తగ్గిన తుమ్మల మెజార్టీ..

  పాలేరు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు ముందు నుండి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అయితే మొదటి మూడు రౌండ్లలో 13,810 ఓట్ల ఆధిక్యంతో ఉన్న తుమ్మల.. ఇప్పుడు తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి మెజార్టీ తగ్గినట్టు తెలుస్తోంది. 9వ రౌండ్‌ ముగిసే సరికి తుమ్మల 27, 989 ఆధిక్యంలో ఉన్నారు. 14 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది.   కాగా  కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో ఈ ఉపఎన్నిక ఖరారైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఉపఎన్నికలో కూడా విజయం సాధిస్తే నాలుగోసారి కూడా విజయం సాధించినట్టే.

కేరళ ఓట్ల లెక్కింపు.. వెనుకంజలో శ్రీశాంత్..

  మాజీ ఇండియా క్రికెటర్ శ్రీశాంత్ రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీ తరుపున ఆయన కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి బరిలో దిగారు. కాగా ఈరోజు కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో శ్రీశాంత్‌ వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న వీఎస్‌ శివకుమార్‌ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌, సీపీఎం ముఖ్యమంత్రి అభ్యర్థులు వూమెన్‌ చాందీ, వీఎస్‌ అచ్యుతానందన్‌ ముందంజలో కొనసాగుతున్నారు   మొత్తం 140 స్థానాల్లో 126 స్థానాల్లో ఆధిక్యతలు వెలువడ్డాయి. ఎల్‌డీఎఫ్‌ 66స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా యూడీఎఫ్‌ 51, భాజపా 3, ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ఈశాన్యంలో వికసించిన కమలం..అసోంలో బీజేపీ పాగా

అసోంలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించి తొలిసారిగా అధికారం చేపట్టనుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినట్లే బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 126 సీట్లున్న అసోంలో బీజేపీ 78 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 21 చోట్ల ముందంజలో ఉంది. ఏఐయూడీఎఫ్ 15, ఇతరులు ఆరు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా మూడుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరుణ్ గగోయ్ నాలుగో సారి ముఖ్యమంత్రి కావాలని ఆశించారు. కాని ఆయనపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారింది. బీజేపీ అభ్యర్థి శరబానంద్ సోనావాల్ సీఎం కానున్నారు.

తమిళనాడు మళ్లీ అమ్మదేనా..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ సమయానికి డీఎంకే కూటమి ముందంజలో ఉండి ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా అనిపించేంతగా దూసుకెళ్లింది. అయితే తర్వాత విజయలక్ష్మీ అమ్మ వైపు మొగ్గు చూపుతున్న్టట్లు తెలుస్తోంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఇప్పటి వరకు 177 స్థానాల ఫలితాలు తెలుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అన్నాడీఎంకే 102 స్థానాల్లోనూ, డీఎంకే 80 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. అయితే కౌంటింగ్ ఇంకా పూర్తిస్ధాయిలో జరగాల్సి ఉంది. దాంతో ఏ క్షణంలో ఎటు మలుపు తిరుగుతోందనన్న ఉత్కంఠ తమిళనాడులో నెలకొంది. కరుణ, జయ నివాసాల వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 

హోదాకి బదులు ఏపీకి నిధులు ఇస్తాం.. సిద్దార్ధ్ నాథ్ సింగ్

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు.. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్దార్ధ్ నాథ్ సింగ్.. ఇప్పుడు మరోసారి ఏపీ ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం నుండి అందించాల్సిన సాయం అందుతూనే ఉంటుంది.. హోదాకి బదులు ఏపీకి నిధులు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు విడుదల చేశాం.. ఇంకా రూ .22,112కోట్లు మంజూరు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని.. ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి అభివృద్ధికి సహాయపడతామని అన్నారు.

5 కోట్లకు అమ్మకానికి సిటీ... ఎక్కడ..?

  ఓ ఇల్లు కొనాలంటేనే లక్షలకు లక్షలు ఖర్చవతుంది. అలాంటిది కేవలం ఒక సిటీనే చాలా తక్కువ ధరకు అంటే రూ. 5 కోట్లకు భేరం పెట్టింది ఓ వెబ్ సైట్. ఇంతకీ ఎంటా సిటీ.. ఎక్కడ అనుకుంటున్నారా. అస్ర్టేలియాలోని ఓ దంపతులు ఈ ప్రకటన ఇచ్చారు. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ నగరానికి దగ్గర్లో అల్లిస్‌ క్రీక్‌ అనే పట్టణం ఉంది. ఒక్కప్పుడు టింబర్‌ డిపోల చిరునామాగా ఉండే ఈ పట్టణంలో ప్రస్తుతం మూడు కలప మిల్లులు, 16 గృహాలు, విశాలమైన రోడ్లు, ఫుట్‌ పాత్‌ లు, నీటి సరఫరా వ్యవస్థ, సొంతంగా విద్యుత్‌ కేంద్రం, సరస్సులతే పలు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అయితే ఈ పట్టణానికి యజమానులైన దంపతులు దీనిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. డొమైన్‌.కామ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో అమ్మకానికి పెట్టారు. అయితే మొదట 2 మిలియన్‌ డాలర్లకు అమ్మకానికి పెట్టగా, దీనిని కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆ ధరను తగ్గించి కేవలం 7.5 లక్షల డార్లకే అంటే మన కరెన్సీలో 5 కోట్లకు పైగా అమ్మకానికి పెట్టారు.

బ్యాంకింగ్ చరిత్రలోనే భారీ నష్టాన్ని చవిచూసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు కు వచ్చిన నష్టం చూస్తుంటే బ్యాంకింగు చరిత్రలోనే అతి పెద్ద నష్టం ఇదేనేమో అనిపిస్తోంది. ఒక కోటి కాదు రెండు  కోట్లు కాదు ఏకంగా 5 వేల కోట్లకు పైగానే నష్టాన్ని చవిచూసింది. 2016 మార్చిలో నాలుగో త్రైమాసిన పూర్తవగా మొత్తం రూ. 5,367.14 కోట్లు నష్టంలో  ఉన్నట్టు ప్రకటించింది. కాగా గత సంవత్సరం ఇదే సమయానికి బ్యాంకు దాదాపు రూ. 306 కోట్ల లాభాంలో ఉండగా.. ఒక్క ఏడాదికే ఇంత భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మొత్తానికి పెరుగుతున్న రుణ బకాయిల దెబ్బ ఎలా ఉంటుందో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి తెలిసొచ్చింది. కాగా, ఈ మూడు నెలల కాలంలో మొత్తం ఆదాయం 1.33 శాతం తగ్గి రూ. 13,276 కోట్లకు చేరిందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 2014-15 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే నిరర్థక ఆస్తుల మొత్తం 3 రెట్లు పెరిగి రూ. 3,834 కోట్ల నుంచి రూ. 10,485 కోట్లకు పెరిగిందని బ్యాంకు తెలిపింది.

అమ్మ నెంబరు 2 సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..?

తమిళనాడు ఎన్నికలు రెండు రోజుల క్రితమే ముగిశాయి. ఇప్పుడు అందరూ ఎన్నికల ఫలితాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం ఈసారి డీఎంకే పార్టీనే అధికారంలోకి వస్తుందంటున్నారు. ఇక డీఎంకే పార్టీ నేతలు కూడా తమదే పక్కా విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు అన్నాడీఎంకే నేతలు కూడా అమ్మదే విజయని అంటున్నారు. ఎందుకంటే జయలలిత అదృష్ట సంఖ్య 2 అని.. ఈ కారణంగా ఆమె గెలుస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ఆ నెంబరు గురించిన వివరాలు కూడా తెలుపుతున్నారు. జయలలిత ఓటరు జాబితా నెంబరు 1100 ఈ నెంబరు కలిపితే రెండు వస్తుంది.. ఇంకా ఆమె ఓటు వేయడానికి బయలు దేరిన టైం 9.56 ఇది కూడినా రెండే వస్తుంది.. మరోవైపు స్టెల్లామేరీస్‌ కళాశాలలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,258 మంది కాగా, వారిలో 200వ వ్యక్తిగా జయలలిత తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సంఖ్య మొత్తం కూడినా రెండు వస్తుంది. అంతేనా.. ఓటు వేసిన తర్వాత ‘మరో రెండు రోజుల్లో తెలుస్తుంది’ అంటూ రెండు మీద మంచి ఉపోద్ఘాతమే ఇచ్చారు. ఈనేపథ్యంలోనే అమ్మకు రెండు అంకె కలిసొస్తుందని.. అందుకే రెండోసారి కూడా అమ్మే ముఖ్యమంత్రిగా తమిళనాడులో పాలన చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. మరి ఈ రెండు నెంబరు సెంటి మెంట్ వర్కవుట్ అవుతుందో లేదో రేపటితో తేలిపోతుంది.

సీఎంగా ఉమెన్ చాందీ రికార్డు..!

కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు. కేరళను అత్యధిక కాలం పాటు పాలించిన సీఎంగా చాందీ ఘనత సాధించారు. సీఎంగా ఆయన ఇవాళ్టీకి 1,827 రోజులు పూర్తి చేసుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగిన ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతకు ముందు సీఎంగా పనిచేసిన వీఎస్ అచ్యుతానందన్ రికార్డును అధిగమించారు. అచ్యుతానందన్ 1,822 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసి అత్యధిక కాలం కేరళను పాలించిన వ్యక్తిగా ఘనత సాధించారు. కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మరో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టాలనుకుంటున్న చాందీకి ఎగ్జిట్ పోల్స్ షాకిచ్చాయి. కేరళలో అధికార మార్పు తప్పదని సర్వేలు అంచనా వేశాయి.