనీ ప్రసిద్ధ అమెరికన్ మీడియా "హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్'' ఈ నెల 3వ తేదీన (3-12-2013) ఆరోపణ చేసింది! ఇలా మరెన్నో వివరాలను ఈ సంస్థ బట్టబయలు చేసింది. ఈ "పురోగతి''చూస్తూ తెలుగువాళ్ళలో ఉన్న ఒక ముతక సామెత గుర్తుకొస్తోంది - "తన ముడ్డి గాకపోతే కాశీవరకూ దేకవచ్చు''నని! ఎందుకంటే అధికారికంగా సోనియా పేరు "సోనియాగాంధీ'' కాదనీ, ఆమె పాస్ పోర్టులో పేరు "గాంధీ''కాదు, 'సోనియా'నూ కాదనీ, ఆమె అసలు (ఇటాలియన్) పేరు "ఎడ్విజి ఆంటోనియా ఆల్బినా మాయినో'' అనీ, "సోనియా'' అన్నపదం రష్యన్ పెరనీ "వెబ్ సైట్స్''లో "ప్రతిభారతీయుడూ తెలుసుకోవలసిన సమాచారం యిది'' అనీ ఉంది!   ఇటాలియన్ వనిత అయిన ఆమెకు రష్యన్ పేరు "సోనియా'' ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానాన్ని ఆ సమాచ్వారం ఆమె తండ్రి అని చెప్పే స్టెఫానో యూజీనీ మాయినో కూడా ఇటాలియన్ కాదట, జర్మన్ అట. ఇతడు నాజీ హిట్లర్ జర్మనీలో పనిచేసినవాడు. హిట్లర్ సైన్యం రష్యామీద దురాక్రమించి, రెండవ ప్రపంచయుద్ధానికి దారితీసిన సమయంలో ఆ సైన్యంలో పనిచేసిన స్టెఫానో, రష్యా సైన్యానికి పట్టుబడిన సైనికుల్లో ఒకడు! అతన్ని రష్యన్ సైన్యం బంధించి 20 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. ఆ దరిమిలా అతన్ని రష్యన్ ప్రభుత్వం తన గూఢచారి శాఖ అయిన "కె.జి.బి.'' సంస్థకు అతడు లొంగిపోయి క్షమాభిక్ష పొందిన పిమ్మట రష్యన్ గూఢచారిగా ఉపయోగించుకుంది! నమ్మకం కుదిరిన తర్వాత శిక్షాకాలాన్ని నాలుగేళ్ళకు కుదించేశారు. జైలు నుంచి బయటపడిన స్టెఫానో తన కూతుళ్ళకు రష్యన్ పేర్లు పెట్టారు. అందులో ఒక పేరే "సోనియా'' అట! అదో గాధ! గా స్టెఫానో ఇటాలియన్ నియంత ముసోలీనీకి విధేయుడైన బంటూ, మద్ధతుదారూ అని "వికిపీడియా'' సమాచారం! అంటే ప్రపంచయుద్ధానికి కారకులయిన ఇద్దరూ (హిట్లర్, ముసోలినీ) సోనియా తండ్రికి అత్యంత సన్నిహితులు! ముసోలినీ అనేవాడు ఫాసిస్టు! అంతేగాదు, మరో విచిత్రం - కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువుగా కనిపించే నేటి ఆర్.ఎస్.ఎస్. మతోన్మాద సంస్థ పూర్వికులు ఈ ముసోలినీ, హిట్లర్ లతో సంబంధాలు కలిగినవారని జెఫ్రలాట్ అనే చరిత్ర విశ్లేషకుడు 'హిందూయిజం' పుట్టుపూర్వాల విశ్లేషణలో పేర్కొన్నాడు కూడా! స్పానిష్ రచయిత్రి జేవియర్ మోరో, ఇటాలియన్ సోనియా గురించి "ది రెడ్ శారీ'' అన్న మకుటంతో ఓ జీవిత చరిత్రను 2009లో విడుదల చేసింది. అందులో ఇండియా గురించి ప్రస్తావించి, సోనియా 'ఇండియాలో సాహసయాత్ర'లు చేస్తోందనీ, సోనియా-రాజీవ్ ల కొడుకు రాహుల్ ఈసారి ఒకే (నెహ్రూ) కుటుంబంనుంచి దేశాన్ని ఏలుతున్న వారిలో నాల్గవతరంగా భారత ప్రధానిగావచ్చునన్న నమ్మకం నాకు కలిగింద''ని జేవియర్ మోరో రాసిందట! "దేశం గొడ్డుబోయినట్టు''గా మరెవరూ ప్రధానమంత్రి కాగాలవారు ఇండియాలోనే లేనట్టుగా ఇలా ప్రచారం జరగడానికి కారణం అంతా - భారత నాయకులు చాలామంది ఆత్మగౌరవం  లేనివారు కావడమూ, వంశపారంపర్య సంస్కృతికి బానిసలు కావడమూ, నెహ్రూ కుటుంబం పార్టీలో సమర్థులయినవారిని ఎదిగి\రానివ్వకుండా జాగ్రత్త పడటమూ, ఉన్నవారిని తినాతీలుగా మార్చుకోవటమూ, వెన్నెముకగలవారి వెన్ను విరిచేయడంలోనే ఉంది! బానిస మనస్తత్వాన్ని మార్చడం కష్టమనీ, ముఖ్యంగా కట్టుబానిసల్ని పెంచే రాజకీయ పార్టీలో మరింత కష్టమని మన రాష్ట్ర రాజకీయాలు నిరూపిస్తున్నాయి.

గంటా శ్రీనివాసరావు రాజీనామా

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తనతో పాటు మరికొందరు నేతలు కూడా ఇదే బాటలో ఉన్నారని తెలిపారు. సాయంత్రం తన రాజీనామా నిర్ణయాన్ని సీఎం కిరణ్ కు తెలియజేస్తానని ఆయన అన్నారు.   ఈ ఉదయం విశాఖలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐబీ చీఫ్ లాంటి వారు హెచ్చరించినా కూడా బేఖాతరు చేయకుండా, విభజన నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు. తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న పార్టీలో తాను కొనసాగలేనని గంటా స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న రోజును బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు.