మాయవతికి కూడా అవే కష్టాలు..
posted on Jul 11, 2016 @ 4:51PM
మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాంపులు కామన్ అయిపోయాయి. నేతలు ఇష్టమొచ్చినట్టు ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా.. తెలంగాణలో అయితే అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరుతుంటే.. ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతున్నారు. ఇప్పుడు ఇదే సీన్ బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలో కనిపిస్తోంది. ఇప్పటివరకూ నలుగురు నేతలు పార్టీని వీడగా ఇప్పుడు మరో కీలక నేత తన పదవికి రాజీనామా చేసి పార్టీ అధినేత్రి మాయావతికి మరో షాక్ ఇచ్చారు.
దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన బీఎస్పీ జాతీయ కార్యదర్శి పరందేవ్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఓ కిరాణాకొట్టుగా మారిపోయిందని.. డబ్బుంటే పార్టీలో టిక్కెట్ల నుంచి పదవుల దాకా అన్నీ దక్కుతాయని పరందేవ్ ఆరోపించారు. తనలాంటి అంకితభావం కలిగిన నేతలను పక్కనబెట్టి ఎటువంటి విధేయత లేని వారిని ఎమ్మెల్సీలను చేస్తున్నారని విమర్శించారు.తాను ఇక వారణాశికి వెళ్లిపోతున్నానని చెప్పారు. దీంతో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పరందేవ్ యాదవ్ పార్టీకి దూరమవ్వడం మాయవతికి పెద్ద దెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు పరందేవ్ యాదవ్ త్వరలోనే భాజపాలో చేరుతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా బీఎస్పీ సీనియర్ నేతలు స్వామి ప్రసాద్ మౌర్య, ఆర్‌కే చౌదరి, రవీంద్రనాథ్ త్రిపాఠి ఇటీవలే పార్టీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.