రాజ్యసభకు డీఎస్... ! చక్రం తిప్పిన కవిత
posted on May 15, 2016 @ 3:31PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 2 ఖాళీలు ఉన్నాయి. దీంతో రాజకీయపార్టీలు రాజ్యసభ అభ్యర్థులపై కసరత్తును ప్రారంభించాయి. తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రెండు సీట్లు అధికార టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తాయి. ఈ రెండింటి కోసం దాదాపు ఐదారుగురు సీనియర్లు పోటీ పడుతున్నారు. అయితే అందరికంటే ముందుగా డీఎస్ తన బెర్త్ కన్ఫామ్ చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా పనిచేసి కాంగ్రెస్ రెండు సార్లు వరుసగా అధికారంలోకి రావడానికి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డీఎస్ కాంగ్రెస్‌ను వీడి..టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్‌లో చేరడానికి ముందే రాజ్యసభ సీటుపై కేసీఆర్ నుంచి గ్యారెంటి లభించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రాజ్యసభ సీటు దక్కించుకోవడానికి ఆయన తన బీసీ కార్డుతో పాటు కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత చక్రం తిప్పినట్టు టీఆర్ఎస్ భవన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కూతురు రికమండేషన్‌తో కరిగిన కేసీఆర్..డీఎస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీనిపై నేడో,రేపో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది.