తెదేపా, వైకాపాలను కలుపుకుపోతాం: శైలజానాథ్

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోరుకొంటున్న కొందరు సీమాంధ్ర శాసనసభ్యులు,మంత్రులతో తన క్యాంప్ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. అనంతరం మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న కేంద్రం ఆమోదించిన తెలంగాణా బిల్లుపై తాము చర్చించామని, బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఏవిదంగా దానిని ఎదుర్కోవాలో చర్చించామని తెలిపారు. ఈసారి తెదేపా, వైకాపా సీపీయం,బీజేపీ తదితర పార్టీల మద్దతు కూడా తీసుకొని బిల్లుని సభలో అడ్డుకొనే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్దంగా సాగుతోందని, దానిని తామంతా తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నామని అన్నారు. బిల్లుకి వ్యతిరేఖంగా సభ అభిప్రాయలు వ్యక్తం చేసినట్లయితే, దానిని రాష్ట్రపతి కూడా విస్మరించలేరని ఆవిధంగా తాము బిల్లుని ఆపే ప్రయత్నం చేయాలనీ భావిస్తున్నట్లు తెలిపారు.

   

ఇంతవరకు జరిగిన విభజన ప్రక్రియలో తెదేపా, వైకాపాలను కాంగ్రెస్ ఎన్నడూ పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం తన స్వంత పార్టీ నేతల అభిప్రాయాలకి కూడా అది విలువ ఈయలేదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తనను రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని దృడంగా నమ్ముతున్న తెదేపా, మళ్ళీ అదే కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి వారి ఉచ్చులో పడుతుందని ఆశించడం అత్యాశే. పైగా తెదేపా రాష్ట్ర విభజనకు ఇప్పటికీ కట్టుబడే ఉందని, అయితే అది న్యాయ బద్దంగా జరగాలని కోరుకొంటున్నామని స్వయంగా చంద్రబాబే చెప్పినందున, తన పార్టీ సభ్యులపై ఒత్తిడి చేయకపోవచ్చును.

 

ఇక సమైక్యాంధ్ర సెంటిమెంటుతో సీమాంధ్రపై పట్టు కోసం తిప్పలుపడుతున్నవైకాపా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఈవిషయంలో మద్దతు ఇచ్చి సీమాంధ్రలో తన రేటింగ్ పెంచుకొనే ప్రయత్నం చేయవచ్చును. పైగా తాను తెలంగాణా బిల్లుని సభలో వ్యతిరేఖించితే, తెదేపా మాత్రం దానికి మద్దతు పలికిందని సీమాంధ్రలో ప్రచారం చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది గనుక బిల్లు వ్యతిరేఖించే విషయంలో సమైక్యవాదం చేస్తున్నకాంగ్రెస్ నేతలకు వైకాపా సహకరించవచ్చును. సీపీయం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంట్, అసెంబ్లీలో అడ్డుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసారు.

 

సరిగ్గా ఇదే రోజు ఉదయం కేంద్రమంత్రులు చిరంజీవి, పురందేశ్వరి బీజేపీ నేత వెంకయ్య నాయుడిని కలిసి పార్లమెంటులో తెలంగాణా బిల్లు అడ్డుకోవలసిందిగా అభ్యర్దించారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మంత్రి తమ ప్రత్యర్ధులను అదేవిధంగా కోరడం విశేషం.  కాంగ్రెస్ అధిష్టానం  ఏ బిల్లుతో బీజేపీని రాష్ట్రంలో దెబ్బ తీయాలని చూస్తోందో అదే బిల్లు ఆమోదం కోసం మళ్ళీ బీజేపీ మద్దతు కోరడం మరో విచిత్రం. కాంగ్రెస్ అధిష్టానం బిల్లుకి మద్దతు ఈయమని తన రాజకీయ ప్రత్యర్ధులను కోరుతుంటే, అదే పార్టీకి చెందిన  నేతలు బిల్లుని ఓడించేందుకు మద్దతు కోరుతుండటం మరో విచిత్రం.