మారని పాకిస్థాన్.. మీ పని చూస్కోండి అన్న భారత్..
posted on Jul 12, 2016 @ 12:59PM
భారత్ కు ప్రత్యర్ధ దేశమైన పాకిస్థాన్ కు మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో విభేధాలు తలెత్తుతూనే ఉంటాయి. రెండు దేశాలు ఎంత స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకుందామని చూసినా అది మాత్రం ఎప్పటికీ కలలాగనే మిగిలిపోతుంది. అందుకే రెండు దేశాల మధ్య ఎప్పుడో జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య మరో వివాదం తెరపైకి లేచినట్టు తెలుస్తోంది.
అదేంటంటే ఇప్పటికే హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ మృతికి కాశ్మీర్లో చెలరేగిన మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు దీనిపై స్పందించిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుర్హాన్ వనీ మృతి విషయం విని షాక్ కు గురైనట్టు.. కశ్మీర్ నేతలను, ప్రజలను ఆర్మీ చంపేస్తోందని వ్యాఖ్యానించారు. వనీ మృతికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రజలపై భారత్ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ మిలటరీని ఉపయోగించి కాల్పులకు పాల్పడుతోందని ఆరోపించింది. అంతేకాక కశ్మీర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నవాజ్ డిమాండ్ చేశారు. తద్వారా కశ్మీర్.. పాకిస్థాన్‌లో ఉండాలో, భారత్‌లో ఉండాలో ప్రజలే తేల్చుకుంటారని పేర్కొన్నారు
దీంతో నవాజ్ వ్యాఖ్యలకు స్పందించిన భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగు దేశం గురించి కాకుండా, సొంత దేశం గురించి ఆలోచించుకుంటే మేలని హెచ్చరించింది. పాకిస్థాన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ ప్రతినిధి వికాశ్ స్వరూప్ పేర్కొన్నారు. పొరుగు దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం ఆ దేశానికే మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై రెండు దేశాల మధ్య ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి.