అసదుద్దీన్ ఓవైసీ నోట..ఆశ్చర్యకరమైన మాట..
posted on Jul 11, 2016 @ 4:29PM
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఐసిస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసదుద్దీన్ ఐసిస్ పై మండిపడ్డారు. మానవత్వానికి ఐసిస్ అత్యంత ప్రమాదకారి అన్నారు. కేవలం ముస్లింలకే కాదు, ప్రపంచ మానవాళికే ఐసిస్ ప్రమాదకరంగా మారనుందని.. ముస్లింల ముసుగులో ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఐసిస్‌తో ఇస్లాంకు సంబంధం లేదన్నారు. ఉగ్రదాడి అనగానే ముస్లింలను అనుమానిస్తున్నారని, అలా అనుమానించవద్దని విజ్ఞిప్తి చేశారు. దాని అధినేత అబూబకర్ పచ్చి అబద్ధాలకోరని, ఇస్లాం పేరుతో ఇస్లాంను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. సజీవంగా కనిపిస్తే ముస్లింలు అతణ్ని వంద ముక్కలు చేయడం ఖాయమని హెచ్చరించారు. మదీనాపై ఉగ్రదాడి పెద్ద నేరమని, అది యావత్ ముస్లింలపై జరిగిన దాడని, ఇలాంటి దాడులను సహించేది లేదని అన్నారు.ఐసిస్ అంతం తప్పదని, దాని కోసం ముస్లింలు ఐక్యం కావల్సిన అవసరం ఉందన్నారు.
అయితే ఇంతా మాట్లాడిన ఆయన.. ఎన్ఐఏ ఉగ్రవాదులు అంటూ అరెస్ట్ చేసిన వారు అమాయకపు యువకులని.. వారి తల్లిదండ్రులు నన్ను కలిశారు.. వారిని న్యాయం అందిస్తానని అన్నారు. ఆ యువకులు నిర్దోషులని తేలితే వారిని అరెస్ట్ చేసిన అధికారులను సస్సెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆంతర్యం ఏంటో ఎవరికి అర్ధంకాక అందరూ అవాక్కవుతున్నారు.