చంద్రబాబు రష్యాలో.. మనసు ఏపీలో..
posted on Jul 12, 2016 @ 10:35AM
ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తూ.. విదేశీ పర్యటనల ద్వారా... రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి గట్టిగా ప్రయత్నిస్తూ... రాష్ట్ర పరిస్థితులను ఎప్పుటికప్పుడు సమీక్షిస్తూ.. ఆదిశగా పాలన సాగిస్తున్నారు. అయితే ఇది మరోసారి నిరూపించారు చంద్రబాబు. ఆయన రష్యా పర్యటనలో ఉన్నాగానీ.. ఆయన దృష్టి మాత్రం రాష్ట్రంపైనే ఉంది. అక్కడి నుండే రాష్ట్రంలోని పరిస్థితుల గురించి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. గత మూడు నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తింది. దీంతో పట్టిసీమకు కూడా వరద ముప్పు పొంచి ఉండటంతో పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన అక్కడి నుంచే ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి చంద్రబాబు ఎక్కడ ఉన్నా మనసు మాత్రం ఏపీపైనే ఉంటుందని దీనిద్వారా తెలుస్తోంది.