నన్ను అవమానించారు.. అలాంటప్పుడు ఎందుకు పిలవాలి..
posted on Jul 20, 2016 @ 11:40AM
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ప్రధాని నేరంద్ర మోడీపై ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఆరోపణలు చేస్తూనే ఉండటం కామన్. ఇప్పుడు కూడా కేజ్రీవాల్ తనకు అవమానం జరిగిందని ఆరోపిస్తున్నారు. మోడీ గత వారం ముఖ్యమంత్రులందరితో సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశానికి వచ్చిన తనను ఫోన్ బయటే పెట్టి వెళ్లాలని భద్రతా సిబ్బంది కేజ్రీవాల్ ను కోరారట. తనతో పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ కూడా బయట పెట్టమని కోరారట. దానికి ఆమె బెంగాల్ లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అప్పుడు పరిస్థితి ఏంటని.. తనకెలా తెలుస్తుందని ప్రశ్నించగా ఆమె ఫోన్ తిరిగి ఇచ్చేశారంట. కానీ కేజ్రీవాల్ ఫోన్ మాత్రం సమావేశం పూర్తయ్యే వరకూ ఇవ్వలేదట. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కేజ్రీవాల్.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సమావేశానికి పిలిచి నన్ను అవమానించారని.. వ్యక్తులను బట్టి భద్రతా సిబ్బంది ప్రవర్తించి మమ్మల్ని అవమానించారని అన్నారు. అంతేకాదు.. తాను, మమత మాట్లాడుతున్న వేళ, ప్రసంగాలను పలుమార్లు అడ్డుకున్నారని, తాము చెప్పేది వినే ఓపిక లేకుంటే అసలెందుకు పిలవాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మొత్తానికి కేజ్రీవాల్ మాత్రం మోడీని ఏదో ఒకటి అననిదే మాత్రం ఊరుకోరు.