ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో పిటిషను వేస్తే
posted on Dec 7, 2013 @ 11:22AM
ఈరోజు పులిచింతల ప్రాజెక్టుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. నేడు మధ్యాహ్నం జరుగబోయే ఈ సభలో ఎక్కడా సోనియా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ల ఫోటోలు పెట్టలేదు. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరించిన తరువాత ఆయన చేయబోయే ప్రసంగంలో రాష్ట్ర విభజన అంశం గురించి ప్రస్తావించి, కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించడం కూడా ఖాయం. ఇక రాష్ట్ర విభజన అంశం తుది దశకు చేరుకొంటున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన తదుపరి వ్యూహాలు, రాజకీయ భవిష్యత్ గురించి కూడా ఈ సభలో చుచాయాగా తెలుపవచ్చును.
నిన్నజరిగిన సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యుల సమావేశంలో ఆయన రెండు ఆసక్తికరమయిన సూచనలు చేసారు. ఒకటి శాసనసభలో తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖించేందుకు ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరడం, తను స్వయంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ పిటిషను వేయడం. అయితే మొదటి ప్రతిపాదనకు ఎన్ని పార్టీలు మద్దతు ఇస్తాయో తెలియనపటికీ, అదే సాధ్యమయితే శాసనసభ అభిప్రాయానికి వ్యతిరేఖంగా కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకొంటున్నట్లవుతుంది. గనుక అది రాజ్యాంగ విరుద్దమని ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టులో పిటిషను వేస్తే అది మరొక సంచలనం అవుతుంది. కాంగ్రెస్ నేతలే కాంగ్రెస్ పరువు తీసుకోవడానికి ప్రతిపక్షాల సహకారం కోరుతుంటే వారు కూడా కాదనలేకపోవచ్చును.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందునా తన స్వంత పార్టీ, ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేస్తే దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై తప్పక పడుతుంది. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యంగ విరుద్దంగా వ్యతిరేఖంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను దీనితో దృవీకరించినట్లవుతుంది గనుక కాంగ్రెస్ అధిష్టానానికి దేశంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతాయి. ఒకవేళ రాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టు బిల్లుకి వ్యతిరేఖంగా స్పందిస్తే, ఈవిషయం దేశవ్యాప్తంగా టాంటాం అయిపోయి కాంగ్రెస్ పార్టీ పరువు గంగలో కలిసిపోతుంది. మరోనాలుగయిదు నెలలో ఎన్నికలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్ర నష్టం కలిగించదమే కాక, ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి మంచి ఆయుధంగా మారుతుంది కూడా.
అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా తన పరువు తీయక ముందే కాంగ్రెస్ ఆయనని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించడమో లేక ఆయనను ఎదుర్కొనేందుకు తగిన వ్యూహం సిద్దం చేసుకోక తప్పదు.