కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో సోనియాగాంధీ లేదు
posted on Dec 7, 2013 @ 1:31PM
ప్రతిష్టాత్మకమైన పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జలయజ్ఞంలో చేపట్టిన తొలి ప్రాజెక్టు పులిచింతల. రూ.1,831 కోట్లు తో పులిచింత ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారు. పులిచింత ప్రాజెక్టు సామర్థ్యం 46 టీఎంసీలు.
ప్రాజెక్టు ప్రారంభోత్సవ౦ కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరం చుట్టుప్రక్కల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బొమ్మ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రచార ప్రకటనలలో కూడా ఎక్కడా వీరి ఫోటోలు కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా, సోనియాగాంధీ, రాహుల్ గాందీ, మన్మోహన్ సింగ్ ల ఫోటోలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో వారి ఫోటోలు లేకపోవడం కన్నా వేరే సంకేతం ఏమి ఉంటుంది?