పాపం జగన్!

      అయితే ఆంధ్రప్రదేశ్ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న జగన్ లక్ష్యం అంతకంతకూ దూరమైపోతూ వుండటంతో ఆయన నిరాశలో కూరుకుపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జైలులో వున్న పదహారు నెలల కాలంలో జగన్‌ని అన్యాయంగా జైల్లోకి పంపారంటూ ప్రచారం చేయడంలో వైఎస్సార్సీపీ కొంత విజయం సాధించింది.   జగన్ జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి ఊహించిన స్పందన లేకపోవడం వైసీపీ వర్గాలను, జగన్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంతకంతకూ అడుగంటిపోతున్న తన రాజకీయ ఛరిష్మాని పైకి తీసుకురావడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు సరైన స్పందన లభించడం లేదని తెలుస్తోంది.  సమైక్య రాష్ట్రం కోసమో, తన రాజకీయ ప్రయోజనాల కోసమో జగన్ పలువురు జాతీయ నాయకులను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీటి ద్వారా జగన్‌కి పొలిటికల్ మైలేజీ పెరగడం లేదని విశ్లేషకులు అంటున్నారు. జగన్ కలసిన నాయకులందరూ ఏదో జగన్ వచ్చాడు కాబట్టి కలుస్తున్నారే తప్ప ఆయన మీద ప్రత్యేక అభిమానమేమీ కనబర్చడం లేదని విశ్లేషిస్తున్నారు. ఒక దశలో జగన్ తమని కలవకపోవడమే ఉత్తమమని కొందరు జాతీయ నాయకులు భావించినట్టు తెలుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వుందని అంటున్నారు. అఖిలేష్ యాదవ్ ఇప్పటికి రెండుసార్లు జగన్ అపాయింట్‌మెంట్‌ని రద్దు చేశాడు. ఒకసారి జగన్ ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేశాడు. మళ్ళీ అపాయింట్‌మెంట్ తీసుకున్న జగన్ లక్నో వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ దగ్గరకి వెళ్ళగానే అపాయింట్‌మెంట్ రద్దు చేస్తున్నట్టు సందేశం పంపించాడు.  ఇది జగన్‌ని కలవడం ఇష్టం లేక అఖిలేష్ అనుసరిస్తున్న వ్యూహమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ వ్యూహాన్ని జగన్ అర్థం చేసుకోలేకపోతున్నాడో లేక అర్థం చేసుకుని మరీ అవమానాలకు గురవుతున్నాడో అర్థంకావడం లేదని అంటున్నారు. మొత్తమ్మీద జగన్ రాజకీయంగా దయనీయమైన పరిస్థితిలో వున్నాడని విశ్లేషకులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.    

తెలంగాణ బిల్లు వస్తుందో లేదో: ఆజాద్

      పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టేందుకు కృషిచేస్తున్నామని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. జీఓఎం రాష్ట్ర విభజన ప్రక్రియ పైన వేగవంతంగా పనిచేస్తుందని తెలిపారు. కాని తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెట్టేది తనకు తెలియదని వ్యాఖ్యానించడం విశేషం. ఆజాద్ చేసిన వ్యాఖ్యలు బట్టి శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం కష్టంగానె కనిపిస్తోంది. డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల ఎజెండాలో కూడా తెలంగాణ బిల్లు లేదు. అయితే లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కూడా ప్రకటించారు.

ప్రాజెక్టులు కట్టి ఏమి బావుకొన్నామని

  స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కృష్ణానది మిగులు జలలాపై తమకు హక్కులు ఎటువంటి అవసరంలేదంటూ లేఖ ఇచ్చి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారని తెలుగుదేశం చేస్తున్నఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్మోహన్ రెడ్డి, చనిపోయిన తన తండ్రిని నిందించడం తప్పని చెపుతూ, ఆయనని వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో చంద్రబాబు తన హయంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, అందువల్లే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంత ఘాతుకానికి ఒడి గట్టిందని ఒక వితండ వాదం చేస్తున్నారు. తన తండ్రి అధికారంలోకి రాగానే జలయజ్ఞం పేరిట మిగులు జలాల ఆధారంగా అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టారని అని కూడా గొప్పగా చెప్పుకొంటున్నారు.   ప్రాజెక్టులు కట్టకపోవడం వలననే ఈ సమస్య వచ్చిందని వితండవాదం చేస్తున్నజగన్మోహన్ రెడ్డి, మిగులు జలాలపై హక్కులు కోరబోమని రాజశేఖర్ రెడ్డి లేఖ ఇచ్చిన తరువాత, రాష్ట్రానికి నీళ్ళు వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో రూ.39,000 కోట్లు ఖర్చు చేసి కృష్ణ బేసిన్ లో ఎందుకు ప్రాజెక్టులు మొదలుపెట్టారో కూడా జగన్ వివరించి ఉంటే బాగుండేది.   జల యజ్ఞం ధన యజ్ఞంగా మారిందని పత్రికలూ, ప్రతిపక్షాలు ఎంత మొత్తుకొంటున్నా నిర్భీతిగా కోట్ల రూపాయల వ్యయంతో చెప్పటిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో ప్రజలకీ తెలుసు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అమలయినట్లయితే ఆ ప్రాజెక్టులు అన్నీ నిరూపయోగంగా మారడం ఖాయం.   చంద్రబాబు ప్రాజెక్టులు కట్టకపోవడం వలన రాష్ట్రానికి ఎటువంటి నష్టమూ జరుగలేదు. కానీ ప్రజల నుండి వసూలు చేసిన పన్నులతో రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ప్రాజెక్టుల వలన వారి కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరుగా వృధా అవడమే కాక, ఇప్పుడు ఆ ప్రాజెక్టులకి కనీసం నీళ్ళు కూడా రాని పరిస్థితి. వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అనాలోచితంగా కట్టిన ఈ ప్రాజెక్టుల వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు?   ఈ ప్రాజెక్టుల వలన ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయినా,కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అధికారులు మాత్రం బాగుపడ్డారు. ఈ భాగోతం గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి తిరిగి తెదేపాపై ఎదురు దాడి చేయడం, తాను, తన కుటుంబము, తన పార్టీయే ఈ భూప్రపంచంలో నీతి నిజాయితీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లు మాట్లాడటం హాస్యస్పదం.

రాయల తెలంగాణాతో రాష్ట్ర కాంగ్రెస్ ఫినిష్

  ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మరొక కొత్త సమస్య సృష్టించడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని నిరూపిస్తోంది. ఆ పార్టీ కొత్తగా తెరపైకి తీసుకువచ్చిన రాయల తెలంగాణా ప్రతిపాదనతో, గత నాలుగయిదు నెలలుగా ప్రశాంతంగా ఉన్నతెలంగాణాలో మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. తెరాస అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణా అంతటా ర్యాలీలు, ధర్నాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రేపు తెలంగాణా బంద్ జరుగబోతోంది. ఈ పరిణామాలకు కాంగ్రెస్ అధిష్టానాన్నేనిందించవలసి ఉంటుంది.   రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను, ఆందోళనలను ఎంత మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసిన కాంగ్రెస్ అధిష్టానం, మళ్ళీ ఇప్పుడు కొందరు రాయలసీమ కాంగ్రెస్ నేతల సలహాల మేరకు ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన చేసి తెలంగాణా ప్రజల మనోభావాలను కూడా కించపరిచింది.   ఈవిధంగా రాష్ట్రాన్ని విభజిస్తే తను రాజకీయంగా లాభపడవచ్చునని ఆలోచిస్తోందే తప్ప రాయలసీమ, తెలంగాణా ప్రజల మనోభావాలకు వీసమెత్తు విలువ ఈయడం లేదు. ఈ నిర్లక్ష్యం కారణంగానే తను సీమాంధ్రలో ఓటమి చవి చూడటం ఖాయమని అర్ధం చేసుకొన్నకాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తూ తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి చేజేతులా కల్పించుకొంటోంది.   ఇంతవరకు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నకారణంగా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీపట్ల ప్రజలకు, నేతలకు ఉన్నమంచి అభిప్రాయం కాస్తా ఈ రాయల దెబ్బతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందువల్ల, ఇప్పుడు 10జిల్లాలతో కూడిన తెలంగాణా ఇచ్చినా కూడా తెలంగాణా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే అవకాశం లేదు.   ఇంతకుముందు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమను కాంగ్రెస్ అధిష్టానం నిలువునా ముంచేసిందని ఆవేదన చెందేవారు. ఇప్పుడు టీ-కాంగ్రెస్ నేతలు కూడా వారికి వంత పాడబోతున్నారు. అయితే టీ-కాంగ్రెస్ నేతలకి తెలంగాణాలో తమ కాంగ్రెస్ నావ మునిగిపోతోందని తెలిసి ఉన్నపటికీ, దానిలోనే ఉండవలసిన దుస్థితి. లేకుంటే తెరాసయే దిక్కు. ఈవిషయంలో సీమంధ్రలో కాంగ్రెస్ నేతలకు తెదేపా, వైకాపా లేదా కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కాంగ్రెస్ పార్టీలు ఉండటం వారి అదృష్టమనే చెప్పాలి. కానీ, టీ-కాంగ్రెస్ నేతలు ఆ అవకాశం కూడా లేదు పాపం.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినా, ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన వలన పార్టీకి జరిగిన నష్టాన్ని వారు పూడ్చలేరు. కాంగ్రెస్ హస్తం దెబ్బకి ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోవడం సంగతి దేవుడెరుగు. ముందుగా కాంగ్రెస్ పార్టీయే తుడిచిపెట్టుకుపోయేలా ఉంది.

ఆశారాం బాపు తనయుడు అరెస్ట్

      అత్యాచారం కేసులో ఆశారాం బాపు తనయుడు నారాయణ్ సాయిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ్ సాయిని ఢిల్లీ హర్యానా సరిహద్దులో అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.గత 58 రోజులుగా అతను పరారీలో ఉన్నాడు. సూరత్‌లో లైంగిక దాడి కేసులో నారాయణ సాయి నిందితుడు. నారాయణ సాయిని పట్టిచ్చినవారికి ఐదు లక్షల రివార్డు ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలో నారాయణ సాయి జైపూర్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆగ్రా వెళ్లాడు. మర్నాడు ఢిల్లీ వచ్చాడు. ఆ సమయంలో అతను సీతాపూర్‌లోని నైమిషారణంలో ఉన్నాడు. అతను తన వేషాన్ని మార్చుకుంటూ వివిధ ప్రాంతాల్లో దాక్కుంటూ పోలీసులకు దొరక్కకుండా తప్పించుకుని తిరిగాడు.  

బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో వైకాపా, తెదేపా బిజీ బిజీ

  కాదేది రాజకీయలకనర్హం అన్నట్లు, కృష్ణా మిగులు జలాల వినియోగంపై ఇటీవల వెలువడిన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కూడా రాజకీయ పార్టీలకు ఒక కొత్త అస్త్రంగా అందివచ్చింది. ప్రస్తుతం తెలంగాణావాదుల దృష్టి అంతా రాయల తెలంగాణా వ్యతిరేఖ పోరాటాల మీదనే ఉంది గనుక అక్కడి పార్టీలేవీ ఈ అంశాన్ని పట్టించుకొనే పరిస్థితుల్లో లేవు. కానీ, సీమాంధ్రపై పట్టుకోసం పోరాటాలు చేస్తున్న తెదేపా, వైకాపాలు మాత్రం ఈ అంశం ఆయుధంగా చేసుకొని ధర్నాలకు శ్రీకారం చుట్టాయి.   తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో ఈరోజు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వేలాది రైతులు పాల్గొంటున్నభారీ ధర్నాచేస్తుండగా, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెన్నై పర్యటన కారణంగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులిచింతల ప్రాజెక్టు వద్ద ధర్నా చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన లేఖ వలనే ఈ అనర్ధం జరిగిందని తెదేపా వాదిస్తుంటే, చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వలననే ఈ పరిస్థితి ఏర్పడిందని వైకాపా వాదిస్తూ బోడి గుండుకి మోకాలుకీ ముడి పెట్టే ప్రయత్నం చేస్తోంది.   ఏమయినప్పటికీ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెదేపా, వైకాపాలకు ఆయాచితంగా అస్త్రాలు అందించిందని చెప్పవచ్చును. అయితే అందరికంటే మొదట స్పందించవలసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. త్వరలో రాష్ట్ర శాసనసభకు రానున్న తెలంగాణా బిల్లుని ఏవిధంగా ఎదుర్కోవాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రికి, ఆయన అనుచరులకు తీరిక లేకపోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది.

ఢిల్లీలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

      త్రిముఖ పోటీ నడుమ ఉత్కంఠను రేపుతున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 810 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.20 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం అధికారులు 11,992 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 70 వేల మంది పోలీసులతో భారీ భద్రత ను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్, పలువురు ముఖ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాయల`టి`కి నిరసనగా బంద్‌

  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చిన కేంద్రం కొరివితో తలగొక్కుంది. ఇన్నాళ్లు సీమాంద్ర ప్రాంతంలోని నిరసనలతోనే రాష్ట్రం అట్టుడికి పోతుంటే ఇప్పుడు తాజా రాయల తెలంగాణ ప్రతిపాదనతో మరోసారి తెలంగాణ ప్రాంతం కూడా భగ్గుమంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను పలువురు తెలంగాణ వాదులు వ్యతిరేకించాగా తాజాగా కెసిఆర్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 5న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు కెసిఆర్‌. తెలంగాణ ప్రజలు కేవలం పది జిల్లాల తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నారని.. అది తప్ప వేరే ఏది అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కెసిఆర్‌ ప్రాణాలు పోయినా రాయల తెలంగాణ అంగీకరించబోమన్నారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టుగా ఆయన ప్రకటించారు. బుధవారం నిరసనలతో పాటు గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు కెసిఆర్‌. ఈ నెల 6 నుంచి జరిగే టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

టిడిపి ఎంపిల అరెస్ట్‌

  కృష్ణా జలాల పంపిణీ విషయంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యూనల్‌ రాష్ట్రానికి చేసిన అన్యాయం పై టిడిపి పోరాటాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి సహాపలువురు జాతీయనాయకులను కలిసి తెలుగు ప్రజలకు న్యాయ చేయవలసిందిగా కోరారు. ఈపోరాటంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఎంపిలు ఢిల్లీలోని ప్రదాని నివాసం ముందు ఆందోళనకు దిగారు. నామా నాగేశ్వరరావు, సిఎం రమేష్‌, సుధారాణి, దేవేందర్‌ గౌడ్‌, సుజనా చౌధరి, నిమ్మల కిష్టప్పతో మరి కొంత మంది రాష్ట్రనాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ఆంధొళనకు దిగిన తెలుగుదేశం నాయకులను ఢిల్లీపోలీసులు అరెస్ట్‌ చేశారు. ముందుగా కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రదానితో చర్చించటానికి టిడిపి ఎంపిలు అపాయింట్‌మెంట్‌ కోరగా అందుకు ప్రదాని కార్యాలయం వర్గాలు నిరాకరించాయి. దీంతో టిడిపి ఎంపిలు ప్రదాని కార్యలయం ముందు ఆందోళనకు దిగారు.

కృష్ణా జలాలపై కాంగ్రెస్ నోరు విప్పదా..!

      కృష్ణానది మిగులు జలాల విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతమాత్రం కదిలించడం లేదు. ఈ తీర్పు ద్వారా తెలుగు వారికి అన్యాయం జరిగిందని దేశమంతటా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, రాష్ట్రంలోని చాలా పార్టీలు, ప్రజలు ఈ తీర్పు పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నప్పటికి...కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనిపై నోరు విప్పే సాహసం చేయలేకపోతుంది.   రాష్ట్రంలోని పార్టీలలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ ఇది దారుణమని బాధపడుతున్నాయి. టీఆర్ఎస్ ఈ తీర్పు విషయంలో పెద్దగా స్పందించలేదు. ఇది పెద్దగా పట్టిచుకోవాల్సిన అంశం కాదని లైట్‌గా తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక వైఎస్సార్సీపీ అయితే నేరమంతా చంద్రబాబు మీద వేయడానికి ప్రయత్నం చేసింది. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిపడిందని చెబుతూ మోకాలికి, బోడిగుండుకి ముడి వేసే ప్రయత్నం చేయడం మరో ఆశ్చర్యకరమని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ వద్దు...రాయల తెలంగాణ ముద్దు!

    రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తుది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇన్నాళ్లు వివిధ ఆఫ్షన్లను పరిశీలించిన కేంద్ర ఇప్పుడ ఫైనల్‌గా రాయల తెలంగాణకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలోని పది జిల్లాలతో పాటు అనంతపురంచ కర్నూల్‌ జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌ను యూనియన్ కో-ఆర్డినేషన్ కౌన్సిల్‌గా చేయనున్నారని, భద్రాచలం, పోలవరం ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉండేటట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఇరు ప్రాంతాలకు సంబంధించి నీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక జలమండలిని ఏర్పాటు చేయనున్నారని, హైదరాబాద్‌ను హైకోర్టు ఆఫ్ హైదరాబాద్‌గా పేరు మార్పు చేస్తూ, తెలంగాణకు ప్రత్యేక బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.   video courtesy ABN

ఫారం హౌస్ బోను లోంచి బయటకొచ్చిన తెరాస పులి

  ‘ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనని’ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు గారు చెప్పినట్లే, ‘మౌనంగా ఉండటం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని’ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ చాలాసార్లు నిరూపించారు. అయితే తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోవని గ్రహించిన ఆయన బయట ఉంటే తన మౌనవ్రతం కొనసాగించడం కష్టమని అప్పుడపుడు ఎవరికీ కనబడకుండా తన ఫార్మ్ హౌస్ లోకి మాయమయిపోతుంటారు.   తెలంగాణా ప్రక్రియ దాదాపు పూర్తికావస్తున్న తరుణంలో కూడా ఆయన ఫార్మ్ హౌస్ నుండి బయటకు రాకపోవడంతో తెలంగాణా వాదులు చాలా ఆందోళన చెందుతున్నారు. పులికి ఎర వేస్తే బోనులోకి వస్తుంది. కానీ కేసీఆర్ ని ఫార్మ్ హౌస్ నుండి బయటకి రప్పించాలంటే అటువంటిదేదో వేయాల్సిందేనని కాంగ్రెస్ భావించిందో ఏమో ‘రాయల తెలంగాణా’ ఎర వేసింది. ఊహించినట్లే, అది ఆయనను ఫార్మ్ హౌస్ నుండి బయటకి రప్పించింది.   ఈ రోజు మధ్యాహ్నం ఆయన తెలంగాణా భవన్ లో తెరాస నేతలతో సమావేశమయ్యి కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నఈ రాయల తెలంగాణాను ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచనలు చేస్తారు. “కాంగ్రెస్ రాయల తెలంగాణా ప్రతిపాదిస్తే దాని ఖర్మ!” అని ఆయన అన్నట్లు తెలుస్తోంది.   అంటే, చేజేతులా మళ్ళీ పరిస్థితులు మొదటికి తెచ్చుకొని, తెలంగాణాలో కూడా తుడిచిపెట్టుకుపోతుందని వేరేగా చెప్పనవసరం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణా కలిపేందుకు రాయలసీమకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు తప్ప ప్రజలు, నేతలు ఎవరూ కూడా అందుకు అంగీకరించడం లేదు. ఒకవేళ బలవంతంగా ఏర్పాటు చేసినా కాంగ్రెస్ ఊహిస్తున్నట్లు రాయల తెలంగాణా అంతటా కాకుండా, కేవలం ఆ రెండు జిల్లాలోనే విజయం సాధిస్తుందేమో!

లక్నో పర్యటనకు జగన్

      జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణను సీబీఐ కోర్టు జనవరి 3కు వాయిదా వేసింది. మంగళవారం ఉదయం ఈ కేసుకు సంబంధించి ఏ-1 నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌రావు కోర్టుకు హాజరయ్యారు. అలాగే మొట్టమొదటి సారిగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో నిందితురాలుగా ఉన్న మంత్రి గీతారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. మాజీ మంత్రి ధర్మాన కారులో గీతారెడ్డి కోర్టు వచ్చారు. ఈకేసుకు సంబంధించి మొత్తం 10 చార్జిషీట్లపైన కోర్టు విచారణ జరిగింది. లక్నో కు జగన్:  సమైక్యరాష్ట్రానికి మద్దతు ఇస్తూ తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ వై.ఎస్.జగన్ లక్నో వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలుస్తున్నారు. ఈ మేరకు ఆయన లక్నో వెళ్లడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇప్పటికే ఓడిషా,పశ్చిమబెంగాల్, ముంబై లలో పర్యటించి, ఆయా నేతలను కలిసి వచ్చిన జగన్ ఇప్పుడు లక్నో వెళుతున్నారు.

చిరు ఆఖరి ప్రయత్నం

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ముసాయిదా చివరి దశకు చేరిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు తమ చిట్ట చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విభజన అనివార్యం అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి తాజాగా కేంద్ర మంత్రుల బృందంలోని సభ్యులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ లను కలిశారు. హైదరాబాద్ ను శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను యూటీ చేసి ఢిల్లీ తరహా శాసన సభ ఏర్పాటు చేయాలని చిరంజీవి కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని అయితే విభజన అనివార్యం అయిన పక్షంలో హైదరబాద్ యూటీ చేయాలని తాము యూటీని కోరుతున్నామని అన్నారు. ఇది చివరి ప్రయత్నం అని చిరంజీవి చెప్పడం విశేషం. మొదటి నుండి హైదరాబాద్ విషయంలో సీమాంధ్ర నేతలు పట్టుబడుతున్నారు. అయినప్పటికి కేంద్రం ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు.

కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవబోతున్నారా

  రెండు మూడు రోజుల క్రితం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. మనోహర్ బీజేపీ ప్రచార కమిటీలో ముఖ్య సభ్యుడు. అంతే గాక పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మరియు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి సన్నిహితుడు.   ఒక బీజేపీ ముఖ్య నేత కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రస్తుత పరిస్థితుల్లో రహస్యంగా వచ్చికలవడం చాలా ఆశ్చర్యంకలిగిస్తోంది. అలాగే పలు అనుమానాలకు కూడా తావిస్తోంది.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పాటుకి బీజేపీ మద్దతు తీసుకొంటూనే మళ్ళీ అదే పార్టీని తెలంగాణాలో దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని స్పష్టం అయ్యింది. ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చిన రాయల తెలంగాణా ప్రతిపాదన కూడా అందుకేనని అర్ధం అవుతోంది. మరి అటువంటప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే అది తన కాళ్ళను తనే నరుకోవడం అవుతుంది. గనుక, బీజేపీ కూడా బహుశః కాంగ్రెస్ పద్దతిలోనే ఆలోచించి, కాంగ్రెస్ అధిష్టానాన్నిఎదురిస్తూ సమైక్య ఛాంపియన్ గా అవతరించి, త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడతారనుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండవచ్చును.   ఇంత రాద్దాంతం చేసిన తరువాత ఇక కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగలిగే అవకాశాలు లేవు. అలాగని తనంతట తాను పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేయడమూ కష్టమే. గనుక, ఎటువంటి మరకలు లేకుండా సమైక్య చాంపియన్ గా అవతరించిన ఆయనకి సీమాంధ్రలో చాలా బలహీనంగా ఉన్న బీజేపీ శాఖ పగ్గాలు అప్పగిస్తే అటు బీజేపీ, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా పూర్తి ప్రయోజనం పొందగలుగుతారనిబీజేపీఆలోచనఅయ్యిఉండవచ్చును.   రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కూడా కనబడటం లేదు గనుక, కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకొని ఇబ్బందులు పడే బదులు, సీమంధ్రలో బీజేపీ పగ్గాలు అందుకొంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత రాష్ట్రాన్నిఅసలు విభజించాలా వద్దా? విభజిస్తే ఏవిధంగా విభజించాలి? వంటివి విషయాలలో ఆయన నిర్ణయాత్మక శక్తిగా మారుతారు.   ఒకవేళ ఆయన అద్వర్యంలో సీమాంధ్రలో బీజేపీ గనుక గెలిస్తే ఆయన మళ్ళీ రాష్ట్ర లేదా సీమాంధ్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ పార్టీ ఓడిపోయినా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అక్కడ కేంద్రమంత్రిగా సెటిల్ అయిపోవచ్చును.   మునిగిపోయే నావ వంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వ్రేలాడే బదులు, తమతో చేతులు కలిపితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ బీజేపీ తరపున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి హామీ ఇచ్చి ఉండవచ్చును. లేకుంటే వారిరువురూ రహస్యంగా ముచ్చటించుకోవలసిన సమయం, సందర్బము రెండూ కావు. వారి రహస్య సమావేశానికి ఇంతకంటే ప్రత్యేక కారణాలు కూడా వేరే ఏమి కనబడటం లేదు.   ఒకవేళ కిరణ్ బీజేపీ కమలం పట్టుకొనేందుకు సిద్దం అయితే రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయి.

పార్లమెంటులో టి.బిల్లు పెడతారా?

      తెలంగాణ బిల్లు పార్లమెంటుకు ఎప్పుడు వస్తుంది ? అసలు ఈ శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు ఉండబోతుందా? కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్న దానిని బట్టి ఈ సమావేశాలలో తెలంగాణ బిల్లు ఉండడం కష్టమేనని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాధ్‌ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లు గురించి ప్రస్తావించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లును పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ప్రతిపాదించాలని కోరారు. ఈ బిల్లు విషయంలో జాప్యం చేస్తే పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. పన్నెండు రోజుల పాటు సాగనున్న శీతాకాల సమావేశాల అజెండాలో తెలంగాణ బిల్లుకు ఎందుకు స్థానం కల్పించలేదని ఆమె ప్రశ్నించారు. అయితే తెలంగాణ బిల్లుకు సంబంధించి పలు ప్రక్రియలు మిగిలిపోయాయని, విభజన విధివిధానాలను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రుల బృందం నివేదిక సిద్ధమైన తర్వాత కేంద్ర మంత్రివర్గం దానిని పరిశీలించి ఆమోదించాల్సి ఉందని, ఆ తర్వాత రాష్ట్రపతికి నివేదించనున్న ముసాయిదా బిల్లును ఆయన రాష్ట్ర శాసనసభకు పంపాల్సి ఉంటుందని షిండే తెలిపారు. మరి ఈ లెక్కన తెలంగాణ బిల్లు తెరమరుగయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.