మరో ఆఫర్ తో ఎయిర్ ఇండియా..
posted on Jul 11, 2016 @ 1:10PM
కొత్త కొత్త ఆఫర్లని ప్రవేశపెట్టడంలో ఎయిర్ ఇండియా ఎప్పుడూ ముందే ఉంటుంది. గతంలో ప్రయాణికుల కోసం ఎన్నో ఆఫర్లను తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా ఇప్పుడు మరో కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. అదేంటంటారా.. లాస్ట్ మినిట్లో అకస్మాత్తుగా ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే విమాన సంస్ధలు ధరలు అమాంతం పెంచేస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ ఎయిర్ ఇండియా.. రాజధాని ఎక్స్ ప్రెస్ టికెట్ ధరలకంటే తక్కువ ధరలకే టికెట్లను ఆఫర్ చేస్తూ ప్రయాణీకులను ఆకట్టుకుంటోంది. చివరి నిమిషంలో తమ విమాన టికెట్ల ధరలను మరింత తగ్గిస్తూ.. ఆక్యుపెన్సీ పెంచుకునే దిశలో ఎయిర్ ఇండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వనీ లోహానీ మాట్లాడుతూ.. చివరి నిమిషంలో విమాన ప్రయాణాన్ని ఎంచుకునే ప్రయాణికులకు అందుబాటు ధరలతో ఉపశమనం అందించడంతోపాటు, మిగిలిన ఖాళీ సీట్లు పూరించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాజధాని ఎక్స్ ప్రెస్ ఎసీ టు టైర్ ధరలు ఢిల్లీ-ముంబై రూ. 2,870, ఢిల్లీ-చెన్నై రూ.3,905. ఢిల్లీ-కోలకతా రూ.2,890 ఢిల్లీ-బెంగళూరు రూ.4,095 లుగా ఉండగా.. ఇప్పుడు ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకుంటే.. ఈ ధరకంటే తక్కువ ధరలకే.. తక్కువ సమయంలో విమానంలో ప్రయాణించవచ్చని తెలిపారు.