దత్తన్న సెల్‌ఫోన్ చోరి..!
posted on May 15, 2016 @ 3:09PM
తాము దొంగతనం చేయడానికి ఎవరైనా ఒకటే అని నిరూపిస్తున్నారు. సాక్షాత్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సెల్‌ఫోన్‌ని ఆగంతకులు కొట్టేశారు. దత్తాత్రేయ హైదరాబాద్ రామ్‌నగర్‌లోని మీ సేవాకేంద్రంలో నివాసం ఉంటారు. నిన్న అర్థరాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చెట్లు విరిగిపోయి ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మంత్రిగారి శామ్‌సంగ్ సెల్‌ఫోన్‌లో చార్జింగ్ అయిపోయింది. దీంతో ఆయన తన ఇంటి ముందున్న గదిలో ఛార్జింగ్ పెట్టారు. రోజులాగే ఆయన్ని కలిసేందుకు చాలా మంది సందర్శకులు అక్కడ నిలిచి ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత చూస్తే సెల్‌ఫోన్ కనిపించలేదు. ఫోన్‌ని ఎవరో దొంగిలించారని నిర్థారించుకున్న మంత్రి పీఏ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ విలువ రూ.25 వేల వరకు ఉంటుందని అంచనా.