రాష్ట్రపతి భవన్‌కు చేరిన తెలంగాణ బిల్లు

 

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతున్నా కేంద్రం మాత్రం విభజన విషయంలో చకచక అడుగులు వేస్తుంది. కేంద్ర మంత్రి వర్గం ఆమెదించిన 24 గంటలలోనే టి బిల్లును రాష్ట్రపతి భవన్‌కు పంపింది కేంద్రం. కేంద్ర హొం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆంద్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థికరణ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పరిశీలనకు శుక్రవారం సాయంత్రం పంపారు.

అయితే ప్రస్థుతం ప్రణబ్‌ కొల్‌కత్తా పర్యటనలో ఉన్న కారణంగా ఆయన తిరిగి వచ్చాకే తదుపరి కార్యాచరణ జరగనుంది. బిల్లు ప్రతి, కేబినెట్ నోట్, జీవోఎం నివేదికతోపాటు హోం శాఖ నోట్, న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా రాష్ట్రపతికి పంపినట్లు తెలిసింది. అయితే సోమవారం కొల్‌కత్తా తిరగిరానున్న రాష్ట్రపతి రెండు మూడు రోజుల పాటు టిబిల్లును పరిశీలిస్తారు.

బిల్లుపై ఆయన కూడా న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.ముఖ్యంగా ఆర్టికల్  371(డి)లో ఏ మార్పు చేసినా రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని అటార్నీ జనరల్ వాహనావతి, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ విశ్వనాథన్ పేర్కొన్నప్పటికీ ఆ అవసరంలేదని, సాధారణ మెజారిటీతో బిల్లును ఆమోదించవచ్చునని జీవోఎం అభిప్రాయపడింది.

ముసాయిదా బిల్లు పరిశీలనకు రాష్ట్రపతి ఎంత సమయం తీసుకుంటారు? అభిప్రాయం తెలిపేందుకు అసెంబ్లీకి ఎంత గడువు ఇస్తారు? అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. అసెంబ్లీకి ఎంత గడువు ఇవ్వాలనే అంశాన్ని ఆర్టికల్ 3లో పొందుపరచలేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రపతి అసెంబ్లీకి ఇచ్చి గడువు మీదే అందరి దృష్టి ఉంది.