ఎమ్మెల్యేలు అయిపోయారు.. టీడీపీలోకి ఎమ్మెల్సీల వలసలు..
posted on Jul 13, 2016 @ 2:54PM
ఇప్పటివరకూ ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల వలసలు అయిపోగా.. ఎమ్మెల్సీల వంతు మొదలైనట్టుంది. ఇప్పటికే వైసీపీ నుండి ఒక ఎమ్మెల్సీ పార్టీ నుండి వెళ్లిపోగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి అప్పారావు. ఈయన కూడా టీడీపీ కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
కాగా గతంలో ఆదిరెడ్డి టీడీపీలోనే ఉండేవారు. అయితే 2014 ఎన్నికల ముందు ఈయన వైసీపీలోకి జంప్ అయ్యారు. అప్పటి నుండి జిల్లాలో జగన్ ఏ కార్యక్రమం చేపట్టిన దానికి ఆదిరెడ్డినే ఖర్చుచేసేవాడట. ఒక్కో కార్యక్రమానికి దాదాపు 15 నుండి 20 లక్షలు ఖర్చుచేసేవాడట. దీంతో తమ పార్టీకి అధికారం మాట దేవుడెరుగు.. పార్టీ తలపెట్టే కార్యక్రమానికి ఖర్చు తీవ్రమవుతుందని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయారట. ఈక్రమంలో పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్టు ఆదిరెడ్డి సహచరులు చెబుతున్నారు.