ఆమాద్మీకి కాంగ్రెస్ బేషరతు మద్దతు

  మొట్ట మొదటి ప్రయత్నంలోనే 28 సీట్లు గెలుచుకొని డిల్లీలో కాంగ్రెస్ పార్టీని తుడిచేపెట్టేసిన ఆమాద్మీపార్టీకి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది. కేవలం మాటలతో సరిబెట్టకుండా, ఆమాద్మీకి బేషరతుగా మద్దతు ఇస్తునట్లు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి ఒక లేఖ కూడా వ్రాసింది. అయితే ఇంతవరకు అమాద్మీ పార్టీ నుండి ఎవరు స్పందించకపోవడం విశేషం.   ఇటీవల జరిగిన డిల్లీ శాసనసభ ఎన్నికలలో 32 సీట్లు గెలుచుకొని బీజేపీ ప్రధమ స్థానంలో నిలవగా, ఆమాద్మీ పార్టీ 28సీట్లు గెలుచుకొని రెండవ స్థానంలో, పదిహేనేళ్ళపాటు డిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 సీట్లతో మూడవ స్థానానికి పరిమితమయింది. ఇతరులకు 2సీట్లు వచ్చాయి. 70సీట్లున్న శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 36సీట్లు ఉండాలి. కానీ, ఆమాద్మీ, బీజేపీ పార్టీలు ఇతరులకు మద్దతు ఈయబోము, తీసుకోము అని బిగుసుకు కూర్చోకొన్నాయి.   అమాద్మీ కాక వేరే ఏదయినా ఇతర పార్టీ అయిఉంటే, బీజేపీ ఈ పాటికి వారికి గాలం వేసి ప్రభుత్వం ఏర్పాటు చేసేసేదే. కానీ ఆమాద్మీకి ప్రజలలో ఉన్న విపరీతమయిన ఆదరణను చూసిన తరువాత ఆ పార్టీపై ఎటువంటి ఎత్తులు ప్రయోగించకుండా వేచి చూచే ధోరణి అవలంభిస్తోంది. తద్వారా రోజురోజుకి ఆమాద్మీపై ఒత్తిడి పెరిగిపోయి, చివరికి దిగివస్తుందని బీజేపీ అంచనా వేసింది. కానీ అది ఊహించని విధంగా కాంగ్రెస్ రంగంలోకి దూకి ఆమాద్మీకి బేషరతుగా బయట నుండి మద్దతు ఇస్తామని గవర్నర్ కు లేఖ కూడా పంపింది.   ఇటువంటి సంకీర్ణాలు తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని, అదే చేసినట్లయితే, తమకు ఇతర రాజకీయ పార్టీలకు మధ్య ఎటువంటి తేడా ఉండదని ఇంతవరకు గట్టిగా వాదిస్తున్నఆమాద్మీ, ఇప్పుడు కాంగ్రెస్ తనంతట తానే మద్దతు ప్రకటిస్తున్నపుడు కూడా వద్దంటే, ఇక డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం అవుతుంది. మరో నాలుగైదు నెలలలో సాధారణ ఎన్నికలు వస్తున్న కారణంగా వాటితో కలిపి అప్పుడే మరోసారి ఎన్నికలు జరిపించాలని గవర్నర్ భావిస్తే, డిల్లీలో రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతిని కోరవచ్చును.   ఒకవేళ ఆమాద్మీతన మాటకే కట్టుబడి ప్రభుత్వ ఏర్పాటుకి నిరాకరిస్తే, విలువలకు కట్టుబడి ఉన్నపార్టీగా మంచి పేరు పొందవచ్చును. కానీ, ఆమాద్మీకి ఓటేస్తే ఇదేవిధంగా ఎందుకు పనికిరాకుండా పోతాయని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేస్తే అమాద్మీకి ఇప్పుడు వచ్చినన్ని సిట్లు కూడా రాకపోవచ్చును. అందువల్ల కాంగ్రెస్ బేషరతుగా ఇస్తున్న మద్దతు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేసి, తన పాలనతో డిల్లీ ప్రజలను ఆకట్టుకొనగలిగితే రానున్నఎన్నికల సమయానికి మరింత బలపడవచ్చును. అలాకాకుండా నీతి సూత్రాలు వల్లె వేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా భీష్మించుకొని కూర్చొంటే నష్టపోయేది అమాద్మీపార్టీయే తప్ప కాంగ్రెస్, బీజేపీలు మాత్రం కాదని గ్రహించాలి.

ఇలాంటి విభజన చూడలేదు: చంద్రబాబు

      కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దేశంలో ఎప్పుడూ ఇలాంటి విభజన చూడలేదని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టాలో దిగ్విజయ్ సింగ్ ఎలా చెబుతారని, బిఎసిని ప్రభావితం చేసే విధంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడారని ఆయన అన్నారు. బిల్లును చూడకుండా అబద్ధాలు చెప్పే పరిస్థితికి దిగ్విజయ్ సింగ్ వచ్చారని ఆయన దుమ్మెత్తిపోశారు.   ప్రత్యేక విమానంలో విభజన ముసాయిదా బిల్లును తేవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో కూర్చుని మాట్లాడుకుంటే ఏకాభిప్రాయం అవుతుందా అని అడిగారు. నాలుగైదు సీట్ల కోసం తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.     రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారని గుర్తు చేస్తూ ఉమ్మడి రాజధాని అనేది రాజ్యాంగంలో ఉందా అని అడిగారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమతో కలుస్తాడని, వైయస్ జగన్ తమవాడే అని దిగ్విజయ్ సింగ్ మరోసారి చెప్పారని, దాన్ని బట్టి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తాము చెబుతున్న విషయంలో వాస్తవం ఉన్నట్లు రుజువైందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల కల నెరవేరుతుంది: కెసిఆర్

      వరంగల్ జిల్లా హన్మకొండలో కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి కెసిఆర్ హాజరయ్యారు. ఆతరువాత వరంగల్ జిల్లా నాయకులతో భేటీ ఆయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని, తెలంగాణ ప్రజల కల నెరవేరుతుందని ఈ సంధర్బంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని వర్గాల కలసి ఉద్యమాన్ని చేశాయని ఆయన గుర్తు చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషిద్దామని చెప్పారు.

తెలంగాణ బిల్లుపై సంతకం చేసిన సీఎం కిరణ్

      తెలంగాణ ముసాయిదా బిల్లుపై సంతకం చేసి అసెంబ్లీ స్పీకర్ నాదేండ్ల మనోహర్‌కు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికు పంపించామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లుకు భాషాపరమైన సమస్యలు ఉన్నాయని, నిబంధనల ప్రకారం మూడు భాషల్లో ఉండాల్సిన బిల్లు ప్రతులు ఇంగ్లీష్‌లో ఉందని, తెలుగు, ఉర్దూలోకి అనువదించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.   ముసాయిదా బిల్లుపై చర్చ ఎప్పుడన్నది సోమవారం బిజినెస్ అడ్వజయిరీ కమిటీ (బీఏసీ)లో నిర్ణయం జరుగుతుందని సీఎం కిరణ్ తెలిపారు. బిల్లులోని ప్రతి క్లాజుపై ఓటింగ్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గడువు సరిపోతుందా, లేదా అన్నది ఇప్పేడే చెప్పలేమని సీఎం పేర్కొన్నారు. 371 డి సవరణకు సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీ అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. బిల్లులో 371 హెచ్ ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దిగ్విజయ్ సింగ్ ఇంటర్వ్యూ

  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:   1. రాష్ట్ర విభజనపై రాష్ట్రంలో అందరి అభిప్రాయము తీసుకొన్న తరువాతనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకొంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇరుప్రాంతల కాంగ్రెస్ నేతలు అంగీకరించారు కూడా. అందువల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్ననిర్ణయాన్నిపార్టీలో అందరూ బద్దులయి ఉండవలసిందే.   2. రాష్ట్ర విభజన బిల్లులోని ప్రతీ ఒక్క ఆర్టికల్ పై శాసనసభలోని ప్రతీ సభ్యుడు నిర్భయంగా తన అభిప్రాయలు తెలియజేయాలని కోరుతున్నాను. శాసనసభలో బిల్లుపై కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుంది. ఓటింగ్ జగదు. సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లును రూపొందిస్తాము.   3. హైదరాబాద్ పై పూర్తి హక్కులు తెలంగాణా ప్రభుత్వానిదే. పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. ఇక్కడ నివసిస్తున్న ప్రజల ధనమానప్రాణాలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వమే వహిస్తుంది.   4. రాష్ట్ర విభజన పూర్తి రాజ్యాంగ బద్దంగా జరుగుతోంది. అందువల్ల ప్రతిపక్షాల విమర్శలకు నేను జవాబు ఈయనవసరం లేదు. బీజేపీకి మాట నిలకడలేదు. ఎప్పుడు ద్వంద వైఖరి అవలంభిస్తునే ఉంటుంది.   5. జగన్మోహన్ రెడ్డి డీ.యన్.ఏ.కాంగ్రెస్ డీ.యన్.ఏ. సరిపోలుతుందని నేను గతంలో అన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. జగన్ కూడా కాదనలేదు కదా?   6. చంద్రబాబు నేటికి తను ఏమి కోరుకొంటున్నారనే అంశంపై స్పష్టత లేదు. ఆయన నాపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఆయనంటే నాకు గౌరవమే.   7. జేసీ.దివాకర్ రెడ్డి కి త్వరలో షో కాజ్ నోటీసులు జారీ చేస్తాము.   8. ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన గురించి తన వాదనలు వినిపించేదుకు పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి ఆయన కూడా తప్పనిసరిగా కట్టుబడి ఉండవలసిందే.   9. అన్నా హజారే వంటి మంచి వ్యక్తి పేరు ప్రతిష్టలను కొందరు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని దురూపయోగం చేస్తున్నారు.   10. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో అభివృద్ధి జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. హైదరాబాదులో అనేక పెద్ద సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా సీమాంధ్ర ఏర్పడిన తరువాత అక్కడ కూడా అటువంటివి ఏర్పాటుకి పూర్తి సహకారం అందిస్తాము.   11. పోలవరం ప్రాజెక్టుకి అవసరమయిన నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఈ ప్రాజెక్టులో మిగిలిన అంశాలపై కూడా కేంద్రం,ఏ పూర్తి బాధ్యత తీసుకొంటుంది.   12. రానున్న రెండు నెలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేహ్సాలు నిర్వహిస్తుంది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుండి పార్టీ కార్యకర్త వరకు అందరూ పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించబడుతాయి. వాటిలో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దలు, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఆహ్వానింపబడుతారు.

శాసనసభ సోమవారానికి వాయిదా

      శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యులు, తెలంగాణ బిల్లు పెట్టి చర్చకు అనుమతించాలని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇటీవల వచ్చిన తుఫానుల కారణంగా నష్టపోయిన అంశంపై చర్చకు సహకరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కోరినా సభ్యులు వినిపించుకోలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఉప సభాపతి, మంత్రి శ్రీధర్ బాబు కోరిన ఎమ్మెల్యే లు ఆందోళనను మానలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.

రాష్ట్ర విభజన బిల్లు రాకతో వేడెక్కిన రాజకీయాలు

    రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహంతీ చేతికి తెలంగాణా బిల్లు రావడంతోనే ఒక్కసారిగా హైదరాబాదులో రాజకీయాలు ఊపందుకొన్నాయి. దానికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ లో మఖాం వేసి కాంగ్రెస్ నేతలతో ఎడతెగని చర్చలు చేస్తుండటం, మరో వైపు శాసన సభ సమావేశాలు కూడా జరుగుతుండటంతో రాష్ట్ర రాజధానిలో వాతావరణం చలిగా ఉన్నపటికీ రాజకీయ వాతవరణం మాత్రం చాల వేడిగా ఉంది.   శాసనసభ, మండలి సమావేశాలలో ఊహించినట్లే సమైక్యాంధ్ర, తెలంగాణా నినాదాలతో రసాభాసగా మారుతూ వాయిదాలు పడుతున్నాయి. ఇక చాలా కాలం తరువాత టీ-కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వెంటనే సభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని కూడా కలిసి బిల్లుకోసం ఒత్తిడి తెస్తున్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అయితే నేరుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహంతీకే ఫోన్ చేసి బిల్లును వెంటనే సభకు పంపాలని కోరారు. ఈరోజు సాయంత్రంలోగా బిల్లుని సభలకు పంపకపోయినట్లయితే మొహంతీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామని తెరాస నేత హరీష్ రావు హెచ్చరించారు. అయితే ముఖ్యమంత్రి అనుమతి లేనిదే ప్రధాన కార్యదర్శి టీ-బిల్లును ఉభయ సభలకి పంపకపోవచ్చును.   తెలంగాణా నేతలు బిల్లుకోసం ఒకవైపు తొందరపడుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు మాత్రం ఇప్పుడప్పుడే బిల్లును సభలో ప్రవేశపెట్టే ఉద్దేశ్యం లేరు. కొద్ది సేపటి క్రితమే దిగ్విజయ్ సింగ్ గవర్నర్ నరసింహన్ తో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. ఒకవేళ ముఖ్యమంత్రి వెంటనే అనుమతించకపోయినట్లయితే, సభాపతే చొరవ తీసుకొంటారా? లేక బిల్లును ప్రవేశపెట్టమని గవర్నర్ ఆదేశిస్తారా అనే సంగతి త్వరలోనే తేలిపోతుంది.

లాలూకి సుప్రీం బెయిలు మంజూరు

  దాణా కుంభకోణం కేసులో ఐదేళ్ళు జైలు శిక్షపడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురయిన తరువాత సుప్రీం కోర్టుకి వెళ్ళారు. ఈరోజు ఆయన కేసు విచారణ చెప్పటిన సుప్రీం కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. 2జీ కుంభకోణంలో బెయిలుపై విడుదలయిన మాజీ కేంద్రమంత్రి రాజా, కరుణానిధి కుమార్తె కనిమోలి, అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటు బెయిలుపై విడుదలయిన జగన్మోహన్ రెడ్డి తదితరులు, సత్యం కంపెనీ కుంభకోణంలో బెయిలుపై విడుదలయిన రామలింగరాజు ఏవిధంగా తమ కేసుల నుండి ఉపశమనం పొందుతున్నారో, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇక జైలు బాధ నుండి విముక్తి పొందినట్లే భావించవచ్చును.

సచివాలయానికి 'టి' బిలొచ్చింది

      తెలంగాణ ముసాయిదా బిల్లు సచివాలయాని చేరింది. దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన హోంశాఖ అధికారి సురేష్ కుమార్ భారీ భద్రత నడుమ 120 పేజీలు గల ముసాయిదా బిల్లు, 30 పేజీల ముసాయిదా బ్రీఫ్ ను సచివాలయంలో ప్రధాని కార్యదర్శి మహంతికి అందించారు. ఈ రాత్రి కల్లా సీఎంకు తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి మహంతి అందించనున్నారు. సీఎం నుంచి గవర్నర్ వద్దకు కూడా ఈ రోజు రాత్రే బిల్లు వెళ్లనున్నట్లు సమాచారం.   తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సభ అభిప్రాయమే కాక సభ్యుల అభిప్రాయాన్ని కూడా రాష్ట్రపతి కోరారు. దీని కోసం అసెంబ్లీకి రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 23లోగా అభిప్రాయం చెప్పవలసి ఉంటుంది. మరోవైపు రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇచ్చిన కూడా కేంద్ర౦ ఇదే సమావేశాల్లో తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు సేకరి౦చడానికి వడి వడిగా అడుగులేస్తోంది. ముఖ్యమంత్రి సహకారం లేకపోయినా తెలంగాణ ముసాయిదా బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు అవసరమైన వ్యూహాన్ని కూడా దిగ్విజయ్ సింగ్ రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణపై వెనక్కి తగ్గలేని స్థితికి కాంగ్రెసు అధిష్టాన చేరుకుంది. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రితో చెప్పినట్లు సమాచారం.అలాగే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకే తాను హైదరాబాదుకు వచ్చానని, ఊరూరా కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చిన ఘనతను చాటాలని టి కాంగ్రెసు నేతలకు డిగ్గీ సూచించారు.

రాహుల్ గాంధీ పై ఆమ్ ఆద్మీ పోటీ?

      ఢిల్లీ ఎన్నికలలో సంచనాలు సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాహుల్ గాంధీ పై పోటీకి దిగనుంది. ఢిల్లీ లో అగ్రనేతగా ఎదిగిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై పోటీ చేసి..ఆమెను ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో రాహూల్ గాంధీని టార్గెట్ చేయాలని చూస్తోంది.   లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కి పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ  వ్యూహకర్తలో ఒకరైన కుమార్ విశ్వాస్ ను నిలబెట్టాలని  కేజ్రివాల్ నిర్ణయించారని వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్‌తో పాటు ఆయా పార్టీల అగ్రనేతల పైన తమ అభ్యర్థులను పోటీకి దింపేందుకు కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. షీలా దీక్షిత్ లాగే రాహూల్ కూడా ఓ సామాన్యుని చేతిలో పరాజయం పాలైతే ఆయన రాజకీయ జీవితానికే ఎసరు రావచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.   

హైదరాబాద్ లో జోరందుకున్న విభజన రాజకీయాలు

      రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపించడంతో హైదరాబాద్ లో విభజన రాజకీయాలు జోరందుకున్నాయి. రాష్ట్రానికి వచ్చిన డిగ్గీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఉదయం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరామర్శించారు. అనంతరం లేక్ వ్యూ గెస్టు హౌస్‌లో పలువురు నేతలను కలిశారు. ఆ తర్వాత కిరణ్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఆరు గంటల తర్వాత పిసిసి కార్యవర్గంతో భేటీ అవుతారు.   అటు తెలంగాణ, సీమాంధ్ర నాయకులు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో దిగ్విజయ్ ను మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కలిశారు. విభజనపై అధిష్టానంకు సహకరించాలని సీఎ౦ కిరణ్ ను అడగగా... ససేమీరా అన్నారట. సమైక్యంపై తమ నిర్ణయంలో మార్పు ఉండదని, మీరే పునరాలోచించుకోవాలని కిరణ్ చెప్పగా.. డిగ్గీ కూడా ఈ సమయంలో టిపై వెనక్కి వెళ్లలేమని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించారట.

గే సెక్స్‌: సుప్రీం తీర్పుపై సోనియా అసంతృప్తి

      స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్త౦ చేశారు. అయితే ఈ గోడపై సోనియా గాంధీ స్పందించడం విశేషంగా ఉంది. స్వలింగ సంపర్కుల విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తనకు బాధ కలిగించిందని అన్నారు. దేశంలోని పౌరులందరికీ జీవించే హక్కును, స్వేచ్ఛను పార్లమెంటు గ్యారంటీ చేస్తందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. గే సెక్స్‌పై హైకోర్టు తీర్పును పునరుద్ధరించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ గురువారంనాడు చెప్పారు. స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రధాని అభ్యర్థి నీలేకని!..కొట్టిపారేసిన కాంగ్రెస్

      రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి నందన్ నీలేకని వచ్చిన వార్తలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్‌దీక్షిత్ కొట్టిపారేశారు. రాహుల్‌గాంధీకి పార్టీలో అందరూ మద్దతిస్తున్నారని, ఆయన కాకపోతే మరెవరు ప్రధాని అభ్యర్థి అవుతారని ప్రశ్నించారు.   ప్రధాని అభ్యర్థి రేసులో నీలేకని కూడా ఉన్నారంటూ ఓ వార్తాపత్రిక కథనం పేర్కొంది. అయితే, 'ఇంతకన్నా చెత్తవార్త మరొకటి ఉండదు' అని సాక్షాత్తూ ఆయనే ఖండించినట్లు కూడా పేర్కొంది. దీనిపై కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ "మాకు మా పార్టీ నేతలున్నారు. నీలేకని కూడా మాతో పనిచేస్తున్నారని దాటవేశారు. జేడీయూ నాయకుడు శివానంద్ తివారీ కూడా 'ఎవరీ నిలేకని?' అని నొసలు చిట్లించారు. కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకోదలచుకుంటే ఇక చెప్పేదేముంది? అన్నారు.

ఏపీ 'ఆమ్ ఆద్మీ' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!!

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రంగంలో ఆయనకున్న క్రేజ్..అభిమానించేవారు కోకొల్లలు.. అందులోనూ పవన్‌ మేనియాలో కొట్టుమిట్టాడేవారు కూడా ఎక్కువే. ఇప్పుడు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారనున్నారు. పవన్‌ చుట్టూ రాజకీయాలకు సంబంధించిన గాసిప్స్‌ పూటకొకటి బయటకి వస్తున్నాయి.   గతంలో పవన్ కళ్యాణ్ టిడిపిలో చేరబోతున్నారని అని వార్తలు కూడా వచ్చాయి. కాని వాటిని ఆయన ఖండించలేదు గాని, ఆయన సోదరుడు నాగబాబు మాత్రం దానిని ఖండించారు. ఇప్పుడని కాదు..ఎప్పుడూ పవన్ తనపై వచ్చిన విమర్శలు కు, గాసిప్స్‌ కు స్పందించిన  దాఖలాల్లేవు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  'ఆమ్ ఆద్మీ పార్టీ' లో చేరబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి పవన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని అంటున్నారు. దీనిపై రాష్ట్రంలో 'ఆమ్ ఆద్మీ పార్టీ' సర్వే కూడా చేసినట్టు సమాచారం. మొత్తమ్మీద, పవన్‌ రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాడో రాడోగానీ, పవన్‌ పేరుతో గాసిప్స్‌ మాత్రం విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.

టిడిపి టికెట్ కు డిమాండ్..కాంగ్రెస్ ఖాళీ..!!

      నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోల్పోయిందని ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పార్టీలో ఉంటూ వివిధ పదవులు అనుభవించిన ముఖ్య నేతలే ఫిరాయింపుల బాట పట్టారు. ఈ క్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలోకి చేరడానికి టిడిపి అధినేత చంద్రబాబును కలిసినట్లు సమాచారం. ఆయన నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.   ఇదే విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కూడా ఆయన మాతృసంస్థ అయిన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. నెల్లూరు నగర టిడిపి టికెట్ ఇస్తేనే పార్టీలో చేరుతానని షరతుపెట్టినట్టు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కూడా టిడిపిలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా కాంగ్రెస్ వీడి టిడిపిలో చేరడానికి మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తనకు నెల్లూరు పార్లమెంట్ సీట్ కేటాయిస్తేనే పచ్చకండువా కప్పుకుంటానని టిడిపి అధినేతతో చెప్పినట్లు సమాచారం. వీరే కాక మరి కొందరు ముఖ్య నేతలు కూడా జంప్ జిలానీలుగా మారనున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుండడం కేడర్ కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ కి అభ్యర్థులే కరువైనట్లు ప్రచారం సాగుతోంది.

మండేలా మృతి పట్ల శాసనసభ సంతాపం

      దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది. ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభంకాగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెల్సన్ మండేలా సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా అని, మానవజాతి చరిత్రలో నెల్సన్ మండేలా మహా శిఖరమని కొనియాడారు.తన జీవితాన్ని మండేలా ప్రజలకే అంకితం చేశారని అన్నారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..మండేలా త్యాగాల ఫలితంగానే సౌతాఫ్రికాకు స్వాతంత్య్రం లభించిందని అన్నారు. గాంధీ మహాత్ముడికి మండేలా ఏకలవ్య శిష్యుడవడం దేశానికి గర్వకారణమన్నారు. నెల్సన్ మండేలా యుగపురుషుడని చెప్పారు. అలాగే తెరాస, వైకపా, ఎంఐఎం సభ్యులు మండేలాకు సంతాపం తెలిపారు.