తెలంగాణ చేప కొర్రమీను.. మరి ఏపీకి..?
posted on Jul 20, 2016 @ 5:01PM
తెలంగాణ రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు అయింది. ఇప్పటికే ఈ రాష్ట్రం తమ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇంకా రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర పండు మామిడి, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు, రాష్ట్ర క్రీడ కబడ్డీ, రాష్ట్ర జంతువు కృష్ణ జింకగా కూడా ప్రకటించుకున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా తమ రాష్ట్ర చేపగా కొర్రమీనను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
కాగా తెలంగాణ రాష్ట్ర చేపగా కొరమీనను గుర్తించాలని మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్క రాష్ట్రం తమ రాష్ట్ర చేపగా ఒక్కో రకాన్ని గుర్తించాయని.. వాటి అభివృద్ధి కోసం నిధులు కూడా కేటాయిస్తున్నారని తెలిపారు. అందుకే తెలంగాణలో అత్యధికంగా లభించే .. ప్రజలు ఎక్కువగా ఇష్టపడి తినే కొర్రమీనను తెలంగాణ రాష్ట్ర చేపగా గుర్తించాలని కోరారు. ఇప్పటికే 16 రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు చేపలను గుర్తించాయని తెలిపారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కొర్రమీనను రాష్ట్ర చేపగా గుర్తించింది. ఇప్పుడు తెలంగాణకు చేపను కొర్ర మీనగా గుర్తిస్తే ఏపీ రాష్ట్ర మరో చేపను ఏపీ చేపగా గుర్తించాల్సి ఉంటుంది. మరి దీనిపై ఏపీ ఏం చేస్తుందో చూడాలి.