రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాలలో అభ్యంతరాలు

 

రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు, నేతలు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చడం సహజమే కానీ తెలంగాణా ప్రజలు కోరుకొంటున్నట్లుగా పది జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నపటికీ వారు కూడా సంతృప్తిగా లేకపోవడం ఆశ్చర్యమే, కానీ ఇది ఊహించిన పరిణామమే. కేసీఆర్ తెలంగాణా బిల్లులో అనేక లొసుగులను ఎత్తి చూపి, ఇది తమకి ఆమోదయోగ్యంగా లేదని నిరసన వ్యక్తం చేస్తుంటే, తమ అభిప్రాయాలకు, మనోభావాలను ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేయడాన్ని సీమాంధ్ర ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసిస్తున్నారు.

 

ఇరుప్రాంతల నేతలు ఈ ప్రక్రియలో రాజ్యంగ విరుద్దంగా ఉన్నఅంశాలను ఎత్తి చూపడం మరో విశేషం. ఉమ్మడి రాజధాని అనే మాట మన రాజ్యాంగంలోనే లేదని, అయినా మానవతా దుక్ప్రధంతో ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించామని కేసీఆర్ అంటుంటే, అసలు ఈ ప్రక్రియ మొత్తం రాజ్యంగవిరుద్దంగానే సాగుతోందని సీమాంధ్ర నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

 

అదేవిధంగా ఉన్నత విద్య, విద్యుత్, జలవనరులు, హైదరబాద్ పై గవర్నర్ పెత్తనం వంటి వాటిపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు ఏవిధంగా పంచుకోవాలో మాట్లాడిన ఆయన, ఆస్తుల పంపకాల మాట మాత్రం ఎత్తకపోవడం విశేషం.

 

ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన చేసినట్లయితే తలెత్తే సమస్యల గురించి ఏమేమి చెపుతున్నారో, ఇప్పుడు కేసీఆర్ కూడా ఇంచుమించు అదే విధంగా మాట్లాడటం విశేషం. రెండు ప్రాంతాలలో విస్తరించి ఉన్న జల, విద్యుత్ ప్రాజెక్టులను ఏవిధంగా విభజిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం మంత్రుల బృందం ఏవో తాత్కాలిక ఉపాయాలు చెప్పి చేతులు దులుపుకొందే తప్ప, శాశ్విత పరిష్కారాలు ఒక్కటీ చూపలేదు. అందువల్ల ఇక రాష్ట్రం విడిపోయిన నాటి నుండి రెండు ప్రాంతాల ప్రజలు, రైతులు, ఉద్యోగులు, వ్యవస్థల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం అనివార్యమని స్పష్టం అవుతోంది.

 

అందుకే కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తుంటే, చంద్రబాబు ముందుగా ఈ సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపిన తరువాతనే రాష్ట్ర విభజన చేయమని గట్టిగా కోరుతున్నారు. కానీ రాష్ట్ర విభజనతో రాజకీయ ప్రయోజనం పొందాలనే దురాశతో కేంద్రం తనకు తోచినట్లు విభజన చేసి చేతులు దులుపుకొంటోంది.

 

కారణం, రానున్నఎన్నికల తరువాత తమ యుపీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడం వలననే. అందువలననే సంక్లిష్టమయిన ఈ సమస్యలన్నిటికీ తన తరువాత వచ్చే ప్రభుత్వానికి వదిలిపెట్టి కాంగ్రెస్ అధిష్టానం చేతులు దులుపుకొంటోంది. లేకుంటే తగినంత సమయం తీసుకొని సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, దానికి శాశ్విత పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం తప్పక చేసి ఉండేది.

 

సీమాంధ్ర ప్రజలు రాష్ట్ర విభజనను ఎంతగా వ్యతిరేఖిస్తున్నపటికీ, విభజన అనివార్యమని నమ్మి అందుకు మానసికంగా సిద్దపడిన కేంద్రమంత్రులు, యంపీలు కేంద్రం ఆమోదించిన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్దిష్టంగా ఎటువంటి ప్యాకేజీ గురించి పేర్కొనకపోవడంతో వారు కూడా తీవ్ర అసంతృప్తి గురయ్యారు. ఈవిధంగా రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఇంతకీ ఎవరిని సంతోషపెట్టాలనుకొంటోంది? తెలంగాణా ప్రజలనా? లేక తెరాస నేతలనా? లేక స్వంత పార్టీ నేతలనా?లేక మరెవరినయినానా? ఎవరికీ అమోదయోగ్యం కాని విధంగా విభజించి తను ఏవిధంగా రాజకీయ ప్రయోజనం పొందగలనని భావిస్తోంది?