తెగ బాధపడిపోతున్న కిషన్ రెడ్డి..

  బీజేపీఎల్పీ లీడర్, మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారట. ఇంతకీ కిషన్ రెడ్డి అంతలా ఏ విషయం గురించి బాధపడిపోతున్నారనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. 2004లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేంద్ర రాజకీయాల్లో ఉండకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయడమే ఆయన చేసిన తప్పట. అప్పటి ఎన్నికల్లో ఎంపీగా పాల్గొనకుండా.. ఎమ్మెల్యేగా పోటీ చేసి తప్పుచేశానని.. అప్పుడు కేంద్ర రాజకీయాల్లో ఉంటే బావుండేదని.. అందుకే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే ఇరుక్కపోయానని తానే స్వయంగా మీడియా సమావేశంలో చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8న అమిత్‌షాతో కోర్‌కమిటీ భేటీలో తాను పాల్గొననున్నట్లు.. ఈ భేటీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నట్లు తెలియజేశారు.

అదే మా లక్ష్యం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 302 రోజుల్లోనే పట్టిసీమ ఎత్తిపోతల పూర్తి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. 24 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తున్నామని, ఈ ఏడాది కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు తరలించడమే లక్ష్యంగా పెట్టకున్నామని తెలిపారు. సముద్రంలో కలిసే నీటిని అంచనా వేసి దశలవారీగా ఉపయోగించుకుంటామన్నారు. ఈ ఏడాదిలో తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని.. గోదావరి నీటిని సోమశిల వరకు తీసుకెళ్తామని.. పోలవరానికి ఆశించిన స్థాయిలో కేంద్రం నిధులు విడుదల చేయకపోయినా, పోలవరం నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

ఆ విషయంలో హైదరాబాదే బెస్ట్...

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఇంతకీ ఎందులో వచ్చిందనుకుంటున్నారా..? ప్రజలు నివసించేందుకు అత్యత్తమ నగరాల్లో హైదరాబాద్ అన్ని నగరాలనీ వెనక్కి నెట్టి ప్రథమస్థానంలో నిలిచింది. మెర్సర్ అనే గ్లోబల్ హ్యూమన్ రీసోర్సెస్ కన్సల్టింగ్ సంస్థ సర్వే నిర్వహించగా అందులో హైదరాబాద్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. సర్వే ప్రకారం 2016 సంవత్సరానికి గాను భారత్‌లో జీవించేందుకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాను విడుదల చేసింది. పలు అంశాలను పరిగణలోకి తీసుకొని మొత్తం 440 పట్టణాల్లో సర్వేని నిర్వహించగా.. హైదరాబాద్ 139వ ర్యాంక్‌ను సొంతం చేసుకుని ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పూణె నిలిచింది. 161 ర్యాంకుతో ఢిల్లీ మూడో స్థానంలో నిలవగా, 152 ర్యాంకతో ముంబై, 160 ర్యాంక్‌తో కోల్‌కత్తా 145 ర్యాంక్‌తో బెంగుళూతు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

స్మృతీ శాఖ మార్పుకు కారణాలు అవేనా.. !

  ప్రధాని నరేంద్రమోడీ కేబినేట్ ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వివిధ మంత్రుల శాఖలు మార్పుచెందాయి. ఈ మార్పుల వెనుక కూడా పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్మృతీ ఇరానీ శాఖ మార్పుపై.. గతంలో ఒక్కమాట కూడా మాట్లాడకుండా స్మృతీకి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖను అప్పగించిన మోడీ.. ఈసారి మాత్రం ఆమెకు జౌళి శాఖను అప్పగించారు. అయితే ఈశాఖను అప్పగించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం మేరకే ఆమెకు మోడీ ఈ శాఖను కట్టబెట్టారని అంటున్నారు. అంతేకాదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల గొడవ, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వివాదాలు కూడా ఆమె శాఖ మార్పుకు ముఖ్యపాత్ర పోషించాయని అంటున్నారు. దీంతో రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన హెచ్ఆర్డీకు ఎలాంటి వివాదాలు లేని ప్రకాశ్ జవదేవకర్ కు అప్పగించారని అంటున్నారు.

మోడీ గొప్పలే.. విషయం లేదన్న అమెరికా..

  ప్రధాని నరేంద్ర మోడీవి అన్ని గొప్పలేనట.. విషయం ఏ మాత్రం లేదంటా.. ఈ వ్యాఖ్యలు చేసేది ఎవరని అనుకుంటున్నారా... అగ్రరాజ్యమైన అమెరికానే మోడీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ మేటరేంటంటే.. ప్రధాని నరేంద్ర మోడీ  ఆర్థిక సంస్కరణలను అమెరికా ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమెరికానే మాట మార్చి ఆయన చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ఆశించిన రీతిలో లేవని తేల్చేసింది. ఈ విషయాన్ని "2016 పెట్టుబడుల వాతావరణ ప్రకటన" నివేదికలో తెలిపింది. మోదీ చెబుతున్న రీతిలో ఆర్థిక సంస్కరణలు లేవని.. గొప్పలు చెప్పుకోవడం మినహా.. లక్ష్యాలను అధిగమించలేకపోతున్నారని తెలిపింది. అయితే విదేశీ పెట్టుబడుల నిబంధనల విషయంలో తీసుకున్న చర్యలు, పాలన ఫర్వాలేదని తన రిపోర్టులో పేర్కొంది. ఇతర ఆర్థిక సంస్కరణలతో పోలిస్తే మోదీ చేపట్టేవి చాలా నెమ్మదిగా ఉన్నాయని అమెరికా వ్యాఖ్యానించింది. మరి అమెరికా చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు ఎంతలా రెచ్చిపోతాయో చూడాలి.

మెడికో పైశాచికం.. బతికిన శునకం..

  చెన్నైకి చెందిన గౌతమ్ అనే మెడికో అతి పైశాచికంగా శునకాన్ని భవంతిపై నుండి పడేసిన సంగతి తెలిసిందే. పడేయటమే కాదు.. తను చేసే ఘనకార్యాన్ని వీడియో తీసి మరీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే గౌతమ్ చేసిన పనికి నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా టెర్రస్ పై నుండి పడేసిన శునకం చనిపోయిందేమో అని అందరూ భావించినా.. అదృష్టవశాత్తు అది బ్రతికింది. దాని కాలుకు మాత్రం దెబ్బ తగిలినట్టు.. కుక్కను కాపాడిన కార్తీక్ దండపాణి, శ్రవణ్ అనే యువకులు చెబుతున్నారు. ఆ కుక్కకు చికిత్స చేయిస్తున్నామని కార్తీక్ చెప్పారు. ఇంకా సమాచారం అందుకున్న పోలీసులు గౌతమ్ ను అదుపులోకి తీసుకున్నారు.   ఇదిలా ఉంటే గౌతమ్ చేసిన ఈ పైశాచిక చర్యపై సెలబ్రిటీల సైతం స్పందించి అతనిపై మండిపడుతున్నారు. హీరో సిదార్ధ్, హీరోయిన్ ఇషాచావ్లా వంటి సెలబ్రెటీలు స్పందించి అతనిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

షీలా దీక్షిత్ కు ఏసీబీ సమన్లు..

వాటర్ టాంకర్ల కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ కుభంకోణంపై వివరణ ఇవ్వాలని ఆమెకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. వాటర్ మీటర్ కుంభకోణంపై ఆమెను విచారించేందుకు, ఆమె అందించే వివరాలను విచారణాధికారులు రికార్డు చేసేందుకు వీలైన స్థలాన్ని సూచించమంటూ కోరింది. షీలా దీక్షిత్ ఢిల్లీ జల బోర్డ్ (డీజేబీ) ఛైర్ పర్సన్ గా ఉన్నసమయంలో వాటర్ మీటర్ కుంభకోణం ఆరోపణలు చోటు చేసుకోవడంతో ఆమెకు సమన్లు జారీ చేసినట్లు ఏసీబీ స్పెషల్ పోలీస్ కమిషనర్ ఎం కె మీనా తెలిపారు.

రాహుల్ గాంధీ పెళ్లి ఫిక్స్..?

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్నాడా..తన బ్రహ్మచర్యానికి స్వస్తి పలికి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా..? అంటే  అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే మోస్ట్ వాంటెట్ బ్యాచులర్ గా ఉన్న రాహుల్ గాంధీ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో  హాట్ టాపిక్ ఇదే. ఇప్పటికే 46 ఏళ్ల సంవత్సరాలు వయసున్న రాహుల్ గాంధీ.. తన తల్లి సోనియా గాంధీ చూసిన అమ్మాయితోనే వివాహానికి సిద్దమైనట్టు సమాచారం. అలహాబాద్ లోని ఓ కుటుంబంతో సోనియా ఈ మధ్య చర్చలు కూడా జరిపారట. ఆ ఫ్యామిలీలోని ఓ బ్రాహ్మణ యువతితో రాహుల్ పెళ్లి చేయాలని సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అది కూడా వచ్చే యూపీ ఎన్నికలు జరిగే నాటికే రాహుల్ కు పెళ్లి చేయాలని సోనియా గాంధీ చూస్తున్నారట. అయితే దీని వెనుక నాడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శిగా వ్యవహరించిన వ్యక్తి ఉన్నాడట. ఈయనే సోనియాకు ఆ కుటుంబం గురించి చెప్పి... సంబంధం కుదిర్చాడట. మొత్తానికి ఎన్నో ఏళ్లకి రాహుల్ ఓ ఇంటివాడవ్వటం శుభపరిణామమే అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి అది ఎంత వరకూ నిజమే తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

మాల్యాకు శిక్ష విధించలేం...

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యాకు శిక్ష విధించలేమని హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని థర్డ్ సెషన్స్ కోర్టు  న్యాయమూర్తి తేల్చి చెప్పేశారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతల్లో జీఎంఆర్ గ్రూప్ కు మాల్యా ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మాల్యాపై ఎర్రమంజిల్ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి కూడా విదితమే. దీనిపై గతంలో విచారణ జరిపిన కోర్టు మాల్యాకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.   అయితే సదరు అడ్రెస్ లో మాల్యా లేకపోవడంతో తిరుగుటపాలో కోర్టుకే వచ్చాయి. అయితే అప్పుడు కూడా దోషి లేనిదే శిక్ష విధించడం కుదరదని చెప్పిన కోర్టు.. ఈసారి కూడా అదే నిర్ణయానికి కట్టుబడింది. దోషి లేకుండా శిక్ష ఖరారు చేయలేమన్న న్యాయమూర్తి... కేసు తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేశారు. అప్పటిలోగానైనా మాల్యాను తమ ముందు హాజరుపరచాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరి విజయ్ మాల్యా కోర్టుకు వచ్చి.. ఆయనకు శిక్ష విధించినప్పుడు సంగతి...

పాపం: విషాదంలో వింత..

మరణం చాలా విచిత్రంగా సంభవిస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. ఎంతో పెద్ద ప్రమాదాల నుంచి కూడా బయటపడిన వారు తమాషాగా మరణిస్తుంటారు. భారీ కాయం ఉన్న ఒక భార్య తన భర్తపై కాలు జారి పడటంతో ఇద్దరు మరణించిన ఘటన గుజరాత్‌లో జరిగింది. రాజ్‌కోట్‌లోని కలావడ్ రోడ్డులోగల రామ్ దామ్ సోసైటీలో మంజుల విఠలానీ, నట్వర్ లాల్ అనే భార్యభర్తలు నివసిస్తున్నారు.   మంజుల 128 కేజీల బరువు ఉంటారు. వీరి కుమారుడు ఆశిష్, కోడలు నిశా వీరి ఇంటిలోనే పై ఫ్లోర్‌లో ఉంటారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆశిష్‌కు శ్వాస సంబంధమైన ఇబ్బంది రావడంతో కోడలు నిశా మందులు తీసుకెళ్లేందుకు కిందకి వచ్చింది. అదే సమయంలో అత్తమామలైన మంజుల, నట్వర్ లాల్‌ కూడా కొడుక్కి ఏమైందోనన్న కంగారుతో మెట్లెక్కెందుకు ప్రయత్నించారు. అలా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మంజుల తన బరువును ఆపుకోలేక కాలుజారి వెనుక వస్తున్న భర్త నట్వర్‌లాల్‌పై పడింది. ఆమె అధిక బరువు ఉండటంతో ఆయన కిందపడిపోవడంతో ఇద్దరి తలకు బలమైన గాయాలై ప్రాణాలు కోల్పోయారు.

జైలు పాలైనా వైఫ్‌తో రోమాన్స్ చేస్తోన్న డాన్..

భారతదేశంలో జైళ్లు ఖైదీలకు గెస్ట్‌హౌస్‌లుగా మారిపోయాయని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. డబ్బు, పలుకుబడి ఉంటే చాలు సమస్త సుఖాలు కారాగారాలకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. ఇక మాఫియా డాన్‌ల సంగతి సరేసరి. ఇలాంటి అవకాశాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు మాఫియా డాన్ అబుసలేం. తలోజా జైల్లో ఉన్న అబూసలేంను విచారణ కోసం వేర్వేరు నగరాలకు పోలీసులు తీసుకెళ్తుంటారు. సరిగ్గా ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు సలేం. రైల్వేస్టేషన్‌ వెయింటింగ్ రూంలలో తన భార్య సయ్యద్ బహార్ కౌసర్‌ను, ఇతర కుటుంబసభ్యులను కలుసుకుంటున్నాడన్న విషయం వెలుగులోకి వచ్చింది.   అబూ సలేంను తాను పెళ్లి చేసుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని కౌసర్ గత జూన్‌ నెలలో కోర్టును కోరింది. ఆ మధ్యలో ఒకసారి అతడిని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం నాశనం అయ్యిందని మీడియాకు ఎక్కింది. అయితే తాజా ఫోటోలు చూస్తే మాత్రం ఇద్దరూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భార్యభర్తలిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటోలు ప్రజంట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా..వీరికి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన పోలీసులకు మాత్రం వెన్నులో వణుకు పుడుతోంది.

మోడీ వేటు పడింది వీరిపైనే...

ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ఈ సందర్భంగా భారీ మార్పులు, చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. సహాయ మంత్రులైన నిహాల్చంద్ (పంచాయతీరాజ్), రామ్ శంకర్ కటారియ (మానవ వనరుల అభివృద్ధి), సన్వర్ లాల్ (జలవనరులు), మోహన్ కుందారియా (వ్యవసాయం), మనుసుఖ్భాయ్ వాసవ్లను (గిరిజన వ్యవహారాలు) కేబినెట్ నుంచి తొలగించారు. కొందరికి పనితీరే కొలమానమైనప్పటికి..వ్యక్తిగత..రాజకీయ కారణాలు వేటు వేసేందుకు దోహదమయ్యాయి. పార్టీ భవిష్యత్తు, పాలనపై మరింత పట్టు సాధించేందుకు గానూ ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

పోలీసే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే..

డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి మీ ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ల ప్రాణాలను తీయకండి అని సూక్తులు చెబుతూ ఉంటారు పోలీసులు. మరి అలాంటి పోలీస్ శాఖకు చెందిన వ్యక్తే తాగి వాహనం నడిపితే. ముంబైకి చెందిన గణేశ్ పవార్ అనే కానిస్టేబుల్ ఫుల్లుగా మద్యం తాగి వాహనం నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న కారుపైకి దూసుకెళ్లాడు. తాగి కారు నడపడమే కాకుండా గాయపడిన క్షతగాత్రుడికి సాయం చేయకుండా అక్కడి నుంచి కారులో పారిపోయాడు. అయితే ఈలోగా స్పందించిన స్థానికులు కారు నెంబరును పోలీసులకు అందజేయండతో వారు ఛేజింగ్ చేసి మనోడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు తన స్నేహితుడిదని డ్రైవింగ్ నేర్చుకోవడానికి తీసుకున్నానని బుకాయించాడు..అయితే అతను తాగినట్టు గుర్తించిన పోలీసులు పవార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి మరీ అరెస్ట్ చేశారు.

మోడీ కొత్త సహచరులు వీరే..

అనేక తర్జన భర్జనలు..చర్చల మధ్య ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. వీరిలో ఎక్కువ మంది దళితులు మరియు ఈబీసీలే . వారిలో పలువురికి తొలిసారే స్వతంత్ర హోదాను సహాయ మంత్రులుగా పదవులు కట్టబెట్టారు. మార్చి-ఏప్రిల్‌లో జరిగే ఉత్తరప్రదేశ్, మరో రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు.  కొత్త మంత్రులు వీరే: 1.ప్రకాశ్ జవదేకర్ - ప్రమోషన్ - కేబినెట్ హోదా 2.షగన్ సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్) 3. ఎస్ఎస్ అహ్లూవాలియా (పశ్చిమ బెంగాల్) 4. రమేష్ జిగజ్నాగ్ (కర్నాటక) 5. విజయ్ గోయల్ (రాజస్థాన్) 6. రాందాస్ అథవాలే (మహారాష్ట్ర) 7. రజేన్ గోయెన్ (అసోం) 8. అనిల్ మాధవ్ దవే (మధ్యప్రదేశ్) 9. పురుషోత్తం రూపాలా (గుజరాత్) 10. ఎంజే అక్బర్ (మధ్యప్రదేశ్) 11. అర్జున్ రామ్ మేఘావాల్ (రాజస్థాన్) 12. జశ్వంత్ సిన్హ్ భభోర్ (గుజరాత్) 13. మహేంద్రనాథ్ పాండే (ఉత్తర ప్రదేశ్) 14. అజయ్ టాంటా (ఉత్తరాఖండ్) 15. కృష్ణరాజ్ (ఉత్తర ప్రదేశ్) 16. మన్‌సుఖ్ మాండవ్యా (గుజరాత్) 17. అనుప్రియా సింగ్ పటేల్ (ఉత్తర ప్రదేశ్) 18 సీఆర్ చౌదరి (రాజస్థాన్) 19. పిపి చౌదరి (రాజస్థాన్) 20. సుభాష్ భమ్రే (మహారాష్ట్ర)