బంగాళదుంపలతో కరెంట్..

ప్రస్తుతం మనదేశంతో పాటు ప్రపంచం ముందున్న పెను సవాలు కరెంట్. అన్ని అవసరాలు ఆ కరెంట్‌తోనే ముడిపడి ఉండటంతో దానికి ఫుల్లు డిమాండ్ ఉంటోంది. దీంతో ప్రతి ప్రభుత్వం కోట్లు కుమ్మరించి మరి కరెంట్‌ను కొంటోంది. అయితే అన్ని దేశాలు కరెంట్ కొనలేవు కదా..? ప్రస్తుతం ఇలాంటి పరిస్ధితుల్లోనే ఉంది నైజీరియా. దేశంలో తినడానికే తిండి లేక అష్టకష్టాలు పడుతున్న సమయంలో కరెంట్ సమస్య ఈ ఆఫ్రికా దేశాన్ని వణికిస్తోంది. తన దేశం ఎదుర్కొంటున్న సమస్యకు ఒక యువకుడు చక్కని పరిష్కారం చూపాడు.  అలబి ఒలుసోలా అనే యువకుడు అనేక ప్రయోగాల ద్వారా బంగాళదుంపల నుంచి విద్యుత్‌ను తయారుచేశాడు. అలా తయారు చేసిన కరెంట్‌ను ఇంటి అవసరాలకు వాడుకుంటూ తమ కుటుంబానికి కరెంట్ బిల్లు కట్టె బాధ తప్పించాడు. ఆ యువకుడు చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం...ఆ మార్గంలో సహజ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంపై దృష్టిసారించింది.

బోర్ కొట్టి థ్రిల్ కోసం కత్తితో దాడి..

  రోజు రోజుకి మనుషులు ఎలా తయారవుతున్నారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న చెన్నైకి చెందిన ఓ మెడికో కుక్కని టెర్రస్ పై నుండి వదిలి తన పైశాచికాన్ని చూపించాడు. ఇప్పుడు కేవలం తన థ్రిల్ కోసమే ఓ వ్యక్తి అందరిపై కత్తితో దాడి చేస్తూ అందరిని భయపెడుతున్నాడు. ఈ భయంకరమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. 31 ఏళ్ల జంగ్ అనే వ్యక్తికి రాత్రి సమయంలో ఒంటరిగా రోడ్డుపై నడుకుంటూ వెళ్లే వాళ్లమీద పదునైన కత్తితో దాడి చేస్తుంటాడు. మోటర్ సైకిల్ పై వేగంగా వచ్చి పదునైన కత్తితో నిందితుడు దాడి చేసి పారిపోయేవాడు. అలా ఓ మహిళపై దాడి చేయగా.. కత్తి పన్నెండున్నర ఇంచెల లోపలికి చొచ్చుకుపోయి.. ఆమె వీపుకు ఏకంగా 32 కుట్లు పడ్డాయి. ఇంకా పలువురు పై జంగ్ దాడి చేశాడు. అయితే స్థానికులు ఈ ఫోటోలను తీసి ఇంటర్నెట్‌లో పెట్టడంతో ఇది వెలుగు చూసింది. దీంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేసి జంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను చెప్పిన సమాధానం విని పోలీసులే అవాక్కయ్యారు. కేవలం కేవలం బోర్ కొట్టడంతో.. థ్రిల్ కోసం ఇలా చేశానని చెప్పాడు. ఇది విన్న నెటిజన్లు అతడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

దారుణం..కొడుకుని రైలు కిందపడేసిన తండ్రి...

  ముంబైలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రే తన బిడ్డను రైలు నుండి విసిరేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. సమీనా ఖాన్, ఖాదిర్ ఖాన్ అనే దంపతులకు రెండేళ్ల కైఫ్ ఖాన్ కుమారుడు ఉన్నాడు. అయితే రంజాన్ పండుగ సందర్బంగా వారు ముంబైలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ కైఫ్ కనిపించకపోవడంతో తల్లి సమీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే ఖాదిర్ ఖాన్ సమీనాకు ఫోన్ చేసి తాను కైఫ్ ఖాన్ ను కదులుతున్న రైలు కింది పడేశానని చెప్పాడు. విషయం విన్న సమీనా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సమాచారం మేరకు రైల్వే పోలీసులు కైఫ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఖాదిర్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. మరోవైపు తన భర్త ఎందుకిలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదని సమీనా కన్నీరుమున్నీరుగా విలపించింది.

ఇంటికో విమానం.. జగన్

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత కొద్దిరోజులుగా విదేశీ టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇక అలా తిరిగొచ్చారో లేదే అప్పుడే చంద్రబాబు నాయిడిపై విమర్శల బాణాలు వదులుతూనే ఉన్నారు. ఈ రోజు ఆయన ఇడుపులపాయ గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని.. కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా నెరవేర్చడంలేదని ఆరోపించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఇంటికో కారు లేదంటే ఏకంగా విమానమే ఇస్తామని చంద్రబాబు చెబుతారని ఎద్దేవ చేశారు. గత ఎన్నికల సమయంలో రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పటివరకు ఎవరికీ రుణాలు మాఫీ చేయలేదని వైఎస్ జగన్ విమర్శించారు.

హైకోర్టును ఆశ్రయించండి.. వైసీపీకి సుప్రీం

  ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి చాలామంది ఎమ్మెల్యేలు జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే తమ పార్టీ నుండి జంప్ అయిన ఎమ్మెల్యేలపై వైసీపీ పార్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటషన్లో పేర్కొంది. అయితే ఇప్పుడు దీనిపై విచారించిన సుప్రీంకోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది. కేసు విచారణను హైకోర్టు త్వరగా పూర్తి చేస్తుందని.. అందుకే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.   కాగా పార్టీ మారిన మ్మెల్యేల అనర్హతపై వైకాపా నేతలు ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేయగా.. వైకాపా ఇచ్చిన నోటీసు నిబంధనల ప్రకారం లేదని సభాపతి తిరస్కరించిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు చెవిలో గవర్నర్.. ఏం చెప్పారబ్బా..!

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలోని ఉమ్మడి సచివాలయంలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సచివాలయం మొత్తం సందర్శించి.. అనంతరం చంద్రబాబుతో పలు విషయాల గురించి చర్చించారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా గవర్నర్, చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదేంటంటే.. భేటీ అనంతరం ఇద్దరూ బయటకి రాగా నరసింహన్, చంద్రబాబుతో చెవిలో ఏదో చెప్పారు. అంతే దీంతో ఇప్పుడు అందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. గవర్నర్, చంద్రబాబు చెవిలో చెప్పిన విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారు. ఎందుకంటే వీరిద్దరి ఇలా మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. పబ్లిక్‌గా ఇద్దరు ఇలా వ్యవహరించిన సందర్భం ఇప్పటివరకు రాలేదు. అందుకే అందరూ ఏం మాట్లాడుకున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి నరసింహన్, చంద్రబాబు చెవిలో ఏం చెప్పారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఏపీ టీడీపీ ఓకే.. కానీ ఎమ్మెల్యేలే..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడప్పుడూ అధికారులు, మంత్రుల పనితీరును బట్టి ర్యాంకులు ఇస్తుంటారు. అది తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆయన తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో సంతృప్తి లేదట. ఆ వివరాలేంటే ఓ లుక్కేద్దాం.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్వయంగా తానే ఓ సర్వే చేయించారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? ఎమ్మెల్యేల పనితీరు ఏ మేరకు ఉంది? అన్న కోణంలో చేయించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సర్వే ప్రకారం.. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారంట కానీ.. ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం సంతృప్తిగా లేరంట. ఇక దీనిపై స్పందించిన చంద్రబాబు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరచుకోకపోతే ఎలాగంటూ మండిపడ్డారంట. అంతేకాకుండా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల పనిబట్టాలని ఓ కమిటి ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు.

మరో ఆప్ ఎమ్మెల్యేపై కేసు..

  ఆప్ ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. ఇప్పటికే పలు వివాదాల వల్ల.. చాలా మంది ఎమ్మెల్యేలు పలు కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే కూడా ఈ జాబితాలో చేరాడు. దేవ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్ పై కేసు నమోదైంది. తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ మహిళ గ్రేటర్ కైలాశ్ పోలీసు స్టేషన్ లో ప్రకాశ్ జార్వాల్ పై ఫిర్యాదు చేసింది. దీన్ని స్వీకరించిన పోలీసులు అతనిపై 354, 506, 509 మరియు 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా బాధితురాలి వివరాలు వెల్లడించబోమని స్పష్టం చేసిన పోలీసులు, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో మహిళా అధికారిపై చెయ్యి చేసుకుని ప్రకాశ్ జార్వాల్  ఓసారి అరెస్టయిన సంగతి తెలిసిందే.

బాగ్దాద్‌పై మళ్లీ ఉగ్రపంజా..30 మంది మృతి

గత ఆదివారం రద్దీగా ఉన్న మార్కెట్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లతో 180 మంది అమాయక ప్రజలు మరణించిన సంఘటన మరచిపోకముందే ముష్కరులు మరోసారి బాగ్దాద్‌ నగరంపై పంజా విసిరారు. నగర ఉత్తర ప్రాంతంలోని బొలాడ్‌లోని షీతే ప్రార్థనా మందిరం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడి..ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందగా..50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

జెట్ ఎయిర్‌వేస్‌ బ్రేక్ ఫాస్ట్‌లో బొద్దింక..ప్రయాణికుడికి అస్వస్థత

నాణ్యమైన సేవలకు పేరు పొందిన విమాన సేవలు సైతం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చెడ్డపేరును మూటకట్టుకంటున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ముంబయి నుంచి రాజ్‌కోట్‌కు ప్రయాణించిన ఓ బిర్జుసల్లా అనే ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతనికి ఎయిర్‌లైన్స్ సిబ్బంది బ్రేక్‌ఫాస్ట్‌‌గా పరోటా, చెనా మసాలా ఇచ్చారు. దీనిలో బొద్దింక ఉండటంతో దీనిని సిబ్బంది గానీ..ప్రయాణికుడు గానీ గమనించకపోవడంతో దానిని తిన్న అతను అస్వస్థతకు గురయ్యాడు. కనీసం అతనికి వైద్యసాయం అందించకపోగా, వేరే ఆహారం ఇస్తామంటూ క్షమాపణలు చెప్పడంతో బిర్జు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జెట్ ఎయిర్‌వేస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. 

హైదరాబాద్‌లో సింథియా బంధువుల ఆందోళన..

భర్త చేతిలో దారుణహత్యకు గురైన కాంగో దేశానికి చెందిన సింథియాకు న్యాయం చేయాలంటూ ఆమె బంధువులు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌ ఎదుట దర్నా చేపట్టారు. సింథియాను క్రూరంగా హత్య చేసి..మృతదేహన్ని మాయం చేయాలని చూసిన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు పట్టుకుని పీఎస్ ఎదుట నినాదాలు చేశారు. బాధిత కుటుంబసభ్యులతో పాటు కాంగో అంబాసిడర్ కూడా వీళ్లకు జతకలిశారు. అనంతరం ఏసీపీ అనురాధను కలిసి వినతిపత్రం అందజేశారు. సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్ ప్రాంతానికి చెందిన రూపేశ్‌కుమార్ కుటుంబ కలహాలతో భార్య సింథియాను హత్య చేసి..శవాన్ని ముక్కలుగా చేసి, శంషాబాద్ వద్ద కాల్చివేశాడు. అనంతరం పారిపోయే ప్రయత్నంలో గ్రామస్తుల కంటపడటంతో మొత్తం బండారం బయటపడింది.

బెజవాడలో పరువు హత్య..కూతురిని హత్య చేసిన తల్లి

విజయవాడలో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేకుండా వేరే మతస్థుడిని ప్రేమించిందన్న సాకుతో కన్నతల్లే కూతురిని హత్య చేసింది. కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన బీబీజాన్‌కు ఇద్దరు కుమార్తెలు, చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో కుటుంబాన్ని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మార్చింది. అయినా కూతురు వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ మూడు నెలల కిందట విజయవాడలోని వాంబేకాలనీకి మకాం మార్చింది.   అక్కడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో ఆ అబ్బాయిని మరచిపోవాలని పలుమార్లు చెప్పి చూసింది అయినా నజ్మా వినలేదు. దీంతో బీబీలో ఆవేశం కట్టలు తెంచుకుంది. మంగళవారం రాత్రి నిద్రపోతున్న కుమార్తె ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. నిన్న ఉదయం విషయం బయటకు తెలియడంతో కడుపునొప్పితో కూతురు చనిపోయిందని అందరినీ నమ్మించింది. అయితే నజ్మాను ప్రేమించిన దీపక్ అనే యువకుడికి ఈ విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీబీని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించి కుటుంబం పరువు తీస్తుందన్న కోపంతోనే తాను నజ్మాను చంపినట్టు ఆమె అంగీకరించింది. 

బాబు లేకపోతే అమరావతి లేదు: గవర్నర్ నరసింహన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలను ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ..కొత్త ఇళ్లు కట్టుకుంటున్నపుడు కొన్ని సమస్యలు రావడం సహజమేనని..సమస్యలను అర్థం చేసుకుని ఉద్యోగులు వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగులు పని చేసేందుకు అనుకూల వాతావరణం కలిపిస్తున్నారని..అమరావతి నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ప్రశంసనీయమన్నారు. నేను తెలంగాణకే పరిమితమయ్యాయనని విమర్శించడం తగదని..ఏపీలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్న అజెండాతోనే నా పర్యటన అని నరసింహన్ వివరించారు.

బంగ్లాదేశ్‌పై మరో ఉగ్రదాడి.ఈద్గా వద్ద భారీ పేలుడు

బంగ్లాదేశ్‌ను ఉగ్రభూతం వెంటాడుతూనే ఉంది. వారం క్రితం ఢాకాలో విదేశీయులే లక్ష్యంగా రెస్టారెంట్‌పై దాడి చేసి..20 మంది విదేశీయులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన ఘటన ఇంకా కళ్ల ఏదుట మెదులుతుండగానే ముష్కరులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. రాజధాని ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలోని కిషోర్ గంజ్ పట్టణంలో ఇవాళ రంజాన్ కావడంతో దేశంలోనే అతిపెద్ద షోలాకియా ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపి..ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటుండగా పెద్ద శబ్థంతో పేలుడు సంభవించింది. ఈద్గాకు సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు లోపలి నుంచి కాల్పులు జరుపుతున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను ముట్టుపెట్టే ఆపరేషన్‌ను ప్రారంభించారు. దీంతో పండుగ వాతావరణం కాస్తా భీతావాహంగా మారిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా..12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గవర్నర్ నరసింహన్‌కు ఏపీ సీఎం పసందైన విందు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి పసందైన విందు ఇచ్చారు. విజయవాడ పర్యటనకు వచ్చిన గవర్నర్‌, సీఎంతో కలిసి ఓ హోటల్‌లో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు ఒకే వాహనంలో ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు.   అక్కడ చంద్రబాబు కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ నరసింహన్‌కు స్వాగతం పలికారు. గవర్నర్ రాకను పురస్కరించుకుని సీఎం 15 రకాల ఆంధ్రా వంటకాలను రెడీ చేయించారు. వీటిలో క్యారెట్ బొబ్బట్లు, గారెలు, పూర్ణం బూరెలు, పచ్చి శనగపప్పు గోంగూర కూర, టమోటా కొత్తిమీర చట్నీ, ఆంధ్రా గోంగూర చట్నీ, దొండకాయ, బీరకాయ చట్నీ, మిక్స్ డ్ వెజిటబుల్ కూర, ఉలవచారు, ముద్దపప్పు, మునక్కాయ, బెండకాయ కూరలు, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు, సాంబారు, రసం ఉన్నాయి. విందు అనంతరం కారు వద్దకు వచ్చి మరీ గవర్నర్ నరసింహన్‌కు చంద్రబాబు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ముఖ్యమంత్రి స్వీట్ బాక్స్‌, గిఫ్ట్ ప్యాక్, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.

ఏపీ ప్రభుత్వ సైట్‌లోకి తెలంగాణ ఉద్యోగి లాగిన్..?

వరుస వివాదాలతో రెండు తెలుగు రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో మరో వివాదం తలెత్తింది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్‌లోడ్ చేసిన సమాచారం మొత్తం తాము రూపొందించిందే అని ఆరోపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం..చంద్రబాబు సర్కార్ తమను కాపీ కొట్టిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్న తాము గతేడాడే రెండో స్థానంలో ఉన్నామని..ఇలాంటప్పుడు ఇతర రాష్ట్రాల సమాచారం కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వాదిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 2న తెలంగాణకు చెందిన ఓ ఉన్నతాధికారి తమ వెబ్‌సైట్‌లోకి చొరబడ్డారని..ఆ ఉద్యోగి ద్వారానే తాము అప్‌లోడ్ చేసిన సమాచారం తెలంగాణకు చేరిపోయిందని..ఇది ముమ్మాటికి హ్యాకింగేనని అంటోంది.