ఘర్షణ పై స్పీకర్ కు పిర్యాదు

      అసేంబ్లీ ఆవరణలో తెలంగాణ ముసాయిదా బిల్లు పత్రాలను చించేసిన సమయంలో తెలంగాణ ప్రాంత నేతలే కాకుండా..తెలంగాణ జర్నలిస్టులు కూడా తమ మీద దాడి చేశారని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ రోజు శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టిన నేపథ్యంలో వారు ఆ ప్రతులను చించి తగులబెట్టారు. ఈ సంధర్భంగా అసేంబ్లీ మీడియా పాయింట్ వద్ద పెద్ద గందరగోళం చెలరేగింది.అయితే వీడియో ఫుటేజ్ ల ఆధారంగా తాను చర్యలు తీసుకుంటానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. ఇక శాసనమండలిలోనూ తెలంగాణ బిల్లు ప్రతులు టీడీపీ ఎమ్మెల్సీలు చించడంతో తోపులాట జరిగింది. ఈ సంధర్భంగా నన్నపనేని రాజకుమారి కిందపడిపోయింది. శాసన మండలి ఆవరణలోనే తమకు రక్షణ లేకుంటే.. తెలంగాణ ఏర్పడ్డాక తమ ప్రాంత ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని కోరుతూ ఆమె మండలి చైర్మకు ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మీద పిర్యాదు చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి క్రింద పడిపోయారని, ఈ సంధర్భంగా నా నుండి ఇబ్బంది కలిగినట్లు భావిస్తే దానికి తాను పశ్చాత్తాప పడుతున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి శాసనసభకు డుమ్మా!!!

  శాసనసభలో తెలంగాణా బిల్లును అడ్డుకొంటామని భీకర ప్రతిజ్ఞలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈ రోజు సభలో బిల్లు ప్రవేశ పెడుతున్నకీలక సమయంలో సభకు గైర్హాజరవడం విశేషం. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన సభకు రానప్పటికీ, స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలంగాణా బిల్లును సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.   కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నివాసంలో జరిగిన భోజన సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఒక ఒప్పందం జరిగిందని తాజా సమాచారం. ఆ ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రితో సహా బిల్లుపై ఎవరెన్నివాదనలు చేసినప్పటికీ దానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా సకాలంలో దానిని రాష్ట్రపతికి త్రిప్పి పంపేందుకు, అందుకు ప్రతిగా వచ్చేఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు ఇరువురు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. బహుశః ఆ కారణం చేతనే ముఖ్యమంత్రి ఇటువంటి కీలకమయిన సమయంలో సభకు మొహం చాటేసి ఉండవచ్చని అనుమానాలు కలుగుతున్నాయి.   అదే నిజమయితే నేడో రేపో ఆయన కూడా సభకు హాజరయి బిల్లుపై గట్టిగా వాదించినప్పటికీ, ముందు ఊహించినట్లుగా తన పదవికి రాజీనామా చేయకపోవచ్చును. ఆది నుండి ప్రతి అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది గనుక, ఆయన వ్యవహారంపై కూడా సస్పెన్స్ అనివార్యమయింది. కానీ, ఇప్పుడు కధ క్లైమాక్స్ కు చేరుకొంది గనుక త్వరలోనే ఆ సస్పెన్స్ కూడా విడిపోతుంది.   ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా? లేకపోతే ఎన్నికల వరకు తన పదవిలోనే కొనసాగుతారా? లేక రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారా లేదా? అసలు ఆయన నిజంగానే సమైక్యవాదా లేక రాష్ట్ర విభజన సజావుగా సాగేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్ననాటకంలో తన పాత్ర పోషిస్తున్నారా? వంటి ధర్మసందేహాలకు సమాధానాలు త్వరలోనే దొరకవచ్చును.   ఒకవేళ ఆయన తన ముఖ్యమంత్రి పదవికి అంటి పెట్టుకొని ఉంటే ఆయన అధిష్టానం ఆదేశాలను అక్షరాల అమలు చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన బిల్లు అన్ని అడ్డంకులను అధిగమించి శాసనసభ గడప దాటిపోయిన తరువాత కూడా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సమైక్యవాదం గురించి ఎంత గొంతు చించుకొని అరిచినా అది ప్రజలను మభ్యపెట్టడానికే తప్పదానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

శాసనసభలో తెలంగాణ బిల్లు

      తీవ్ర ఉత్కంఠ, ఉద్వేగాల నడుమ కొద్ది సేపటి క్రితం మొదలయిన శాసనసభ సమావేశాలలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్-2013 (తెలంగాణా బిల్లు)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించగానే తెలంగాణా ప్రాంత సభ్యులలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. స్పీకర్ ప్రకటన చేయగానే ఆంగ్లంలో ఉన్న63 పేజీల బిల్లు కాపీలను సభలో సభ్యులందరికీ పంచిపెట్టారు. ఆ తరువాత సీమాంధ్ర సభ్యుల అందోళనల మధ్య, శాసనసభ ప్రధాన కార్యదర్శి సదాచారి రాష్ట్రపతి శాసనసభ సభ్యులకు వ్రాసిన లేఖను చదివి వినిపించారు. సీమాంధ్ర సభ్యుల ఆందోళన తీవ్రం అవడంతో సభను అరగంట సేపు వాయిదా వేసారు. మళ్ళీ సభ సమావేశమవగానే మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున బిల్లుపై చర్చ మొదలుపెట్టే అవకాశం ఉంది.

స్మగ్లర్‌ల ఘాతుకం

  రాష్ట్రంలో స్మగ్లర్‌లు ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడటం లేదు. తమ పనులకి అడ్డు వస్తున్నారని పోలీసులను కిరాతకంగా చంపాడానికి కూడా సిద్దపడుతున్నారు. తిరుమల శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు ఇలాంటి ఘాతుకానికి తెగబడ్డారు. స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ అధికారుల బృందంపై ఆదివారం ఉదయం మూకుమ్మడిగా దాడి చేసి ఇద్దరు అధికారులను హతమార్చారు. ఈ ఘటనలో మరో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు వంద మంది కూలిలు ఒకేసారి గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి ఇద్దరు ఆఫీసర్‌లను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడిలొ తిరుపతి వన్యప్రాణి అటవీ విభాగం తిరుమల శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్.ఆర్.శ్రీధర్ (50), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్(49) అక్కడికక్కడే మృతిచెందారు.

పాపం జగన్

  రాష్ట్రంలో దాదాపు అందరు కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం ఉందని భావిస్తున్నారు. ఈవిషయాన్ని సీమంధ్రలో నేతలు బహిరంగంగా ప్రకటిస్తుంటే, టీ-కాంగ్రెస్ నేతలు మాత్రం అంతరంగిక సంభాషణలలో అంగీకరిస్తున్నారు. అయితే వాటిని వైకాపా నేతలు ఎంత ఖండిస్తున్నపటికీ ప్రజలు కూడా అనుమానిస్తూనే ఉన్నారు. వారి అనుమానాలు నిజమని నిరూపిస్తూ మొన్నమీడియా సమావేశంలో సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ “జగన్మోహన్ రెడ్డిది తమ కాంగ్రెస్ డీ.యన్.యే.నే అని గతంలో అన్న మాటకు నేటికీ తాను కట్టుబడి ఉన్నానని, కాదని జగన్మోహన్ రెడ్డి అనగలడా? ఆయననే అడగండని” మీడియాతో అన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్విజయ్ సింగ్ జగన్ గురించి ఈవిధమయిన అభిప్రాయం వ్యక్తం చేయడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న డీ.యన్.యే. అనుబందాన్ని ద్రువీకరిస్తోంది.   అందుకు జగన్ తీవ్రంగా స్పందిస్తూ ‘ఆమాట అన్న దిగ్విజయ్ చెంప మీద కొట్టాలి’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుంటే తాను దానిని కలిపి ఉంచాలని పోరాడుతున్నాని, అటువంటప్పుడు తమకీ వారికీ ఏవిధంగా అక్రమ సంబంధం అంటగడతారని ఆయన ప్రశ్నించారు. అయితే మరి దిగ్విజయ్ సింగ్ ఆవిధంగా ఎందుకు అన్నట్లు? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా లగడపాటి, దివాకర్ రెడ్డి తదితరులు అందరూ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానానికి దత్తపుత్రుడని ఎందుకు అభివర్ణిస్తున్నట్లు?   జగన్మోహన్ రెడ్డి, ఆయన వైకాపా నేతలు తమకు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదని ఎంత గట్టిగా వాదిస్తుంటే, నానాటికీ ప్రజలలో మరింత అనుమానం పెరుగోతోందే తప్ప తరగడం లేదు. ఆ అనుమానాలను దిగ్విజయ్ వంటి వారు అప్పుడప్పుడు ద్రువీకరిస్తుండటంతో ప్రజలకు ఏవిధంగా సర్ది చెప్పుకోవాలో జగన్ కి అర్ధం కావడం లేదు పాపం.    

బీజేపీతో టీడీపీ దోస్తీ ఖాయమైంది..!

      తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతాపార్టీ ఎన్నికల పొత్తు ఖాయమైందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబుకు బిజెపి అగ్రనేతలు ఇచ్చిన ప్రాధాన్యం చూస్తుంటే ఈ వార్తలకు ఇంకా బలం చేకూరుస్తున్నాయి. బిజెపి ముఖ్యమంత్రి చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన బాబును బీజేపీ అగ్ర నేతలు బాగా ఆదరంగా స్వాగతించారు. ప్రమాణ స్వీకారం ఆద్యంతం బాబు మోడీ పక్కనే ఉన్నారు. ఇతర నేతలతోపాటు బాబు, మోడీలు చేతులు పైకెత్తి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. శివసేన, అలికాదళ్ లాంటి బిజెపి మిత్రపక్షాల నేతలు హాజరైన వారెవరికి లభించని ప్రాధాన్య౦ చంద్రబాబుకు బిజెపి నేతలిచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై వచ్చిన తర్వాత చంద్రబాబు...వచ్చే ఎన్నికల్లో మనం బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నామని తమ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో అవినీతిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, కాంగ్రెస్‌ను ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహలు వంటి వాటిపై మోడీతో చర్చించినట్లు బాబు పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పారట. త్వరలో సరైన వేదికపై తెదేపాతో పొత్తుపై బిజెపి పార్టీ అధికారిక ప్రకటన కూడా చేయనుందట. దీంతో బాబు మళ్ళీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారంటూ మీడియా సంస్థలు కూడా వార్తలను జోరుగా ప్రచారం చేస్తున్నాయి.     కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పుట్టి పోరాడుతున్న టిడిపి, నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం సృష్టిస్తున్న భారతీయ జనతాపార్టీ కలిసి ప్రయాణించడమే సరైన వైఖరని రాజకీయవిశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

కృష్ణాజిల్లాపై పట్టు కోసం వైకాపా కృషి

      రాష్ట్ర రాజకీయాలలో కృష్ణా జిల్లాకున్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అత్యంత రాజకీయ చైతన్యం గల జిల్లాలో కృష్ణాజిల్లా ప్రధమ స్థానంలో నిలుస్తుంది. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలకు ఆ జిల్లాపై పూర్తి పట్టు సాధించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటవంటి ఆ జిల్లాలో పాగా వేసేందుకు వైకాపా చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.   ఇటీవల జగన్మోహన్ రెడ్డి నిమ్మకూరులో నందమూరివారి బంధువును పనిగట్టుకొని వెళ్లి పలకరించడం అందుకే. అయితే వైకాపాను అక్కడి ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది వచ్చే ఎన్నికలలోనే తేలుతుంది. కానీ, వైకాపా మాత్రం ఇప్పటి నుండే బలమయిన అభ్యర్ధులను కూడా సిద్దం చేసుకొంటున్నట్లు తాజా సమాచారం.   మునిగిపోతున్న కాంగ్రెస్ నావ నుండి వైకాపాలోకి దూకడానికి సిద్దంగా ఉన్నవారిలో మంత్రి పార్ధసారధికి బందర్ పార్లమెంట్ సీటు, మండలి బుద్ద ప్రసాద్ కు అవనిగడ్డ అసెంబ్లీ సీటు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా దేవినేని నెహ్రు కొడుకు  దేవినేని అవినాష్ కు పెనమాలూరు అసెంబ్లీ సీటు ఖరారు చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాలు,పుకార్లు మొదటి నుంచి పార్టీను నమ్ముకొని టికెట్ వస్తుందన్న నమ్మకంతో వున్నవారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

దిగ్విజయ్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

      ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌పైన టిడిపి సీమాంధ్ర శాసనసభ్యులు శనివారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. నోటీసును స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఎలా చర్చించాలి ? ఏం చేయాలి అన్నది ? ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ విషయంలో దిగ్విజయ్ సింగ్ ఎలా జోక్యం చేసుకుంటాడు అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర అసేంబ్లీలో ఓటింగ్ ఉండదు అని దిగ్విజయ్ సింగ్ ఎలా చెబుతాడని టీడీపీ నేతలు తప్పుపట్టారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. దిగ్విజయ్ సింగ్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు. తమ ప్రజల రక్తం, మాంసం దిగ్విజయ్ సింగ్‌కు రుచిగా ఉన్నట్లుందని ఆయన అన్నారు.

ఫోర్బ్స్ జాబితాలో పవన్ నెం.1

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఈ సంవత్సరం బాగా కలిసివచ్చినట్టుగా ఉంది. 'అత్తారింటి దారేది' సినిమాతో తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్...తాజాగా ఫోర్బ్స్ ఇండియా పత్రిక వెల్లడించిన 2013 టాప్ 100 సెలబ్రిటీల లిస్టులో తెలుగు నుంచి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానం ఎగరేసుకుపోయాడు. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన భారతీయ సంపాదన పరుల, సెలబ్రిటి జాబితాలో 13వ స్థానంలో నిలిచాడు. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ ఆదాయం రూ. 57 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. భారత సెలబ్రిటీల జాబితాలో పవన్ కళ్యాణ్ 26 స్థానంలో..పాపులారిటీలో 79 స్థానంలో నిలిచాడు. పవన్ తర్వాత మహేశ్ 54వ స్థానంలో నిలిచాడు. మహేశ్ సంపాదన 28.96 కోట్లు అని ఫోర్బ్స్ పేర్కొంది.

సౌరవ్ గంగూలీ కి బిజెపి గాలం..!

    భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలో క్రీడల మంత్రి కాబోతున్నడా? అంటే అవుననే మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ బిజెపి లో చేరవలసిందిగా గంగూలికి ఆహ్వానం పంపించారట. ఎంపీగా గెలిస్తే క్రీడామంత్రిత్వ శాఖ ఇస్తానని ఆయనకు ఆఫర్ కూడా ఇచ్చారట. తమ పార్టీ ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం తెలియచేస్తాను అని గంగూలీ స్పందించినట్టు బీజేపీ నేతలు వెల్లడించారు. 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో తృణాముల్ కు తగినంత పోటీ ఇవ్వడానికి గంగూలీని రంగంలోకి దించాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ పరిశీలకుడిగా ఉన్న వరుణ్ గాంధీని ఓ మిత్రుడి ద్వారా గంగూలీ కలిశారట. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలు బయటకు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పాగా వేసేందుకు మోడి నిరంతర కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితమయిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలని మోడీ భావిస్తున్నారు.

కెసిఆర్ నెత్తిమీద 'రాయల..' కత్తి

      రాష్ట్ర విభజన బిల్లు పై శాసన సభలో ఎలాంటి ప్రతిష్ట౦భన తలెత్తకుండా రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్ తన మిషన్ పూర్తి చేసి వెళ్ళి పోతూ...తెరాస అధినేత కెసిఆర్ కి ఓ విషయాన్ని గుర్తుచేసి పోయారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చాలాసార్లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం పై మేడమ్ సోనియా గాంధీని ఒప్పించానని..ఇక కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునెలా చేయాలని టీఆర్ఎస్ నేతలకు సూచించినట్టు సమాచారం.   దీనిపై ఇప్పటికీ కూడా కేసీఆర్‌ స్పష్టమైన వైఖరిని కనబర్చడం లేదు. దీంతో రాయల తెలంగాణ అనే అంశాన్ని తిరిగి తెరమీదకు తెస్తున్నారు డిగ్గీ. దీనికి అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. బిల్లులోని అంశాల వారీగా విడివిడిగా సభ్యులు చర్చ జరిపి నివేదికలను పంపితే.. ఆ తర్వాత వాటన్నింటినీ సాకల్యంగా పరిశీలించిన తర్వాత మాత్రమే.. కేంద్రం తెలంగాణ విషయంలో తుది నిర్ణయానికి వస్తుందని దిగ్విజయ్ ప్రకటించారు. కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలనే అభిప్రాయంతోనె ఇంకా రాయల తెలంగాణకు అవకాశం ఉన్నదంటూ డిగ్గీ మాట్లాడారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలొగ్గడని తెలుసుకున్నఅధిష్టానం...కేసీఆర్‌ మెడపై కత్తి పేట్టేందుకు సిద్ధమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఏం జరుగుతుందనే దానిపై మనం కూడా వేచిచూడాల్సిందే.

తెలంగాణా బిల్లుపై చర్చజరుగుతుందా

  పార్లమెంటు, శాసనసభలలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నతీరు చూస్తే ప్రజలకు వారిపట్ల ఏహ్యభావం పెరుగుతోంది. అయినప్పటికీ వారు నిర్లజ్జగా తమ ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. తమ తమ పార్టీల వ్యూహాలకు అనుగుణంగా వారు చట్టసభలలో ఏదోఒక అంశం లేవనెత్తి దానిపై వెంటనే చర్చజరగాలని బిగ్గరగా అరుపులు కేకలు వేస్తూ అసలు ఏ చర్చజరగకుండా సభను స్థంభింపజేస్తూ విలువయిన ప్రజాధనాన్ని అంతకంటే విలువయిన కాలాన్నికావాలనే వృదా చేస్తున్నారు. ఈ ప్రక్రియనే చట్టసభల సమావేశాలుగా భావించవలసిన దుస్థితి ఏర్పడింది.   ఇక, రాష్ట్ర విభజన బిల్లుని శాసనసభలో వెంటనే ప్రవేశపెట్టాలని కొందరు, వద్దని మరి కొందరు, సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని మరికొందరూ అరుపులు కేకలు పెట్టుకొన్న తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది. అయితే సోమవారంనాడు సభ మళ్ళీ సమావేశమయినపుడు కూడా పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఉంటుందని భావించలేము. దానివల్ల కీలకమయిన రాష్ట్ర విభజన బిల్లుపై సభలో ఎటువంటి చర్చజరగకుండానే రాష్ట్రపతి ఇచ్చిన పుణ్యకాలం కూడ పూర్తయిపోయినా ఆశ్చర్యం లేదు.   రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీలు ఈ రాష్ట్ర విభజన అంశం ద్వారా లబ్దిపొందాలనో లేకపోతే నష్టపోకూడదనో లేకపోతే చర్చ జరగకుంటేనే తమకు మేలని భావించడం వలననో మొత్తం మీద సభలో రాద్దాంతం చేస్తూ రోజులు దొర్లించే ప్రయత్నం చేస్తున్నట్లున్నాయి. అందువల్ల రాష్ట్ర విభజన బిల్లుపై సభలో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి.   కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇటువంటి ఒక కీలకమయిన అంశం పట్ల కూడా ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంభించడం చాలా విచారకరం. వారు ఎంతసేపు సభలో తమ పార్టీ వ్యూహాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు తప్ప తమను ఎన్నుకొన్న ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా మాట్లాడాలని, వ్యవహరించాలని భావించకపోవడం (అటువంటి భాధ్యాతారహితులయిన నేతలను ఎన్నుకొన్న) ప్రజల దురదృష్టం.   సభల్లో కీచులాడుకొనే ఇటువంటి నేతల భద్రత కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి వేలాదిమంది పోలీసులను వినియోగించవలసి వస్తోంది. నగరంలో మహిళలకు, ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసు వ్యవస్థ విఫలమవచ్చునేమో గానీ, ప్రజలనుండి ప్రజాప్రతినిధులకి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూసుకోవడంలో మాత్రం ఆది ఎన్నడూ విఫలమవ్వదని చెప్పేందుకు నేడు శాసనసభ చుట్టూ మోహరించిన వేలాది పోలీసు బలగాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఇదంతా చూస్తుంటే ఇటువంటి నేతలను, రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నందుకు ప్రజలు ఈమాత్రం శిక్ష, మూల్యం చెల్లించుకోక తప్పదన్నట్లుంది.

ముఖ్యమంత్రిని దిగ్విజయ్ దారి తెచ్చుకొన్నట్లా కాదా

  రాష్ట్ర విభజన బిల్లుకు సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులందరి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో హైదరాబాద్ కి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమయ్యారో తెలియదు. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం తన దారికి తెచ్చుకోలేకపోయారనే సంగతి మాత్రం స్పష్టం అయింది. ఒకవేళ దారికి తెచ్చుకొని ఉంటే నిన్నసాయంత్రం ఆయన నిర్వహించిన పత్రికా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు. ఆయన ఆ సాహసం చేయలేకపోయినా “ఇంతవరకు ముఖ్యమంత్రి తన వాదనలు వినిపించేందుకు పార్టీ ఆయనకు చాలా అవకాశం ఇచ్చిందని, కానీ ఇక ఆయన కూడా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించక తప్పదని” మీడియా ముందు చెప్పుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.   నిన్న మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ తదితరులు బొత్ససత్యనారాయణ ఇంటిలో జరిగిన భోజన సమావేశంలో జరిగిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదని దిగ్విజయ్ మాటలే స్పష్టం చేస్తున్నాయి. అదే విషయం మీడియా ప్రశ్నించినప్పుడు మామధ్య జరిగిన అంతరంగిక చర్చల సారాంశాన్ని మీకు చెప్పలేను అంటూ సమాధానం దాటవేశారు.   ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి షరా మామూలుగా తెలంగాణా బిల్లులో ప్రతీ ఆర్టికల్ పై సభలో వోటింగ్ జరగాలని మీడియాతో చెప్పడం ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం అవుతోంది. అయితే, ఈదశలో కూడా వారిద్దరూ ఒకరికొకరికి పొంతన లేని విధంగా మాట్లాడటం, భిన్న వైఖరులు ప్రదర్శించడం, అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకొనే ఆలోచన కూడా చేయకపోవడం గమనిస్తే ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం రచించి రక్తి కట్టిస్తున్నపెద్ద డ్రామాగా కనిపిస్తోంది. ఈవిధంగా అతితెలివి ప్రదర్శించి ప్రజలను మభ్యపెట్టగలమని కాంగ్రెస్ భావిస్తే అది ఆపార్టీకే చేటు కలిగించడం ఖాయం.

బీజేపీ వైపు చంద్రబాబు అడుగులు

  ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ఆహ్వానం మేరకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. మొన్నరాజస్తాన్ ముఖ్యమంత్రిగా వసుందర రాజే సింధియా ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అయన వెళ్ళవలసి ఉన్నపటికీ రాష్ట్ర విభజన బిల్లు హైదరాబాద్ చేరుకోవడంతో మొదలయిన రాజకీయ హడావుడి కారణంగా ఆయన వెళ్లలేకపోయారు.   బీజేపీ అగ్రనేత అద్వానీకి శిష్యుడిగా పేరొందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అద్వానీతో సహా బీజేపీ అగ్రనేతలందరూ వస్తున్నారు. ఇప్పటికే, బీజేపే-తెదేపాల మధ్య కొంత సఖ్యత ఏర్పడి రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తులకు అనుకూల వాతావరణం ఏర్పడింది గనుక, నేటి చంద్రబాబు పర్యటన ఆ దిశలో పడుతున్న మరొక అడుగుగా భావించవచ్చును.   ఈసందర్భంగా ఆయన బీజేపీ అగ్ర నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల పొత్తులకు ఇంకా చాలా సమయం ఉంది గనుక, ప్రస్తుతం వారు ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాల గురించి, పార్లమెంటులో తెలంగాణా బిల్లుపై అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించవచ్చును. బీజేపీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నపటికీ, దానివల్ల ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు గనుక, బిల్లుని వ్యతిరేఖించకుండా, అలాగని ఆమోదం పొందకుండా ఉండేలా బీజేపీ వ్యవహరించవచ్చును.   బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్ రెడ్డి తెదేపాతో ఎన్నికల పొత్తులకు ఎంత వ్యతిరేఖత చూపుతున్నపటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం రాష్ట్రంలో తెదేపా యొక్క ప్రాధాన్యత గుర్తించి ఆ పార్టీతో స్నేహ సంభందాలు మళ్ళీ పునరుద్దరించుకొనేందుకు ప్రయత్నిస్తుండటం, అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించడం విశేషం.