చిదంబరం తనయుడు కార్తికి ఈడీ సమన్లు..

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం చిక్కుల్లో పడ్డాడు. ఎయిర్‌సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంలో ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. 2006 సంవత్సరంలో మాక్సిస్ సంస్థ అక్రమంగా ఎయిర్‌సెల్‌లో 80 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రత్యేక చొరవతో అనుమతిచ్చారని ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే కార్తి చిదంబరంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖతో కలిసి అతడి ఆస్తులపై సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కార్తికి నోటీసులు జారీ చేసింది..మ్యాక్సిస్, ఎయిర్‌సెల్ ఒప్పందానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో ఇవాళ ఉదయం ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది.

హైదరాబాద్‌లో ఏపీ టీడీపీ నేత భవంతిని కూల్చేసిన జీహెచ్‌ఎంసీ

తెలుగుదేశం పార్టీ నేత, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు‌కు చెందిన భవంతిని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు భారీ పోలీసు భద్రత మధ్య కూల్చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.17లో కంభంపాటి భవంతి ఉంది. దీనిని ఆయన నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నిర్మించారని అధికారులు పేర్కొన్నారు. పలుమార్లు నోటీసులు పంపినప్పటికి స్పందించకపోవడంతో అక్రమ భవనాన్ని కూల్చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చే సందర్భంలో జీహెచ్‌ఎంసీ అధికారులకు, కంభంపాటి అనుచరులకు మధ్య వాగ్వివాదం జరగడంతో పోలీసులు అనుచరులను చెదరగొట్టారు.

మనోభావాలు దెబ్బతీయం:చంద్రబాబు

కృష్ణా పుష్కరాల సందర్భంగా జరుగుతున్న పనుల నిమిత్తం విజయవాడలో కొన్ని దేవాలయాలను అధికారులు కూల్చివేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తొలగించే విషయంలో ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే మంత్రుల కమిటీ వేశామని..ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తానని భరోసా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా రోడ్లపై అనుమతి లేకుండా అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టారని..వీటన్నింటిని తొలగించాల్సి ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రోడ్లపై విగ్రహాలు, దేవాలయాలు నిర్మించకుండా చట్టం చేశామని గుర్తు చేశారు. రోడ్ల విస్తరణలో తప్పనిసరిగా దేవాలయాలు తొలగించాల్సి వస్తే సమీపంలోనే కొత్తవి నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో టీడీపీ, బీజేపీ శ్రేణులు ఉద్రిక్తతలకు పోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

సౌకర్యాలపై ఉద్యోగులను ఆరా తీసిన చంద్రబాబు..

తన విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగుల పట్ల చంద్రబాబు మరోసారి తన కృతజ్ఞత చాటుకున్నారు. చైనా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన ఇవాళ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. ఐదవ బ్లాకులో ఏర్పాటైన శాఖల కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు.   తాత్కాలిక సచివాలయంలో వసతులు ఎలా ఉన్నాయి..? మీకు బస ఎక్కడ ఏర్పాటు చేశారు..? భోజనం రుచికరంగా ఉంటోందా..?  ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండి..? ఎవరూ ఇబ్బందులు పడకుండా చూసుకుంటామన్నారు. ఇక్కడికి రావడానికి రహదారులు సరిగ్గా లేవని కొందరు ఫిర్యాదు చేశారు..దీనిపై స్పందించిన సీఎం త్వరలోనే ఆ సమస్య తీరిపోతుందని హామీ ఇచ్చారు. మిగిలివున్న పనులను యుద్థప్రాతిపదికన పూర్తి చేయాలని, మిగతా భవనాలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ తదితరులున్నారు.

స్వాతంత్ర్యదినోత్సవం రోజునే ఇద్దరు అమెరికా అధ్యక్షుల మరణం

ప్రపంచ చరిత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అనేక దేశాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని..రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం కింద ఏలింది బ్రిటన్. అలా ఏళ్లపాటు పరాయి పాలనలో మగ్గిన అమెరికా స్వాతంత్ర్యం కోసం పోరాడింది. చివరకు 1776 జూలై 4న స్వతంత్ర దేశంగా మారింది. జార్జ్‌వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, ధామస్ జెఫర్‌సన్‌లు వరుసగా అధ్యక్షులుగా సేవలు అందించారు. అయితే ఆశ్చర్యకరంగా అమెరికా 50వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంటే 1826 జూలై 4న మాజీ అధ్యక్షులైన జాన్ ఆడమ్స్, జెఫర్‌సన్ ఇద్దరూ మరణించారు. అలా ఒకే రోజున మరణించిన వీరిని అమెరికా ప్రజలు ప్రతీ ఏడాది స్మరించుకుంటారు.

ఫేస్‌బుక్‌కు షాక్..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు పెద్ద షాక్ తగిలింది. బ్రెజిల్ పోలీసులు ఆ సంస్థకు చెందిన 60 లక్షల డాలర్లను ఫ్రీజ్ చేశారు. ఓ అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా కేసుకు సంబంధించి నిందితులు సమాచార మార్పిడి కోసం వాట్సాప్‌ను ఆశ్రయించారు. దానితో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ వివరాలు తమకు ఇవ్వాలని గత కొద్ది రోజులుగా వాట్సాప్‌ను విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. నోటీసులు పంపించినా అందుకు వాట్సాప్ నుంచి స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన పోలీసులు వాట్సాప్ సేవలను నిలిపివేశారు. అలా మే నెలలో మూడు సార్లు వాట్సాప్‌ను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికి వాట్సాప్‌ లొంగకపోవడంతో చివరకు విచారణలో భాగంగా ఈ సంస్థకు అసలు యజమాని అయిన ఫేస్‌బుక్‌కు చెందిన 60 లక్షల డాలర్లను ఫ్రీజ్ చేశారు.

కవిత "ఆంధ్ర"కు జై కొట్టింది...

రాజకీయ చాణక్యంలోనూ..వాగ్ధాటిలోనూ తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత. తెలంగాణ ఉద్యమంలో "ఆంధ్ర" అన్న పదం వినబడితే చాలు చిర్రెత్తిపోయేవారు కవిత. తమను దోచుకున్నారని..నాశనం చేశారని ఆంధ్రా ప్రాంతం వారిపై విరుచుకుపడేవారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఆమె "ఆంధ్రా" అంటే కయ్యానికి కాలుదువ్వుతూనే ఉన్నారు.   అలాంటి కవిత "ఆంధ్రకు జై" కొట్టారు. అవును ఇది పచ్చి నిజం. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ "తానా" సభలకు కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె తెలుగువారు ఎక్కడున్నా ఒక్కటేనని..రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి ప్రసంగం చివర్లో "జై తెలంగాణ", "జై ఆంధ్రా" అని పలికారు. ఇది అక్కడున్న వారికి ఆనందాన్ని..ఆశ్చర్యాన్ని ఒకేసారి కలిగించింది. రాజకీయ నేతలు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతారని విన్నాం..ఇప్పుడు కవిత ఇలాగే మాట్లాడారా..? లేక నిజంగానే తెలుగువారందరి పక్షానా మాట్లాడారా..?

స్వాతి నన్ను కొండముచ్చు అంది..అందుకే చంపా

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చెన్నైకు తరలించారు. పాళయం కోట్టై ఆసుపత్రిలో దేవరాజన్ నేతృత్వంలోని విచారణ బృందానికి రామ్‌కుమార్ వాంగ్మూలం ఇచ్చాడు. ఫేస్‌బుక్ ద్వారా స్వాతితో పరిచయం ఏర్పడిందని..ఆమె కోసమే చెన్నై వచ్చినట్టుగా పేర్కొన్నాడు.   తాను ప్రేమించమని ఒత్తిడి తెచ్చినప్పుడల్లా స్వాతి చీదరించుకునేదని..అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో తన మీద ఆమెకు ప్రేమ ఉందని భావించానన్నాడు. అందుకే పదేపదే ఆమె వెంట పడ్డానని చెప్పాడు. చివరకు తన ప్రేమను తిరస్కరించడంతో పాటు కొండముచ్చవలే ఉన్నావని పదేపదే అనడంతో బాధపడ్డానని దీంతో తనలోని ఉన్మాది బయటకు వచ్చాడని, మీనాక్షిపురానికి వచ్చి ఓ తోటలో అరటి గెలలు కోయడానికి ఉంచిన కత్తిని రహస్యంగా తీసుకుని వెళ్లినట్టు చెప్పాడు. ఆమెను బెదిరించాలని మాత్రమే అనుకున్నానని..కాని స్వాతి మాటలు తనను ఉన్మాదిని చేసినట్టు, హంతకుడిగా మార్చేసినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తదుపరి విచారణ నిమిత్తం రామ్‌కుమార్‌ను పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో చెన్నైకి తరలించారు.

ఐస్‌క్రీమ్‌ తిని డబ్బులు అడిగినందుకు చంపేశారు..

ఐస్‌క్రీమ్ తిని డబ్బులు అడిగినందుకు ఓ వ్యాపారిని కొట్టి చంపారు కొందరు దుర్మార్గులు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మహారాజ్‌పూర్‌లో ఇస్లాం అనే చిరు వ్యాపారి తన భార్య, పాప, బాలుడుతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఐస్ క్రీం అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే కొంతమంది యువకులు ఇస్లాం వద్ద బలవంతంగా ఐస్ క్రీంలను బలవంతంగా లాక్కొని తినేవారు. వాటికి డబ్బులు చెల్లించేవారు కాదు. ఇలా ప్రతి రోజు చేస్తుండటంతో తనకు నష్టం రావడంతో పాటు విసిగిపోయిన ఇస్లాం తిన్న ఐస్‌క్రీంకు డబ్బివ్వాలని కోరాడు. అంతే మమ్మల్నే డబ్బులు అడుగుతావా..? అంటూ వారంతా అతనిపై దాడి చేశారు. ఇస్లాం వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికి..అతని రెండు చేతులూ పట్టుకుని, మరణించే వరకూ కొట్టారు. ఆపై ఇస్లాం మృతదేహాన్ని ఇంటి ముందు తెచ్చి పడేసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు.

ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు..45 మంది మృతి

ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నైనిటాల్, చంపావత్, అల్మోరా, పౌరీ, హరిద్వార్, డెహ్రాడూన్, ఉత్తరకాశీ, పితోరగఢ్, ఛమోలీ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 10 నదులు వాటి ఉపనదులు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకు 45 మంది మరణించినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, ఇండో-టిబెటన్ పోలీస్, సశస్త్ర సీమా బల్, రాష్ట్ర పోలీసులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.

బాగ్దాద్‌పై ఉగ్రదాడి..

ఉగ్రవాదుల వరుస దాడులతో ప్రపంచం వణికిపోతోంది. నిన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్‌లో 20 మందిని ముష్కరులు ఊచకోత కోసిన ఘటనను మరవకముందే ఇవాళ ఉగ్రభూతం మరోసారి పంజా విసిరింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో వరుస పేలుళ్లు సంభవించడంతో 70 మంది ప్రాణాలు కోల్పోగా...మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని రద్దీగా ఉండే కరాదా-డాఖిల్, షల్లాల్ మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. కరాదా వద్ద కారులో వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.  ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే షల్లాల్ మార్కెట్‌లో మరో పేలుడు సంభవించింది. రంజాన్ మాసం కావడంతో వ్యాపార సముదాయాలు కిటకిటలాడాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడ్డట్టు పోలీసులు భావిస్తున్నారు.

సికింద్రాబాద్‌లో దారుణం..పదేళ్ల బాలికపై అత్యాచారం..హత్య

సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. పదేళ్ళ చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బొల్లారం కళాసిగూడలో నివాసముంటున్న పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు అనిల్ అత్యాచారం చేసి హత్య చేశాడు. నిన్న అర్థరాత్రి చిన్నారిని కిడ్నాప్ చేసిన అనిల్ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చి అక్కడే పడేశాడు. ఉదయం చిన్నారి మృతదేహన్ని గుర్తించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ గతంలో ఎనిమిది హత్య కేసుల్లో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఢాకా ఉగ్రదాడి: భారత సరిహద్దుల్లో భద్రత పెంపు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్‌పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ సరిహద్దుల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ.. అధికారులను ఆదేశించింది. దీంతో పశ్చిమబంగా, అసోం, త్రిపుర, మేఘాలయ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో నుంచి భారత్‌లోకి ప్రవేశించి మార్గాల వద్ద సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ సైన్యానికి సూచించింది. అటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బంగ్లాదేశ్‌లోని దౌత్య అధికారులతో మాట్లాడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఢాకాలో ఉన్న భారతీయులందరూ క్షేమంగానే ఉన్నారని బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.