సోనియాను ముంచింది వారేనట..
posted on Jul 11, 2016 @ 12:23PM
పార్టీలో ఉన్నంతకాలం బాగానే ఉన్నా ఒక్కసారి వేరే పార్టీ మారితే చాలు.. అప్పటివరకూ ఉన్న పార్టీ నేతలపైనే విమర్శలు చేసేస్తుంటారు కొంతమంది నేతలు. ఇప్పటివరకూ అలాంటి నేతలను ఎంతో మంది చూసుంటాం. పొరిగింటి పుల్లకూర రుచి అన్న మాదిరి.. వేరే పార్టీ నీళ్లు వంటపట్టగానే సరి.. విమర్శలు గుప్పించేస్తారు. ఇప్పుడు ఆ జాబితాలోకి గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా చేరిపోయారు.
నల్గొండ పార్లమెంట్ సభ్యడు గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని, సోనియాను ముంచింది ఇప్పుడున్న ముఖ్య నేతలేనని.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్ వ్యాఖ్యలు గురివింద గింజ చందంగా ఉంటాయని.. తాను ఎంపీగా బరిలో లేకపోతే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేవారా అని ప్రశ్నించారు. కడుపులో కత్తులు పెట్టుకుని ఉత్తమ్, వెంకట్‌రెడ్డి కౌగిలించుకున్నా, కరచాలనం చేసినా వృథానేనని ఆయన విమర్శించారు. నన్ను తిట్టేందుకైనా కాంగ్రెస్ నేతలంతా ఒక్కటైనందుకు సంతోషమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్ట్‌ల కోసం కాదని, ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం తాను పార్టీమారానని ఆయన అన్నారు. మరి గుత్తా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో.. వారు గుత్తా మీద ఏం విమర్శలు గుప్పిస్తారో చూడాలి.